గత ఏప్రిల్ నెలకు అభిషేక్ బచ్చన్‌కు ఐశ్వర్యరాయ్‌కు వివాహం జరిగి 11 ఏళ్లు నిండాయి. ఈ పెళ్లి జరుగుతున్నప్పుడు చాలా మందికి చాలా సందేహాలే ఉన్నాయి. ఇది ఎంత కాలం సాగుతుందో చూద్దాం అనుకున్నవారు ఉన్నారు. విడాకుల పుకార్లు పుట్టించినవారూ ఉన్నారు. కాని ఐశ్వర్యరాయ్ బచ్చన్ కోడలిగా నటిగా తల్లిగా భార్యగా సమర్థంగా తన జీవితాన్ని నిర్వహించుకుంటూ వస్తోంది.ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది భర్త అభిషేక్, కుమార్తె ఆరాధ్యలతో ఐశ్వర్య. నాలుగురోజుల క్రితం ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ ప్రీ ఎంగేజ్‌మెంట్ పార్టీలో భర్త, కుమార్తెతో ఆమె హుషారుగా కనిపించింది.గతంలో వీరు విడిపోతారని పుకార్లు వచ్చినప్పుడు ‘అభిషేక్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అతడు సరదాగా ఉంటాడు. నవ్విస్తాడు. సర్దుబాట్లు, ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండొచ్చు. పెళ్లంటే అదే. కొన్ని విషయాల్లో అనంగీకారం ఉన్నా అతడు నా భర్త, నా బిడ్డకు తండ్రి’ అని అందామె.‘నేను ఆమెను ఎంత ప్రేమిస్తానో ఆమెకు తెలుసు. ఆమె నన్నెంత ప్రేమిస్తుందో నాకు తెలుసు. కనుక మీడియా వాళ్లకు మేత కోసం మేమిద్దరం విడిపోలేము’ అని అభిషేక్ అన్నాడు.
అయితే పెళ్లయ్యాక ఆమెకు నటన పరంగా తగిన అవకాశాలు రాలేదు. రజనీకాంత్‌తో నటించిన ‘రోబో’నే ఆమె ఖాతాలో ఉన్న పెద్ద హిట్. ఆ తర్వాత నటించిన మణిరత్నం ‘రావణ్’, అక్షయ్ కుమార్ ‘యాక్షన్ రీప్లే’, పాకిస్తాన్ ఖైదులో ఉన్న సరబ్‌జిత్ కథ ఆధారంగా తీసిన ‘సరబ్‌జిత్’ ఆమెకు విజయం ఇవ్వలేదు. చివరకు క్లోజ్‌ఫ్రెండ్ కరణ్ జొహర్ ‘అయ్ దిల్ హై ముష్కిల్’లో ఒక పాత్ర ఇస్తే అందులో శృతి మించిన శృంగారం ఉండేసరికి ప్రేక్షకులు ఆమెను అంగీకరించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆమె తాజా సినిమా ‘ఫన్నేఖాన్’ ఆగస్టు 3న విడుదల కానుంది. అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావ్‌లతో పాటు ఐశ్వర్యా రాయ్ కూడా ఇందులో ముఖ్యపాత్ర. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా నిర్మాణంలో అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో తయారైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులలో కుతూహలం రేపుతోంది. గృహిణిగా ఉండటంతో పాటు నటిగా ఉండటం కూడా తనకు ముఖ్యం అని భావిస్తున్న ఐశ్వర్య ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఒకసారి తన ప్రాభవాన్ని నిరూపిస్తుందని ఆశిద్దాం.
విజయాన్ని ఆశిస్తూ ఆమె కొనసాగుతూనే ఉంది...
Published Fri, Jul 6 2018 12:31 AM | Last Updated on Mon, Aug 20 2018 2:14 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment