అడవితల్లి అందం... జలపాత సౌందర్యం
మన దగ్గరే! - మల్లెల తీర్థం
కోకిల గీతాలు, నెమళ్లు నృత్యాలు, పారే సెలయేళ్లు, దుమికే జలపాతాలు... నల్లమల అడవుల్లో కనువిందు చేసే దృశ్యాలు ఎన్నో! కృష్ణానదికి ఇరువైపులా విస్తరించి ఉన్న నల్లమల అడవిని కళ్ల నిండుగా సందర్శించడానికి వారాంతాలు చక్కని ఎంపిక. హైదరాబాద్ నుంచి 232 కిలోమీటర్లు, శ్రీశైలం నుంచి 58 కి.మీ దూరంలో నల్లమల అడవులు ఉన్నాయి. దాదాపు 350 అడుగుల ఎత్తు నుంచి ఓ జలధార ఆకాశం నేలను ముద్దాడుతుందా అనిపించేలా దుముకుతుంటుంది. అంతెత్తు నుంచి పడుతున్న నీటి తుంపరలు మల్లెల విరిజల్లులా మనల్ని అభిషేకిస్తుంటాయి.
ఈ జలపాతానికే ‘మల్లెల తీర్థం’ అని పేరు. ఇక్కడి కొండలు, గుట్టలు, గిరిపుత్రుల పలకరింపులు.. మనసారా స్వాగతం పలుకుతాయి. పచ్చని చెట్ల నీడన, జలపాతపు చల్లదనానికి ఎండ దరిచేరదు. పరీక్షల ఒత్తిళ్ల నుంచి విద్యార్థులు, పని ఒత్తిడి నుంచి ఉద్యోగులు విశ్రాంతికి ఎంచుకునే ఆహ్లాదకర ప్రాంతం.
చూడదగినవి
మన్ననూరు వద్ద చెంచుల మ్యూజియం. అడుగడుగునా చెంచుల జీవనశైలిని కళ్లకు కడుతున్న కళాక్షేత్రమిది. అటవీ జంతువుల బొమ్మలను ఇక్కడ అందంగా కొలువుతీర్చారు. ఈ బొమ్మలను బట్టే చెంచుల జీవనశైలిని అవగాహన చేసుకోవచ్చు.
ట్రె క్కింగ్‌కి సరైన ప్రాంతం.
వెంట ఇవి తప్పనిసరి!
కెమెరా, వీడియోలు వెంట తీసుకెళితే ప్రకృతి అందాలను చిత్రరూపంగా బంధించుకోవచ్చు.
కాలినడకన ఎత్తు పల్లాలలో నడిచేందుకు వీలుగా షూ ధరించడం మేలు.
ఇది ఒక మారుమూల ప్రాంతం. అందుకని కళ్లజోడు, ఆహారం, మంచినీళ్లు, తగిన మందులు, బ్యాకప్ బ్యాటరీలు, దుప్పట్ల వంటివి తీసుకెళితే ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తవు.
అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ రాత్రులు ఉండటం కష్టం. ఇక్కడ రాత్రి పూట బస చేసేందుకు ఎలాంటి వసతీ లేదు.
తీర్థానికి దారి
హైదరాబాద్ నుంచి 232 కి.మీ
శ్రీశైలం నుంచి 58 కి.మీ
350 అడుగుల ఎత్తు నుంచి జలపాతం దుముకుతుంది.
కృష్ణానది నల్లమల అడవుల గుండానే సాగుతుంది.
సాహస పర్యాటకం పట్ల ఆసక్తి గలవారికి మల్లెల తీర్థం సరైన ఎంపిక.
బస్సులు, ప్రైవేట్ కార్లు/ ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి ఉదయం 7కు బయల్దేరితే 11 గంటలకు మల్లెల తీర్థానికి చేరుకోవచ్చు.