ఆ తిండితో మానసికంగానూ ముప్పే! | Many mishaps with ultra processed food | Sakshi
Sakshi News home page

ఆ తిండితో మానసికంగానూ ముప్పే!

Published Fri, Oct 6 2023 2:34 AM | Last Updated on Fri, Oct 6 2023 2:34 AM

Many mishaps with ultra processed food - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అ్రల్టా–ప్రాసెస్డ్‌ ఫుడ్‌ (యూపీఎఫ్‌) (ఎక్కువగా ప్రాసెస్‌ చేసిన ఆహారం) తరచుగా తీసుకోవడం ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు తదితర సమస్యలకు దోహదం చేస్తుందని గతంలో చేసిన అధ్యయనాలు తేల్చాయి. అయితే వీటి వల్ల మానసిక సామర్థ్యం సైతం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

రోజుకు పలుమార్లు అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తినే వారు.. ఈ ఆహారాలను అరుదుగా లేదా ఎప్పుడూ తీసుకోని వారితో పోలిస్తే మానసిక ఆరోగ్యంతో బాధపడే అవకాశం దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని మన దేశానికి చెందిన 30 వేల మంది వ్యక్తులను భాగస్వాముల్ని చేసిన ఈ అధ్యయనం వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా మానసిక శ్రేయస్సును అధ్యయనం చేసే అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ సేపియన్‌ ల్యాబ్స్‌ గ్లోబల్‌ మైండ్‌ ప్రాజెక్ట్‌లో ఈ అధ్యయనం ఒక భాగం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, అధ్యయన ఫలితాలతో ఇటీవల ఒక నివేదిక విడుదల చేశారు.

డిప్రెషనే కాదు అంతకు మించి.. 
‘ఈ తరహా ఆహారానికి ఉన్న మన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం ఉందని, దీని అధిక వినియోగం వల్ల డిప్రెషన్‌ మాత్రమే కాదు అంతకు మించిన మానసిక ఆరోగ్య క్షీణత సంభవిస్తున్నట్టుగా గమనించాం..’అని సేపియ¯న్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకురాలు, చీఫ్‌ సైంటిస్ట్‌ తారా త్యాగరాజన్‌ చెబుతున్నారు.

వీటి వినియోగం వల్ల కలిగే మానసిక సమస్యల్లో మానసిక వేదన, నిస్సత్తువ, ఆకలి మందగింపు వంటివి సంభవించే అవకాశం ఉందని అధ్యయనం కనుగొంది. ముఖ్యంగా 18–24 సంవత్సరాల వయస్సు గల యువతలో ఇది బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారు 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలతో పోలిస్తే ప్రతిరోజూ అలాంటి ఆహారాన్ని తీసుకునే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. 

యూపీఎఫ్‌ అంటే ఏమిటి? 
యూపీఎఫ్‌ను సరైన విధంగా నిర్వచించడం కొంతవరకు కష్టమే. అయితే సగటు గృహాలలో తయారు కాని, ఇంటి వంటగదికి ఆవల ప్రాసెసింగ్‌ చేసిన ఆహార పదార్థాలను యూపీఎఫ్‌గా తారా త్యాగరాజన్‌ నిర్వచిస్తున్నారు. ఎరేటెడ్‌ డ్రింక్స్‌ (కొన్నిరకాల శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్, ప్యాక్‌ చేసిన చిప్స్, స్నాక్స్, మిఠాయిలు ఈ కోవలోకి వస్తాయి. దీర్ఘకాలం మన్నేందుకు గాను సాల్ట్, సుగర్, ఫ్యాట్‌ వంటివి అధికంగా కలిపేవి ప్రాసెస్డ్‌ ఫుడ్‌ కాగా, అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌లో కృత్రిమ స్వీటెనర్లు, ఫ్లేవర్లు ఇతరత్రా కూడా జత కలుస్తాయి. రెడీ టూ ఈట్‌ మీల్స్, తీపి పానీయాలు వంటివన్నీ వీటిలో భాగమే.  

పెరుగుతున్న వినియోగం 
మన దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో యూపీఎఫ్‌ కూడా ఉంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ రిలేషన్స్‌తో కలిసి గత ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక వీటి వినియోగం ఎంతలా ఉందో స్పష్టం చేసింది.

కోవిడ్‌ సందర్భంగా 2020లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ తర్వాత అంతకు ముందుకన్నా రెట్టింపు అమ్మకాలు సాగుతున్నాయని ఈ నివేదిక తేల్చింది. ఈ విజృంభణ ఇలాగే కొనసాగితే 2032 కల్లా పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న రకరకాల ఆరోగ్య సమస్యలతో మన దేశం కూడా సతమతమవడం తథ్యమని కూడా ఆందోళన వ్యక్తం చేసింది.  

పాఠశాలల్లో నిషేధించాలి 
గత నెలలో బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ప్రమోషన్‌ నెట్‌వర్క్, న్యూట్రిషన్‌ అడ్వకసీ ఇన్‌ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ సంస్థలు సంయుక్తంగా.. మన దేశంలో యూపీఎఫ్‌ల వినియోగం–ప్రభావంపై నిర్వహించిన పరిశోధన పలు హెచ్చరికలు జారీ చేసింది.

ఈ సంస్థలు రూపొందించిన నివేదిక.. అన్ని రకాల జంక్‌ ఫుడ్స్, కుకీస్, చాకొలెట్స్, కన్ఫెక్షనరీ, హెల్త్‌ డ్రింక్స్, చిప్స్, ఐస్‌ క్రీమ్స్, పిజ్జా వంటి ఉత్పత్తులపై వార్నింగ్‌ లేబుల్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరింది. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వీటి విక్రయాలను నిషేధించాలని, ఈ ఉత్పత్తులపై భారీ జీఎస్‌టీని విధించాలని కూడా నివేదిక సూచించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement