
నిద్రలేమితో భవిష్యత్తులో అలై్జమర్స్!
పరిపరిశోధన
కంటి నిండా నిద్రలేకపోతే చురుకుదనం లోపిస్తుందన్న అంశం మరోమారు నిర్ద్వంద్వంగా నిరూపితమైంది. బ్రెయిన్ అనే మెడికల్ జర్నల్‌లో తాజాగా ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ప్రతి రాత్రీ తగినంతగా నిద్రలేనివారిలో మెదడు చురుకుదనం లోపించడంతో పాటు జ్ఞాపకశక్తిపై కూడా దుష్ప్రభావం పడుతుంది. అంతేగాక భవిష్యత్తులో ఇది జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోయే అలై్జమర్స్ వ్యాధికి దారితీయవచ్చు.
ఇటీవలే నిర్వహించిన ఒక అధ్యయన ఫలితం ప్రకారం... రాత్రిపూట తగినంత నిద్రపోనివారిలో అమైలాయిడ్ అనే ప్రోటీన్ పాళ్లు పెరుగుతాయి. ఇవి మెదడు కణాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అంతేగాక టావు అనే మరో ప్రోటీన్ పాళ్లు కూడా పెరుగుతాయి. ఈ ప్రోటీన్ల పెరుగుదల అలై్జమర్స్ వ్యాధిని ప్రేరేపించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ఈ అధ్యయనం కోసం కొంత మంది ఆరోగ్యవంతులైన ఎలాంటి నిద్ర సంబంధమైన వ్యాధులు లేని వాలంటీర్లను ఎంచుకొని వారిని రాత్రి సరిగా నిద్రపోనివ్వకుండా చూశారు. ఒక నెల రోజులు పరిశీలించి చూసినప్పుడు ఆ వ్యక్తుల్లో అంతకు ముందు లేని అమైలాయిడ్, టావు ప్రోటీన్ల పెరుగుదలను గమనించారు. ఈ ప్రోటీన్లు పెరిగినప్పుడు అవి భవిష్యత్తులో అలై్జమర్స్ వ్యాధిని కలగజేసే అవకాశం ఉన్నందున కంటి నిండా నిద్రపోవాలనీ, డిస్టర్బ్‌డ్ స్లీప్ మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఈ అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు.