ఆది దంపతులని ఎందుకు పేరు? | Adidampatulu Shiva Parvati | Sakshi
Sakshi News home page

ఆది దంపతులని ఎందుకు పేరు?

Published Sun, Mar 3 2019 1:34 AM | Last Updated on Sun, Mar 3 2019 1:34 AM

Adidampatulu Shiva Parvati - Sakshi

శివపార్వతులు ఆది దంపతులు. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. పార్వతీదేవి హిమవంతుని కూతురు. కలిగినవారింట పుట్టిన పిల్ల. బాల్యంలో భోగభాగ్యాలు అనుభవించింది. ఆకులయినా తినకుండా తపస్సు చేసి అపర్ణగా మారి ఆయనను తనవాడిగా చేసుకుంది. అయితే, ఆ జంగమయ్యను చేరాక ఆమె అంతకాలం అనుభవించిన భోగమంతా మటుమాయమైంది. కపాలం పట్టుకుని, భవతీ భిక్షాందేహీ.. అంటూ ఊరంతా తిరుగుతూ, వల్లకాడులో సంసారం నడపమంటాడాయన. అయినా పరమేశ్వరి భర్తను ఎన్నడూ తూలనాడదు. తొందరపాటుతనంతో చాలా సందర్భాల్లో పీకలమీదికి తెచ్చుకుంటాడు శివుడు. అయినా పల్లెత్తుమాటయినా అనదామె. గంగమ్మను తెచ్చి సిగలో తురుముకున్నా, లోకం కోసమే పతిదేవుడు ఈ పనిచేశాడని అర్థం చేసుకోగలిగింది.

శంకరుడు కూడా ఏ సందర్భంలోనూ పత్నికి అడ్డుచెప్పిందే లేదు. ఆమె నిర్ణయాలను కాదన్నదీ లేదు. తనకు దేనిమీదా అనురక్తిగానీ, ఆశలు కానీ లేకపోయినా, తనలో సగపాలయిన పార్వతీదేవికి ఉండవచ్చనేది ఆయన మాట. బాట. అతగాడు జడలు కట్టిన కేశాలతో... తోలుదుస్తులతో, కాలసర్పమే కంఠాభరణంగా తిరుగాడినా అమ్మవారు మాత్రం ఏడువారాల నగలతో పట్టుపీతాంబరాలతో సర్వాలంకారశోభితమై అలరారుతుంది. ఆయన వాక్కు అయితే, ఆమె ఆ వాక్యానికి అర్థం. ఆయన ఆదిభిక్షువైతే, ఈమె ఆయనకు అన్నం పెట్టే అన్నపూర్ణ అవుతుంది. ఇంతటి ఒద్దికైన ఆలుమగలను మరెక్కడా చూడలేం. ఆదిదంపతులుగా ఈ ప్రపంచాన వీరు ప్రసిద్ధమైంది ఇందుకే.

ఇన్ని నియమాలెందుకు?
సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో మాత్రమే కావు.  ప్రతి పండుగ వెనుకా వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్‌ కిరణాలను, విద్యుత్‌ అయస్కాంత్‌ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకుముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్‌ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మసాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి ఈ నియమాలు. 

అభిషేకం: శివుడు అభిషేక ప్రియుడు. శిరస్సున కాసిన్ని నీరు పోసినా సంతోషంతో పొంగిపోతాడు.శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.

జాగరణ
శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివతత్వాన్ని జాగృతం చేస్తుంది.  తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణ... జాగరణ అవదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మాట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.

మంత్ర జపం
శివరాత్రి మొత్తం శివనామంతో, ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. నమకం, చమకం చదువుకోవాలి. రుద్రాభిషేకం చేసుకోవాలి లేదా చేయించుకోవాలి. తెలిసి చేసినా, తెలియక చేసినా, శివనామస్మరణ అనేక పాపాలను ప్రక్షాళన చేస్తుంది. 
నిర్వహణ: డి.వి.ఆర్‌. భాస్కర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement