
అల్లరి పిల్లవాడు సల్మాన్ బి.ఎ ఫస్ట్ ఇయర్ ముప్పై అయిదు శాతం మార్కులతో గట్టెక్కాడు. గట్టేం ఖర్మ చెట్టూ పుట్టా ఎక్కేశాడు ఆనందంతో. మరి చదవని చదువుకు అప్పనంగా మార్కుల షీటు అందితే ఆనందం కాదూ? అసలు సంగతి ఏమి భాయీ అంటే ఆగ్రా యూనివర్సిటీ వాళ్లు తాజాగా మార్కుల లిస్టులు కుర్రాళ్లకు జారీ చేశారు. బి.ఎ ఫస్ట్ క్లాస్ మార్కుల లిస్టు ఒకటి చూస్తే దాని మీద సల్మాన్‌ఖాన్ ఫొటో ఉంది. ఫొటో ఉన్న పాపానికి మన హీరోగారిని ఏ డిస్టింక్షన్‌లోనో పాస్ చేయవచ్చు కదా. అత్తెసరున ముప్పై శాతం మార్కులు వేసి ఉన్నారు.
ఇది ఆ నోటా ఈ నోటా పాకి పెద్ద వైరల్ అయ్యింది. ‘మరీ ఇంత నిర్లక్ష్యమా’ అని బాలీవుడ్‌లో కొందరు నోటితో నొసలుతో నోస్‌తో కూడా వెక్కిరిస్తున్నారు. అదే యూనివర్సిటీ వారు మరో మార్కుల లిస్ట్‌లో రాహుల్ గాంధీ ఫొటోను కూడా అంటించారని బోగట్టా. ఏందయా ఈ మాయా అని అడిగితే ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ అని తప్పును సరి చేసుకోవడానికి పరుగులు తీశారు. ఈలోపల జరగాల్సిన డ్యామేజీ జరిగే పోయింది. అభిమానులేమో సల్మాన్ ఫొటో ఎక్కడ వాడినా కండకు పది చొప్పున నూటికి నూరు మార్కులు వేయాల్సిందేనని సీరియస్‌గా వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఈసారి ఎన్ని వస్తాయో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment