నాలుక మంటతో ఏమీ తినలేకపోతున్నాను... | Alcohol Smoking Causes Many Causes Of The Tongue | Sakshi
Sakshi News home page

నాలుక మంటతో ఏమీ తినలేకపోతున్నాను...

Published Sat, Jan 18 2020 2:52 AM | Last Updated on Sat, Jan 18 2020 2:52 AM

Alcohol Smoking Causes Many Causes Of The Tongue - Sakshi

నా వయసు 36 ఏళ్లు. నెలలో రెండు మూడు సార్లు ఆల్కహాల్‌ తీసుకుంటుంటాను.  కొన్నాళ్ల కిందట నా నాలుకపై కుడివైపు ఉన్న మ్యూకస్‌ మెంబ్రేన్‌  కరిగిపోయింది. దీనివల్ల భోజనం తినేటప్పుడు మంటగా ఉంటోంది. డాక్టరును సంప్రదిస్తే బీ–కాంప్లెక్స్‌ టాబ్లెట్స్‌ రాసిచ్చారు. మొదట్లో కాస్త ఉపశమనం అనిపించినా ఆ తర్వాత అదే సమస్య తిరగబెట్టింది. ఇప్పుడు నాలుకకు ఎడమవైపున కూడా ఇదే సమస్య వచ్చింది. ఏమీ తినలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం సూచించండి.

మీరు చెప్పిన లక్షణాలు గ్లాసైటిస్‌ అనే కండిషన్‌ను సూచిస్తున్నాయి. ఈ సమస్య వచ్చిన వారిలో నాలుక మీద ఉన్న పొర మీద ఇన్‌ఫ్లమేషన్‌ వస్తుంది. ఈ సమస్యకు బీ కాంప్లెక్స్‌ లోపం మొదలుకొని ఆల్కహాల్‌ మితిమీరి తీసుకోవడం, పొగతాగడం, డయాబెటిస్‌ వంటి అనేక అంశాలు కారణం కావచ్చు. గ్లాసైటిస్‌కు కారణమైన అంశాలను గుర్తించి వాటిని అదుపులో పెట్టుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి దూరం కావచ్చు. అలాగే మీరు వైద్యుల సలహా మేరకు ప్రో–బయాటిక్స్‌ అనే పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రో–బయాటిక్స్‌ అంటే మజ్జిగ, పెరుగు వంటి పదార్థాల్లో సాధారణంగా ఎక్కువగా కనిపించే లాక్టోబ్యాసిల్లై అనే మనకు మేలు చేసే బ్యాక్టీరియా అన్నమాట. ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఈ గ్లాసైటిస్‌ అనే సమస్యనుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. మీరు మరోసారి జనరల్‌ ఫిజీషియన్‌కు చూపించుకొని ఆయన సూచనల మేరకు చికిత్స తీసుకోండి.

ఒంటి మీదంతా చిన్న చిన్న గడ్డలు వస్తున్నాయి
నా వయస్సు 30 ఏళ్లు. నా చేతులు, పొట్ట మీద చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి నా ఒంటిపైన ఇవి వస్తున్నాయి. డాక్టర్‌కు చూపించాను. వాటి వల్ల ఎలాంటి హానీ ఉండదు అంటున్నారు. ఇందులో కొన్ని కాస్త నొప్పిగానూ, మరికొన్ని అంతగా నొప్పి లేకుండా ఉన్నాయి. ఇవి ఏమైనా క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందా? వీటికి ఎవరికి చూపించాలి?

మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు  ఉన్న గడ్డలు బహుశా కొవ్వు కణుతులు (లైపోమా)గానీ లేదా న్యూరోఫైబ్రోమాగాని అయి ఉండవచ్చు. మీ డాక్టర్‌కు చూపించి ఆయన సలహా తీసుకున్నారు కాబట్టి నిశ్చింతగా ఉండండి. ఆయన పరీక్షించే చెప్పి ఉంటారు కాబట్టి వాటి వల్ల ఏలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడదు. మీరు చెప్పినట్లుగా హానికరం కాని ఈ గడ్డలు బాగా పెద్దవైనా, నొప్పి ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించి శస్త్రచికిత్స ద్వారా తొలగింపజేసుకోవడం ఒక మార్గం. ఒకవేళ ఇవి క్యాన్సర్‌కు సంబంధించిన గడ్డలేమో అనే మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంటే నీడిల్‌ బయాప్సీ చేయించుకుని నిశ్చింతగా ఉండండి. మీరు మొదట ఒకసారి జనరల్‌ ఫిజీషియన్‌ను కలిసి వారి సలహా/చికిత్స తీసుకోండి.
డాక్టర్‌ జి. నవోదయ, కన్సల్టెంట్,
జనరల్‌ మెడిసన్, కేర్‌ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement