తాగని తాగుబోతు!
‘‘మేని తీరు చూడ ముచ్చటగా ఉండు... పొట్ట విప్పి చూడ ఆల్కహాలుండు?’’అంటూ సరికొత్త పద్యాలు పాడుతున్నారు నిక్ హెస్ గురించి తెలిసిన వాళ్లు. చూడడానికి చక్కగా కనిపించే నిక్‌హెస్‌కు. గత కొంత కాలంగా అతిగా ఆల్కహాల్ తీసుకున్నట్టు అనిపించడం, తరచుగా వామిటింగ్, కడుపునొప్పి, తలనొప్పి వస్తున్నాయి. టివీ చూస్తూ ఫ్రెంచ్‌ఫ్రైస్ (బంగాళా దుంపల చిప్స్) తిన్న కాసేపటికే నోరు మద్యం వాసన రావడంతో నిక్ భార్య కరేన్ డా సైతం భర్త తనకు తెలీకుండా ఎక్కడో బాటిల్ పెట్టి అబద్ధాలు చెబుతున్నాడని భావించేది. సన్నిహితులూ నిక్ గజ తాగుబోతనే అనుకున్నారు.
ఇలా కాదనుకున్న నిక్ భార్య... భర్తకు తెలీకుండా కొన్ని రోజుల పాటు అతడి దినచర్య మొత్తాన్ని షూట్ చేశాక, తన భర్త తాగని తాగుబోతు అని నిర్ధారించుకుంది. దీంతో వెంటనే నిక్‌ని మెడికల్ చెకప్స్‌కు తీసుకెళితే... అతని దేహంలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందని, అతను తీసుకుంటున్న హై కార్బొహైడ్రేట్స్ ఆల్కహాల్‌ను ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాయని వైద్యులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రస్తుతానికి దీనికి ‘ఆటో బ్రూవరీ సిండ్రోమ్’ అంటూ పేరు పెట్టారు. ‘‘తిన్నావా ఫుల్లు మీల్... నీ బాడీ కాదా విస్కీ బాటిల్?’’ అని హెచ్చరిస్తూన్న వైద్యులు నిక్ సుష్టుగా భోజనం చేసిన తర్వాత దాదాపు ఏడు పెగ్గుల విస్కీతో సమానమైన ఆల్కహాల్ తయారవుతోందని చెబతున్నారు. ప్రస్తుతం నిక్‌కి యాంటి ఫంగల్ డ్రగ్స్ ఇస్తూ, లో కార్బ్-డైట్ సూచిస్తూ... అతని పరిస్థితిని దారిలో పెడుతున్నారు.