ఏడుబావుల అందాలు కనువిందు | waterfalls in mahabubabad-bhadradri border forest area | Sakshi
Sakshi News home page

ఏడుబావుల అందాలు కనువిందు

Published Sun, Oct 30 2016 1:15 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

ఏడుబావుల అందాలు కనువిందు - Sakshi

ఏడుబావుల అందాలు కనువిందు

ఒక బావిలో నుంచి మరో బావిలోకి జలధార
మహబూబాబాద్-భద్రాద్రి జిల్లాల సరిహద్దులో అద్భుత జలపాతం

 
బయ్యారం: ఏడుబావుల జలపాతం చూపరులను కనువిందు చేస్తోంది. ఇది మహబూబాబాద్ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతం లో ఉంది. ఏటా వర్షాకాలంలో ఏడుబావుల నుంచి నీరు ఒకదానిలో నుంచి మరొకదానిలో జాలు వారుతున్న అద్భుత దృశ్యం పర్యాటకులను కనువిందు చేస్తోంది.
 
చారిత్రక నేపథ్యమూ ఉంది..
 మహబూబాబాద్-భద్రాద్రి జిల్లాల సరిహద్దులో ఏడుబావులు ఉన్న పాండవులగుట్టకు చారిత్రక నేపథ్యం ఉంది. పాండవులు ఏడు బావులున్న ప్రాంతంలో అరణ్యవాసం చేయడంతో దీనికి పాండవులగుట్టగా పేరొచ్చినట్లు స్థానికులు చెబుతారు. పాండవుల తపోఫలం వల్ల ఏడు బావులు ఏర్పడ్డాయని అందుకే పై నుంచి కిందికి వచ్చిన నీరు కొంత దూరం తర్వాత అదృశ్యమవుతుందని ఈ ప్రాంతవాసుల నమ్మకం. గుట్టలపై నుంచి వచ్చే నీరు వర్షాకాలంలో ఒక దాని నుంచి మరో బావి లోకి ఇలా ఏడు బావుల్లో నుంచి జాలువారి భూమి చేరుతోంది. వేసవిలో నీటి జలధార ఆగినా బావుల్లో నీరు సమృద్ధిగా ఉంటుంది.
 
సాహసం చేస్తేనే బావుల వద్దకు..
 మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, గం గారం, భద్రాద్రి జిల్లా గుండాల, ఇల్లెందు మం డలాల సరిహద్దులో ఉన్న అటవీప్రాంతంలో ఈ జలపాతం ఉంది. బయ్యారం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిర్యాలపెంటకు వెళ్లి అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు కాలిబాటన నడిచి వెళ్లాలి. పాకాల కొత్తగూడెం నుంచి పాకాల-ఇల్లెందు మార్గం ద్వారా కూడా మిర్యాలపెంటకు చేరుకొని అక్కడి నుంచి  ఏడుబావుల వద్దకు వెళ్లొచ్చు. గుట్ట వద్దకు చేరిన తర్వాత ఏడుబావులను చూడాలంటే సాహసం చేయాల్సి  ఉంటుంది. గుట్టల పైకి వెళ్లేందుకు పాకురుబట్టిన రాళ్లపై అతిజాగ్రత్తగా 900 మీటర్ల వరకు ఎక్కితే మొదటిబావి వద్దకు వెళ్లే అవకాశం ఉంటుంది. కిందికి వచ్చిన నీరు కొంత దూరం తర్వాత కనిపిం చదు. వర్షాలు బాగా కురిసి జలపాతం నుంచి ధారాళంగా నీరు కిందికి వచ్చినప్పటికీ పై నుం చి వచ్చిన నీరు సుమారు 100 మీటర్ల దూరం ప్రవహించిన తర్వాత చూపరులకు కనపడవు. ఆ నీరు ఎక్కడికి చేరుతుందో స్థానికులకు సైతం అంతుబట్టని విషయంగా మారింది.  
 
రహదారి లేకపోవటంతో ఇబ్బందులు..
 పర్యాటకులు స్థానికుల సహకారం లేకుండా పాండవులగుట్ట వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. ఏడుబావుల వద్దకు వెళ్లడం ఇబ్బందికరంగా మారినా పలు ప్రాంతాల నుంచి వర్షాకాలంలో పర్యాటకులు జలపాతాల వద్దకు వస్తున్నారు. ప్రభుత్వం ఏడుబావుల వద్దకు రహదారి సౌకర్యం ఏర్పాటు చేస్తే అడవి అందాలను చూసే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement