
అమెరికా టు అనకాపల్లి
తెల్ల తోలు కండలవీరుడు, ఎర్ర తోలు గుమ్మడు... తెలుగులో డైలాగులు సరసర కొడుతున్నారు... మన హీరోలు విలన్‌ని కొట్టుడుకంటే టెన్ టైమ్స్ ఎక్కువ కొడుతున్నారు... ఈ కొట్టుడుకి మన నిర్మాతల వీపు బద్దలవుతుందా? డబ్బు అంతా డబ్బింగ్ సినిమా దోచేస్తే మన సినిమాకు టికెట్టు తెగేనా? ఇలా అయితే మన సినిమాకు థియేటర్ దొరికేనా? ఓ మై గాడ్! ఇంగ్లీష్ ప్రాబ్లమ్... దిగుమతి ఫ్రమ్ అమెరికా టు అనకాపల్లి.
జురాసిక్ వరల్డ్
ఇరవై రెండేళ్ళ క్రితం 1993లో వచ్చి, ప్రపంచమంతటినీ సమ్మోహితుల్ని చేసిన స్టీవెన్ స్పీల్‌బెర్గ్ ‘జురాసిక్ పార్క్’ సిరీస్‌లో ఇది 4వ సినిమా. ఈ యాక్షన్, ఎడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్ సినిమా ‘జురాసిక్ వరల్డ్’ అనే డైనోసార్ థీమ్‌పార్క్‌లో నడుస్తుంది. సందర్శకుల్ని ఆకర్షించడానికి అందులో శాస్త్రవేత్తలు సృష్టించిన హైబ్రిడ్ డైనోసార్ తప్పించుకొని బయటకొస్తుంది. అప్పుడేం జరిగిందన్నదే ఆసక్తిగా సాగే ఈ చిత్రం. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ కూడా ఇందులో నటించడం విశేషం.
తారాగణం: క్రిస్ ప్రాట్, బ్రిస్ డల్లాస్ హోవర్డ్, ఇర్ఫాన్‌ఖాన్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: స్టీవెన్ స్పీల్‌బర్గ్
దర్శకుడు: కోలిన్ ట్రెవొరో, రిలీజ్: జూన్ 11
టెర్మినేటర్: జెనిసిస్
పాపులర్ ‘టెర్మినేటర్’ సిరీస్‌లో 4వది. మునుపటి చిత్రాల్లో చూపించినవాటికి మించిన దృశ్యాలు ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉంటాయట. ఈ నాలుగో భాగానికి మరిన్ని సీక్వెల్స్ వచ్చేలా, కండల వీరుడు ఆర్నాల్డ్‌ను మళ్ళీ మళ్ళీ చూసేలా కథను అల్లుకున్నారట.
తారాగణం: ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్,
జేసన్ క్లార్క్, ఎమిలియా క్లార్క్
దర్శకత్వం: ఎలెన్ టేలర్, రిలీజ్: జూలై 1
మిషనింపాజిబుల్: రోగ్ నేషన్
మూడేళ్ళ క్రితం వచ్చి, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ వర్షం కురిపించిన ‘మిషన్ ఇంపాజిబుల్ - ఘోస్ట్‌ప్రోటోకాల్’ తరువాత ‘ఎం.ఐ’ సిరీస్‌లో వస్తున్న తాజా చిత్రం. కోవర్టు గూఢచర్యం ప్రధానాంశంగా ఈ సినిమా నడుస్తుంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు అనేకం.
తారాగణం: టామ్ క్రూయిజ్,
జెరెమీ రెనెర్, సైమన్ పెగ్
దర్శకత్వం: క్రిస్టఫర్ మెక్‌క్వారీ
రిలీజ్: జూలై 31
ఫెంటాస్టిక్ ఫోర్
కాస్మిక్ కిరణాల తాకిడికి గురైన కొంతమంది వ్యక్తులకు ఊహించని అతీతశక్తులు వస్తాయి. మిస్టర్ ఫెంటాస్టిక్, హ్యూమన్ టార్చ్, ఇన్విజిబుల్ ఉమన్, ది థింగ్ - ఈ నలుగురి మధ్య కథ నడుస్తుంది. 1960ల నాటి క్లాసిక్ కామిక్ బుక్స్ ఆధారంగా వస్తున్న సిరీస్‌లో తాజా సినిమా ఇది.
తారాగణం: మైల్స్ టెల్లర్, మైకేల్ బి. జోర్డాన్,
కేట్ మారా, టోబీ కెబెల్
దర్శకుడు: జోష్ ట్రాంక్
రిలీజ్: ఆగస్టు 7
హైదరాబాద్‌లోని ఒక మల్టీప్లెక్స్... పక్క స్క్రీన్‌లోని కొత్త తెలుగు సినిమా కన్నా ఈ స్క్రీన్‌లో జనం కిటకిటలాడుతున్నారు. ఆ స్క్రీన్‌లో ఉన్నది హాలీవుడ్ సినిమా తెలుగు డబ్బింగ్! ‘‘సినిమా బాగుందట! మన సినిమాల్లో కన్నా యాక్షన్, గ్రాఫిక్స్ అదిరాయట. పైగా డైలాగులూ తెలుగులోనే కదా అని వచ్చాం’’ అన్నాడు ప్రైవేట్‌గా సి.ఏ. చదువుతున్న ఆనంద్. ఇంగ్లీష్ సినిమాల తెలుగు డబ్బింగ్‌లకు పెరుగుతున్న క్రేజ్‌కు ఇది ఎగ్జాంపుల్. ఇటీవల ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ దేశంలో వంద కోట్లు కలెక్ట్ చేయగలిగిందంటే ఆనంద్ లాంటి లక్షలాది ఆడియన్స్ వల్లే!
పోస్టర్ డబ్బింగ్ నుంచి సినిమా డబ్బింగ్ దాకా...
అది 1970ల నాటి సంగతి... థియేటర్ బయట బ్లాక్ అండ్ వైట్‌లో ‘మృత్యువీరుడు’, ‘రాకాసి తిమింగలం’ లాంటి వాల్‌పోస్టర్స్! పోస్టర్స్ మాత్రమే తెలుగు... లోపల సినిమా ఇంగ్లీషే! కట్ చేస్తే... 1990ల నాటికి... ట్రెండ్ మారింది. వాల్‌పోస్టర్‌లో టైటిల్‌తో ఆగకుండా, ఇంగ్లీష్ సినిమా మొత్తాన్నీ తెలుగులోకి డబ్ చేసి, రిలీజ్ చేయడం మొదలైంది. అలా తొలిరోజుల్లో వచ్చిన ‘జురాసిక్ పార్క్, అనకొండ’ లాంటివి ఈ ఇంగ్లీష్ డబ్బింగ్‌కు మార్కెట్ పెంచాయి. ‘‘ఆ మధ్య హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ‘స్పైడర్‌మ్యాన్3’ ఏకంగా 175 రోజులాడింది. ఈ ఇరవై ఏళ్ళలో హాలీవుడ్ డబ్బింగ్ మార్కెట్ బాగా పెరిగింది’’ అని ఆ చిత్రాల్ని తెలుగులో అందించిన ‘శ్రీలక్ష్మీ గణపతి ఫిలిమ్స్’ అధినేత బి. సుబ్రహ్మణ్యం వివరించారు. అందుకే, ఇండియాలోని తెలుగు, తమిళ, హిందీ ప్రాంతీయ భాషా మార్కెట్‌పై హాలీవుడ్ స్టూడియోల దృష్టీ పెరిగింది.
సినిమా టు టీవీ! టీవీ టు సినిమా!
ఇవాళ టీవీ చానల్స్‌కు కూడా ఇంగ్లీష్ సినిమా తెలుగు డబ్బింగ్ పెద్ద సాఫ్ట్‌వేర్. థియేటర్లలో పెద్దగా ఆడని అనేక ఇంగ్లీష్ సినిమాలను కూడా టీవీ కోసం రైట్స్ తీసుకొని, డబ్బింగ్ చేయడం పెరిగింది. టీవీల్లో ఈ డబ్బింగ్‌లు చూసి చూసి, జనం పొటెన్షియల్ ప్రేక్షకుడిగా మారుతున్నాడు. ఈ చైన్ రియాక్షన్ ఇటు హాలులో, అటు టీవీలో ఈ డబ్బింగ్‌లకు ప్రత్యేకంగా ఆడియన్స్‌ను సృష్టిస్తోంది.
తెలుగు సినిమాను మించి...!
ప్రస్తుతం పరిస్థితి ఏమిటంటే, పేరుకు ఇవి ఇంగ్లీష్ సినిమాలే కానీ, తెలుగు నేలపై సగటున పాతిక స్క్రీన్స్‌లోనే ఇంగ్లీష్ వెర్షన్ రిలీజవుతుంది. తెలుగు డబ్బింగ్ మటుకు కనీసం 60 మొదలు 200 పైగా స్క్రీన్స్‌లో ఆకర్షిస్తోంది. అంటే, సగటు తెలుగు సినిమాల కన్నా భారీస్థాయిలో ఈ డబ్బింగ్‌లు రిలీజవుతున్నాయన్న మాట!
ఇటీవల ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ తెలుగు నాట 250 పైగా స్క్రీన్స్‌లో రిలీజైంది. ఇంగ్లీషు, తెలుగు, తమిళ, హిందీల్లో కలిపి రూ. 100 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లొచ్చిన హాలీవుడ్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. ‘జురాసిక్ వరల్డ్’కు ఇప్పుడు అదే గైడైంది.
ఈ సమ్మర్‌లో ఇవే హాట్ గురూ!
ఈ ఏడాది సమ్మర్ సీజన్ ఎడ్వాంటేజ్‌ను తెలుగు సినిమాలు సొమ్ము చేసుకోలేకపోయాయి. పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా రాకపోవడంతో ఈ ఇంగ్లీష్ డబ్బింగ్‌లే సమ్మర్ హీరోలయ్యాయి. సగటు తెలుగు సినిమాల బాక్సాఫీస్ లైఫ్ ఇప్పుడు మూడు రోజుల నుంచి మూడు వారాలే అయింది. ఆ పరిస్థితుల్లో, ‘ఎవెంజర్స్’ లాంటివి దిక్కయ్యాయి. తెలుగునాట ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ రూ. 4.5 కోట్ల పైగా, ‘ఎవెంజర్స్’ రూ. 3.5 కోట్ల పైగా, ‘మ్యాడ్‌మ్యాక్- ఫ్యూరీ రోడ్’, ‘శాన్ ఆండ్రియాస్’లు ఒక్కొక్కటి రూ. 1.25 కోట్ల పైగా కలెక్ట్ చేసినట్లు భోగట్టా.
రానున్న కొద్ది నెలల్లో చాలానే ఇంగ్లీష్ డబ్బింగ్‌లు క్యూలో ఉన్నాయి. ‘‘తెలుగు సినిమానా, డబ్బింగ్ సినిమానా అని కాదు. బాగుంటే, ఏ సినిమా అయినా జనం చూస్తారు. లేదంటే చూడ’’రని ‘జురాసిక్ వరల్డ్’ తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న ముఖేశ్ మెహతా అన్నారు.
బయ్యర్లలోనూ క్రేజే!
పైగా, ఒక సగటు పెద్ద తెలుగు సినిమాను ఒక ప్రధాన ఏరియాకు కొనుక్కోవాలంటే, రూ. 10 - 12 కోట్ల దాకా వెచ్చించాలి. కానీ, ఆ మొత్తానికి ఒక మంచి హాలీవుడ్ సినిమా ఆల్ ఓవర్ ఇండియా హక్కులు వచ్చేస్తాయి. కేవలం కొద్ది లక్షల ఖర్చుతోనే అన్ని ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేసుకోవచ్చు. హాలీవుడ్ డబ్బింగ్ గనక ఆడితే, తక్కువ పెట్టుబడి... ఎక్కువ ఆదాయం. ఇవాళ, అందుకే బయ్యర్లలోనూ హాలీవుడ్ డబ్బింగ్‌లంటే క్రేజ్! ఈ పరిస్థితుల్లో హాలీవుడ్ సంస్థలు హైదరాబాద్‌లోనూ ఆఫీసులు తెరుస్తున్నాయి. భారీగా పబ్లిసిటీ చేస్తున్నాయి.
మరి, ఈ తాకిడిని తట్టుకోవడానికి మన సినిమాలు ఏం చేస్తున్నట్లు? ‘పీకూ’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ లాంటి ఆసక్తికరమైన కథలు, కథనాలతో బాలీవుడ్ ఈ ఇంగ్లీష్ డబ్బింగ్‌ల దాడిని తట్టుకొంటోంది. కానీ, ముంచుకొస్తున్న ఈ ‘ఇంగ్లీషు’ ప్రళయానికి దీటుగా మన తెలుగు సినిమాలు నిలవకపోతే కష్టమే! 2020 నాటికి... ఊళ్ళో తెలుగు చిత్రాల కన్నా ఇంగ్లీష్ డబ్బింగ్‌లే ఎక్కువ కనిపించే ప్రమాదముంది. మన మహేశ్, ప్రభాస్‌ల సినిమాలకు హాళ్ళు కరవైనా ఆశ్చర్యం లేదు. మరి, దర్శక, రచయితలు తమ క్రియేటివిటీతో ఈ ప్రమాదాన్ని తప్పిస్తారా? అపర ‘ఎవెంజర్స్’ అవతారమెత్తుతారా?
- రెంటాల జయదేవ
ఊళ్ళకీ పాకిన... హాలీవుడ్ సినిమా
ఇవాళ ఊరూరా మల్టీప్లెక్సులొచ్చాయి. ప్రింట్ల ఖర్చు పోయి, డిజిటల్ ప్రొజెక్షన్ వచ్చింది. ఏకకాలంలో వందల హాళ్లలో సినిమాలు రిలీజవుతున్నాయి. అమెరికాలో రిలీజైన రోజే ఇక్కడ అనకాపల్లిలోనూ అదే సినిమా వచ్చేస్తోంది. అదీ అందరికీ అర్థమయ్యే మన తెలుగులో చేరుతోంది. జిల్లా ప్రధాన కేంద్రాల్లో కనీసం రెండు వారాలు థియేటర్ల ఫీడింగ్‌కు ఈ సినిమాలు పనికొస్తున్నాయి. ‘‘తెలుగులో 3డి సినిమాలు తక్కువ కాబట్టి, డబ్బింగైనా ఈ 3డి సినిమాను అర్థమయ్యే తెలుగు డైలాగులతో చూడచ్చని జిల్లా కేంద్రాల్లోనూ జనం వస్తున్నారు’’ అని ‘శాన్ ఆండ్రియాస్’ అందించిన కె.ఎఫ్.సి ఎంటర్‌టైన్‌మెంట్స్ జి. కమలాకరరెడ్డి చెప్పారు.