What Is Septicemia, Know Causes, Symptoms, Treatment And Other Details - Sakshi
Sakshi News home page

Septicemia: రక్తానికి ఇన్ఫెక్షన్‌ కలిగించే కండిషన్‌ 'సెప్టిసీమియా’.. ఎందుకొస్తుంది? చికిత్స ఉందా?

Published Sun, Feb 19 2023 1:43 AM | Last Updated on Sun, Feb 19 2023 4:56 PM

 Blood Infection is known as Septicaemia

సాధారణంగా ఇతర అవయవాలకు వచ్చే ఇన్ఫెక్షన్‌ తెలుసుగానీ... రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్‌ గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఇక్కడ ఓ కీలకం దాగి ఉంది. మిగతా అవయవాలకు ఇన్ఫెక్షన్‌ సోకితే... మెల్లగా పాకుతూ అంత త్వరగా ప్రమాదం రాకపోవచ్చు. కానీ రక్తానికి ఇన్ఫెక్షన్‌ గనక సోకితే అది అన్ని అవయవాలకూ, కణాలకూ వెళ్తూ ఆహారాన్నీ, ఆక్సిజన్‌ను తీసుకెళ్తూ వెళ్తూ ఇన్ఫెక్షన్‌ను కూడా దేహమంతటికీ వ్యాప్తి చేస్తుంది కాబట్టి ఇది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి. రక్తానికి ఇన్ఫెక్షన్‌ కలిగించే ఈ కండిషన్‌ను 'సెప్టిసీమియా’ అని పిలుస్తారు. దీనిపై అవగాహన కోసం ఈ కథనం. 

మామూలుగా ఏదైనా భాగానికి ఇన్ఫెక్షన్, ఇన్‌ఫ్లమేషన్‌ వస్తే దాన్ని వాడుకగా ‘సెప్టిక్‌’ అయిందని అంటారు. రక్తానికి ఇన్ఫెక్షన్‌ వచ్చి అది దేహాన్నంతటినీ విషపూరితం చేసే కండిషన్‌ను ‘సెప్సిస్‌’ లేదా ‘సెప్టిసీమియా’ అంటారు. దీని గురించి కొన్ని వివరాలివి... 

సెప్టిసీమియాకు కారణాలు  
బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, ఏవైనా పరాన్నజీవులతో పాటు మరికొన్ని అంశాలు కూడా సెప్టిసీమియాకు దారితీయవచ్చు. చాలాకాలంగా ఆల్కహాల్‌కు తీసుకుంటూ ఉండటం, దీర్ఘకాలంగా అదుపులేకుండా డయాబెటిస్‌ బారిన పడటం, తగిన పోషకాహారం తీసుకోకపోవడం, కొన్ని రకాల మందుల్ని దీర్ఘకాలికంగా వాడటం, రోగనిరోధక వ్యవస్థను మందకొడిగా చేసే ఇమ్యునోసప్రెసెంట్స్‌  వాడుతుండటం, కొన్ని రకాల యాంటీబయాటిక్‌ మందులను విచక్షణరహితంగా వాడటం సెప్టిసీమియాకు దారితీయవచ్చు. 

కొన్ని ఇన్ఫెక్షన్లలో సెస్టిసీమియా ముప్పు మరీ ఎక్కువ... 
గుండెజబ్బులు వచ్చి చికిత్స పొందని సందర్భాల్లో 
ఊపిరితిత్తుల జబ్బులు వచ్చిన వాళ్లలో దాదాపు సగం మందిలో కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు.  ప్రధానంగా నిమోనియా వచ్చినప్పుడు ఇది మరీ ఎక్కువ. 
 ఏదైనా కారణంతో  పొట్ట (అబ్డామిన్‌)లో ఇన్ఫెక్షన్‌ వచ్చినప్పుడు దాదాపు మూడోవంతు కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. 
కిడ్నీ ఇన్ఫెక్షన్‌ వచ్చిన సందర్భాల్లో దాదాపు 11 శాతం కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ముఖ్యంగా పైలోనెఫ్రైటిస్‌ అనే కిడ్నీ వ్యాధి వచ్చిన వారిలో లేదా యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చిన వారిలో అది సెప్టిసీమియా ముప్పు తెచ్చిపెట్టవచ్చు. 
 మెదడు తాలూకు ఇన్ఫెక్షన్స్‌ కూడా సెప్టిసీమియాగా మారవచ్చు. 
 ఎముకలు, కీళ్లకు ఇన్ఫెక్షన్‌ సోకితే చాలా కొద్దిమందిలో (2% మందిలో) అది సెప్టిసీమియాగా మారే అవకాశముంది. 

నిర్ధారణ పరీక్షలు
రక్త పరీక్ష, మూత్రపరీక్షలతో పాటు ఎక్స్‌–రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్‌ వంటి రేడియాలజికల్‌ పరీక్షలతో సెప్టిసీమియా ఉనికి, తీవ్రతను  అంచనా వేయవచ్చు. ఈ పరీక్షల ఆధారంగా తర్వాత చేయాల్సిన చికిత్సనూ  నిర్ణయిస్తారు. 

నివారణ 
బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్‌ వంటి సూక్ష్మజీవుల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవడం ద్వారా చాలావరకు సెప్టిసీమియా నుంచి రక్షించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారం, తాగేనీరు, పీల్చే గాలి కూడా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. అలాగే మరికొన్ని అంశాలూ సెప్సిస్‌ నుంచి కాపాడతాయి. అవి... 

♦ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. 
♦ నీటిని కాచి, చల్లార్చి లేదా ఫిల్టర్‌ అయిన నీటినే తాగాలి. 
♦ వంటకాల్ని  వేడివేడిగా ఉండగానే తినేయాలి. బయటి ఫుడ్‌కు (వీలైనంతవరకు) దూరంగా ఉండాలి. 
♦ కూరగాయలను, ఆకుకూరలను శుభ్రంగా కడిగాకే వంటకు ఉపక్రమించాలి. తొక్క ఒలిచి తినే పండ్లు మినహా మిగతా వాటిని కడిగే తినాలి. 
♦ తినడానికి ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. 
♦ మల, మూత్ర విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. 
♦ గాయాలను, పుండ్లను నేరుగా చేతితో ముట్టుకోకూడదు. వాటిని ముట్టుకోవాల్సి వస్తే చేతులకు గ్లౌవ్స్‌ వేసుకోని, సేవలందించాలి. 
తుమ్ముతూ, దగ్గుతూ ఉండేవారి నుంచి, ముక్కు నుంచి స్రావాలు వస్తున్నవారి నుంచి, జ్వరంతో బాధపడుతున్నవారి నుంచి దూరంగా ఉండాలి. వాళ్లతో మాట్లాడాల్సి వస్తే ఫేస్‌మాస్క్‌ ధరించాలి.  
♦ చెప్పులు, బూట్లు వంటి పాదరక్షల్ని బయటే విడవాలి. 
♦  పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. 
♦ డయాబెటిస్‌ అదుపులో ఉంచుకోవాలి. డాక్టర్ల సలహా లేకుండా యాంటీబయాటిక్స్‌ వాడకూడదు.

లక్షణాలు
♦ చలితో వచ్చే జ్వరం ( ఫీవర్‌ విత్‌ చిల్స్‌) 
 ♦ ఊపిరి అందకపోవడం (బ్రెత్‌లెస్‌నెస్‌) 
♦ గుండె వేగంగా కొట్టుకోవడం (ర్యాపిడ్‌ హార్ట్‌బీట్‌) 
♦ అయోమయం / మూర్ఛ (ఆల్టర్డ్‌ మెంటల్‌ స్టేటస్‌ / సీజర్స్‌)  
♦ మూత్రం పరిమాణం బాగా తగ్గడం
♦ దేహంలోని చాలా చోట్ల నుంచి రక్తస్రావం 
♦  పొట్టలో నొప్పి / వాంతులు / నీళ్ల విరేచనాలు 
♦ కామెర్లు (జాండీస్‌). 

చికిత్స
సెప్టిసీమియా రోగులను ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)లో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. చికిత్సలో భాగంగా డాక్టర్లు ఈ కింది ప్రొసీజర్స్‌ చేస్తారు.  
♦ రక్తనాళం ద్వారా ద్రవపదార్థాలు అందజేయడం (ఇంట్రావీనస్‌ ఫ్లుయిడ్స్‌)
రక్తనాళం ద్వారా యాంటీబయాటిక్స్‌ (ఇంట్రావీనస్‌ యాంటీబయాటిక్స్‌)
♦ రక్తపోటు అకస్మాత్తుగా పెరగడాన్ని నివారించే మందులతో సపోర్ట్‌
♦ ఆక్సిజెన్‌ తీసుకోలేకపోతున్న రోగికి కృత్రిమ శ్వాస ఇవ్వడం, వెంటిలేటర్‌తో  శ్వాస అందించడం
♦ కిడ్నీ రోగుల్లో డయాలసిస్‌
♦ అవసరమైన సందర్భాల్లో రక్తమార్పిడి లేదా రక్తంలోని కొన్ని అంశాలు తగ్గితే కోల్పోయిన వాటిని తిరిగి భర్తీ చేయడం (బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ లేదా బ్లడ్‌ ప్రోడక్ట్స్‌ను ఎక్కించడం)
♦ పేషెంట్‌కు ఇవ్వాల్సిన ఆహారాన్ని కూడా రక్తనాళం ద్వారానే అందిస్తారు.  (ఇంట్రావీనస్‌ న్యూట్రిషనల్‌ సపోర్ట్‌). 
- డాక్టర్‌ ఆరతి బెల్లారి ,సీనియర్‌ ఫిజీషియన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement