నేను చెవిని.. | Anand ear to Eardrum | Sakshi
Sakshi News home page

నేను చెవిని..

Published Thu, Apr 14 2016 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

నేను చెవిని..

నేను చెవిని..

ఈమధ్య ఆనంద్ కంప్యూటర్ కొన్నాడు. దానిలోని సర్క్యూట్లను చూసి అబ్బురపడుతున్నాడు. గొప్ప కాదు గానీ... నాలోని నిర్మాణంతో పోలిస్తే  నాకేమో అది కాంక్రీట్‌ను కలిపే యంత్రం కంటే మెరుగ్గా ఏమీ అనిపించడం లేదు. ఒక మహానగరానికి ఫోన్ కమ్యూనికేషన్లను కలిపే ఎలక్ట్రిక్ సర్క్యూట్‌ల వ్యవస్థ అంతటినీ ఒక అక్రోట్ సైజుకు కుదిస్తే ఎంత ఉంటుందో నేనూ అంతే ఉంటా. నేను ఆనంద్ చెవిని. నాకంటే నా పార్ట్‌నర్ కన్ను గొప్పదని ఆనంద్ అనుకుంటూ ఉంటాడు. కానీ ఆనంద్ కొన్న కంప్యూటర్‌లో సినిమా వేసుకొని, శబ్దాలు వినకుండా కేవలం చూడటమే జరిగితే నేనెంత అవసరమో ఆనంద్‌కు తెలిసివస్తుంది. ఒక నిశ్శబ్ద స్థితి ఎంత నిస్తేజంగా అనిపిస్తోందో అతగాడికి అర్థమవుతుంది.
 
బయట కనపడుతున్న డొప్ప లాంటి దాన్ని చూసి, దాన్నే చెవి అనుకుంటాడు ఆనంద్. నిజానికి అది బయటి చెవి మాత్రమే. శబ్ద తరంగాలను లోపలికి పంపడానికి  ఒక ద్వారంలా మాత్రమే అది పని చేస్తుంది. అక్కడి నుంచి కాస్త ఒంపు తిరుగుతూ  లోపలికి ఒక డ్రమ్‌లాంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని ఇయర్ డ్రమ్ అంటారు. నా లోపలి అవయవాలను రక్షించడం కోసమే ఆ ఒంపు. ఈ డ్రమ్ పొడవు రెండు సెంటీమీటర్లుంటుంది. ఈ ఒంపు వద్ద సన్నటి వెంట్రుకల కుచ్చుల్లాంటి నిర్మాణాలతో పాటు దాదాపు 4,000 మైనపు గ్రంథులు ఉంటాయి.

పురుగూపుట్రా, క్రిములూ గట్రా, దుమ్మూధూళి చెవి లోపలికి వెళ్లకుండా ఈ మైనపు పొర దగ్గరే అన్నీ అంటుకుపోయి ఆగిపోతాయి. ఇక ఆనంద్ ఎప్పుడైనా ఈత కొడితే ఆ నీళ్లలోని మురికి నా లోనికి చేరకుండా ఈ మైనమే కాపాడుతుంది. ఎప్పుడైనా నాలోని మైనం ఎక్కువైతే ఆనంద్ చేత్తో కాస్త తొలగించడానికి చూస్తాడు. కానీ అలా చేయకూడదు. అలా చేస్తే మరింత ఎక్కువ మైనం వస్తుంది. ఎక్కువైన మైనాన్ని నేనే తొలగించుకుంటూ ఉంటా.
 
వినికిడి జ్ఞానం ఆరంభమయ్యేది ఇయర్‌డ్రమ్ దగ్గరే. వినికిడి ప్రక్రియను తేలిగ్గా వివరించడానికి ఒక పోలిక చెప్పాలి. ఒక బిగుతైన డప్పు మీద కర్రతో కొట్టినప్పుడు కలిగే ప్రకంపనలా... శబ్దాల వల్ల ఇయర్ డ్రమ్ చివరన ఉన్న ఎముకల గొలుసు కుదులుతుంది. ఒక గుసగుస వల్ల ప్రకంపనలో ప్రతిస్పందించే ఈ ఇయర్‌డ్రమ్ ఒక సెంటీమీటరులోని పదిలక్షల వంతు పక్కకు జరిగేంత స్పందిస్తుంది. దాంతోనే గుసగుస కూడా మనకు నిపిస్తుంది. ఇలాంటి స్పందనల పరంపర అదేపనిగా కొనసాగుతూ అర్థవంతమైన శబ్దాల్లా ఆనంద్‌కు వినిపిస్తాయి.
 
ఈ ఇయర్ డ్రమ్ చివరి నుంచి అతడిలో మధ్య చెవి భాగం మొదలవుతుంది. అది ఒక చిక్కుడు గింజ పరిమాణమంత ఉంటుంది. ఈ మధ్య చెవిలో ఒక దాన్ని తాకుతూ మరొకటిగా మూడు చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. అవి... ఆన్విల్, హ్యామర్, స్టర్రప్ (దీన్నే స్టెపీస్ అని కూడా అంటారు). ఆనంద్‌కు వినిపించిన శబ్దాలను ఎన్నో  రెట్లు అధికంగా చేసి, స్టర్రప్ (స్టెపీస్) చివరన ఉండే ఓవల్ విండో నుంచి ‘లోపలి చెవి’ అని పిలిచే భాగంలోకి పంపడం ఈ చిన్న ఎముకల బాధ్యత.
 
వినికిడిలో లోపలి చెవి కీలకం...
ఇక ‘లోపలి చెవి’ ఇక్కడ మొదలవుతుంది. ఇదొక కోటలాంటి నిర్మాణం. ఒక బలమైన ఎముక అనే కోటలో ఈ లోపలి చెవి ఉంటుంది. ఇందులో నీటిలాంటి ద్రవం ఉంటుంది. దీని వెనక నత్తపైన ఉండే లోపలివైపునకు తిరిగిన స్ప్రింగ్ లాంటి ‘కాక్లియా’ అనే భాగం ఉంటుంది. దీని నిండే అత్యంత సూక్ష్మమైన వేలాది నర్వ్ కణాలు ఉంటాయి. అది ఒక్కొక్కటి ఒక్కో లాంటి కంపనానికి (వైబ్రేషన్‌కు) ప్రతిస్పందిస్తూ ఒక్కో శబ్దాన్ని గుర్తు పడుతుంటాయి. అలా అవి మనకు వినికిడి జ్ఞానాన్ని ఇస్తుంటాయి.

ఉదాహరణకు మధ్య చెవిలోని స్టర్రప్ (స్టెపీస్) తన వెనకే ఉన్న ఓవల్ విండోలోకి శబ్దాలను పంపించగానే, దాని వెనకే ఉన్న నీళ్ల లాంటి ఆ ద్రవంలో ఒక అలలాంటిది పుడుతుంది. నీళ్లపై బెండులా తేలే గడ్డీగాదం కదులుతున్నట్లే శబ్దం వచ్చినప్పుడల్లా ఆ అలలాంటిది ఆ శబ్దానికి అనుగుణంగా పైకి కిందికి కదులుతూ ఉంటుంది. అలా కదిలే అల వల్ల కాస్త విద్యుత్ తరంగం లాంటిది ముందుకు పాసవుతూ వినికిడి నరానికి (ఆడిటరీ నర్వ్‌కు) తాకుతుంది. ఒక పెన్సిల్ లోపలి లెడ్ అంత సైజ్‌లో ఉండే ఆ నరంలో దాదాపు 30,000కు పైగా సర్క్యూట్స్ ఉంటాయి.

అది ఆనంద్ మెదడు నుంచి కేవలం రెండు సెంటీమీటర్ల దూరంలో ఉంటుంది. కాక్లియాలో అనేక వేల శబ్ద జ్ఞాపకాలు ఎలక్ట్రిక్ మెసేజెస్ రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. మనకు వినిపించగానే గత జ్ఞాపకాలతో ఆ శబ్దజ్ఞానం మనకు తెలుస్తుంది. ఇలా అర్థవంతమైన శబ్దాలన్నీ మనకు ఒక భాషగా ఆనంద్ మెదడుకు చేరుతూ ఉంటాయి. ఇలా వినికిడి ఏర్పడుతుంది.
 
