జనరల్ హెల్త్ కౌన్సెలింగ్స్
నా వయసు 37. నెలలో రెండు మూడు సార్లు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. గత ఏడాది తినేటప్పుడు బాగా మంటగా ఉంటే డాక్టరును సంప్రదించాను. నాలుకపై కుడివైపు ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ కరిగిపోయిందని చెప్పి, బీ–కాంప్లెక్స్ టాబ్లెట్స్ రాసిచ్చారు. మొదట్లో కాస్త ఉపశమనం అనిపించినా ఆ తర్వాత అదే సమస్య తిరగబెట్టింది. ఇప్పుడు మళ్లీ నాలుకకు ఎడమవైపున కూడా ఇదే సమస్య వచ్చింది. ఏమీ తినలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
– రామచంద్రయ్య, కర్నూలు
మీరు చెప్పిన లక్షణాలు గ్లాసైటిస్ అనే కండిషన్‌ను సూచిస్తున్నాయి. అంటే గ్లాసైటిస్ సమస్యలో నాలుక మీద ఉన్న పొర ఇన్‌ఫ్లేమ్ కావడం జరుగుతుంది. ఈ సమస్యకు బీ కాంప్లెక్స్ లోపం మొదలుకొని ఆల్కహాల్ మితిమీరి తీసుకోవడం, పొగతాగడం, డయాబెటిస్ వంటి అనేక అంశాలు కారణం కావచ్చు. గ్లాసైటిస్ అదుపులోకి రావడానికి అందుకు కారణమైన అంశాలను అదుపులో పెట్టుకోవాలి. దాంతోపాటు ప్రో–బయాటిక్స్ అనే పదార్థాలను వైద్యులు దాదాపు ఒక నెల నుంచి రెండు నెలల వరకు ప్రిస్క్రయిబ్ చేస్తూ ఉంటారు. ప్రో–బయాటిక్స్ అంటే మజ్జిగ, పెరుగు వంటి పదార్థాల్లో సాధారణంగా ఎక్కువగా కనిపించే లాక్టోబ్యాసిల్లై అనే మనకు మేలు చేసే బ్యాక్టీరియా అన్నమాట. ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఈ గ్లాసైటిస్ అనే సమస్య కొంతవరకు మెరుగవుతుంది. మీరు ఇకసారి మెడికల్ స్పెషలిస్ట్‌కు చూపించి ఆయన సూచనల మేరకు చికిత్స తీసుకోండి.
రాత్రిళ్లు కాళ్లు తిమ్మిరెక్కుతున్నాయి...
నాకు రోజు రాత్రివేళల్లో అదీ నిద్రలో కాళ్లు తిమ్మిరెక్కుతాయి. పడుకున్న కాసేపటికే కాలు తిమ్మిరెక్కిపోయి బాధగా లేచి కూర్చుంటాను. తిమ్మిరెక్కిన సవుయంలో కాలు కిందపెట్టనివ్వదు. నొప్పి, బాధతో విలవిల్లాడిపోతాను. ఇది చాలా బాధాకరంగా ఉంటోంది. దయచేసి నాకు సరిౖయెన సలహా ఇవ్వగలరు.
– శ్రీహరిప్రసాద్, నల్లగొండ
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ సవుస్య పెరిఫెరల్ న్యూరోపతి కావచ్చని అనిపిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వుుఖ్యంగా డయాబెటిస్, క్రానిక్ ఆల్కహాలిజం సమస్యలు ఉన్నవారిలో ఇది చాలా సాధారణం. మీ సమస్యకు అసలు కారణాన్ని నిర్ధారణ చేయడానికి బ్లడ్‌టెస్ట్ వంటి కొన్ని పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. కారణాన్ని బట్టి సవుస్యకు తగిన వుందులను మెడికల్ కన్సల్టెంట్ పర్యవేక్షణలో కనీసం రెండు, వుూడు నెలలైనా వాడాల్సి ఉంటుంది.
చికిత్స తర్వాత క్షయ మళ్లీ తిరగబెట్టవచ్చా...?
నా వయస్సు 42 ఏళ్లు. రెండేళ్ల క్రితం క్షయ వ్యాధి పాజిటివ్ వచ్చింది. హెచ్‌ఐవీ పరీక్ష కూడా చేయించాను. అది నెగెటివ్ వచ్చింది. ఆర్నెల్ల పాటు ట్రీట్‌మెంట్ తీసుకున్నాను. చికిత్స తర్వాత పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. ఒకసారి క్షయ వచ్చాక అది తగ్గేవరకు మందులు తీసుకొని నెగెటివ్ అని వచ్చాక కూడా మళ్లీ అది తిరగబెట్టే అవకాశం ఉందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– ప్రసాదమూర్తి, అనకాపల్లి
పూర్తిగా చికిత్స తీసుకున్న తర్వాత క్షయవ్యాధి తిరగబెట్టడానికి అవకాశాలు కాస్త అరుదే. అయితే అరుదుగానైనా ఈ సమస్య మళ్లీ వచ్చేందుకు అవకాశం లేకపోలేదు. ఇలా వ్యాధి తిరగబెట్టడం అన్నది చికిత్స పొందిన వ్యక్తి వ్యాధి నిరోధకశక్తిపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా వారిలో ఇతర కారణాల వల్ల (ఉదా: డయాబెటిస్, వయస్సుపైబడటం, హెచ్‌ఐవీ వంటివి) వ్యాధినిరోధకశక్తి తగ్గి క్షయ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఉండవచ్చు. దీన్నే ‘రీ యాక్టివేషన్’ అంటారు. ఇలా వ్యాధి తిరగబెట్టకుండా ఉండాలంటే మంచి సమతుల పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన నిద్ర, డయాబెటిస్ లాంటి సమస్యలు ఉంటే వాటిని పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
పెయిన్ కిల్లర్స్ వాడినప్పటి నుంచి కడుపులో మంట!
నా వయసు 47 ఏళ్లు. నాకు మొదటి నుంచి అసిడిటీ సమస్య ఉంది. ఇటీవల తీవ్రమైన మెడ నొప్పి రావడంతో డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నాను. ఒకటి రెండు సార్లు పెయిన్‌కిల్లర్స్ వాడాను. అవి వాడినప్పటి నుంచి కడుపులో మంట మరింతగా పెరుగుతోంది. నాకు పరిష్కారాన్ని సూచించండి.
– నాగరాజు, గుంటూరు
కొన్ని నొప్పి నివారణ మందుల వల్ల... ముఖ్యంగా ఎన్‌ఎస్‌ఏఐడి గ్రూపునకు చెందిన బ్రూఫెన్, డైక్లోఫెనాక్, నాప్రోక్సెన్ వంటి వాటివల్ల అసిడిటీ, గుండెలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేని మందులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి మీ డాక్టర్‌ను సంప్రదించి మీకు మందులతో వస్తున్న సైడ్‌ఎఫెక్ట్స్ గురించి వివరించండి. డాక్టర్ మందులు మార్చి ఇస్తే మీ సమస్య తీరుతుంది.
ముక్కులు బిగదీసుకుపోతున్నాయి... పరిష్కారం చెప్పండి
నా వయస్సు 33. ఈ వయసులోనూ రోజూ ఉదయం వేళ చాలా సేపు వుుక్కు కారుతుండటంతో నేను చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటాను. ఇక స్వీట్స్, అరటిపళ్లు, పెరుగు, పులుసు కూరలు తిన్నప్పుడు ఆ రాత్రంతా వుుక్కులు బిగదీసుకుపోతాయి. ఊపిరి సరిగా అందక బాధపడుతుంటాను. ముక్కు రంధ్రాల్లో ఏదో ఒకటి ఎప్పుడూ మూసుకుపోయి ఉంటుంది. మాకు దగ్గర్లోని డాక్టర్‌కు చూపిస్తే ఇజ్నోఫిలియా అని సిట్రజిన్ ఇచ్చారు. నా సమస్యకు తగిన పరిష్కారం చూపించండి.
– డి. పార్థసారథి, నరసరావుపేట
మీరు రాసిన వివరాల ప్రకారం మీ సవుస్య అలర్జిక్ సైనోరైనైటిస్ కావచ్చు. అంటే... అలర్జీ కారణంగా ముఖం ఎముకల్లో ఉండే ఖాళీ ప్రదేశాలైన సైనస్‌లలో, ముక్కులో ఉండే లైనింగ్ పొరల్లో కొంత వాపు వచ్చి అవి ముక్కు రంధ్రాలను బ్లాక్ చేయడం వల్ల ఇలాంటి సమస్య కనిపిస్తుంటుందన్న మాట. మీరు మీ డాక్టర్ చెప్పిన మందులతో పాటు కొన్ని నేసల్ స్ప్రేస్ (డీ–కంజెస్టెంట్స్) వాడటం వల్ల ఉపశమనం ఉంటుంది. ఒకసారి మీరు మెడికల్ స్పెషలిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి.
డాక్టర్ ఎమ్. గోవర్ధన్, సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment