కోడూరి విజయకుమార్ ఇంతవరకూ వాతావరణం, అక్వేరియంలో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి కవితా సంపుటాలు వెలువరించారు. ‘పొడిబారని నయన మొకటి తడియారని గుండె వొకటి వుండాలేగానీ’ ఉదయం లేచింది మొదలు రాత్రి వరకూ ఎన్నో ఆశ్చర్యాలు కవికి. కానీ కాలం గడిచేకొద్దీ ఈ మహానగరం ‘కళ్లకు గంతలు కట్టి, గుండెకు తాళం వేస్తుంది’ అని బాధ! ‘కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన రోజున ఇంటి గడపపై వెలిగిన రెండు దీపాలు– మా నాన్న కళ్లు’ అని మురిసిపోయిన చిన్నవాడే, పెద్దవాడై, సొంతింటి కల కన్నవాడై, శేష జీవితాన్ని ఇంటి వాయిదాలకు తాకట్టు పెట్టినవాడవుతాడు. ఇట్లాంటి ఎన్నో బాధల పలవరింపు తాజా సంపుటి ‘రేగుపండ్ల చెట్టు’. అందులోంచి ఒక కవిత:
దేహమొక రహస్య బిలం
ఏ అపూర్వ రహస్యాన్ని ఛేదించడానికి
లోకం కడలిపైన ఈ దేహనావతో యాత్రిస్తున్నావు
అంతు చిక్కని ఒక రహస్యమేదో నీ
నావ లోలోపలే తిరుగుతున్నదని తెలుసా నీకు
ఇదంతా పరిచిత దేహమనే అనుకుంటావుగానీ
నీ ఎముకల రక్త మాంసాల లోలోపల్లోపల
రహస్య రహస్యంగా సంచరించే మృత్యుగీతం
చివరాఖరికెప్పుడో తప్ప వినిపించదు
ఇవాళ జీవకళతో మెరిసిపోయే ఈ నావని
పూల తీగల్లా అల్లుకున్న
నీ రక్తసంబంధాలు నీ స్నేహ సంబంధాలు
ఎవరికి తెలుసు– కొద్ది ప్రయాణంలోనే ఈ నావ
కళ తప్పి ఏ తుపాను తాకిడికో ఛిద్రమయ్యాక
అగంతకుడిలా చొరబడిన అకాల
మృత్యువు రహస్యం తెలుసుకుంటావని
ప్రతిరోజూ నీ యాత్రను
దేహానికి నమస్కరించి ప్రారంభించు
లోపలి రహస్యగీతాన్ని ఆలపిస్తూ ప్రారంభించు
కోడూరి విజయకుమార్
Comments
Please login to add a commentAdd a comment