ఇప్పటివరకూ గాలి తరంగాల వల్ల నాలోకి వచ్చే శబ్ద జ్ఞానం గురించి చెప్పాను. ఇక కొన్ని సందర్భాల్లో దవడ ఎముక ద్వారా కొన్ని శబ్దాలు నేరుగా లోపలి చెవిలోకి చేరుతాయి. అయితే ఆ శబ్దాలన్నీ నేరుగా చెవికి వినిపించే శబ్దాలకంటే భిన్నంగా ఉంటాయి. ఈ భిన్నత్వం వల్లనే తన సొంత గొంతునే టేప్ రికార్డర్‌పై రికార్డు చేసి విన్నప్పుడు ఆనంద్‌కు అది తానే మాట్లాడానా అని సందేహిస్తూ, తన గొంతుక కాదేమోనని పొరబడుతుంటాడు.  
 
వినికిడికి మాత్రమే కాదు... బ్యాలెన్స్ కోసం కూడా
ఇక వినడం అన్నది లోపలి చెవి చేసే ఒక అత్యధ్భుతమైన ప్రక్రియ అయితే ఇది ప్రదర్శించే మహాద్భుతం ఇంకొకటి ఉంది. అదే ఆనంద్ నిటారుగా ఉంచడం. ఒకరకం ద్రవం నిండిన మూడు సెమీ సర్క్యులర్ నాళాలు కాక్లియాతో పాటు ఉంటాయి. ఆనంద్ నిటారుగా ఉండటానికి, తన బ్యాలెన్స్ నిలుపుకోడానికి ఈ ట్యూబ్‌లు ఉపయోగపడుతూ ఉంటాయి. ఆనంద్ అకస్మాత్తుగా ఏదైనా కుదుపునకు గురైతే ఈ సెమీ సర్క్యులర్ నాళాలలో ఉండే ద్రవం కూడా కదులుతుంది. బకెట్‌ను కదిలించగానే అందులోని నీళ్లూ కదిలినట్లుగా ఈ ద్రవమూ కదులుతుంది.

అలా కదిలినప్పుడు ఈ ద్రవానికి మెదడుకు ఉండే అనుసంధానం తొలగిపోతుంది. ఫలితంగా కుదుపు కారణంగా తాను తూలి  పడిపోతున్నాననీ, తనను తాను నిలబెట్టుకోవాలనే సహజాత జ్ఞానం (ఇన్‌స్టింక్ట్) ఆనంద్‌కు కలుగుతుంది. దాంతో అతడు నిలదొక్కుకునే ప్రయత్నంలో భాగంగా తన కండరాలను బిగించడం, నిటారుగా ఉండటానికి ప్రయత్నించడం వంటివి చేస్తాడు. ఆనంద్ పడిపోకుండా ఎప్పుడూ బ్యాలెన్స్‌తో ఉండటానికీ, ఒకవేళ పడిపోబోతుంటే నిలువరించడానికి నేను చేసే నిత్యకృత్యమిది.
 
జాగ్రత్తలు అవసరం
ఆనంద్ అప్పుడప్పుడూ అగ్గిపుల్లలు, ఇయర్‌బడ్స్‌ను చెవుల్లో దూర్చుతుంటాడు. వాటి వల్ల చెవులు శుభ్రం కావు సరికదా. మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నా మేలు కోరే వాడైతే ఆనంద్ ఆ పనులు చేయకూడదు. ఆనంద్ పూర్వీకుల విషయంలో అతడు వేటాడే నాడు అతడికి పెద్దగా వినిపించే శబ్దాలైన సింహగర్జనలు, ఉరుముల శబ్దాలతో అతడికి ప్రమాదం ఉండేది కాదేమో. కానీ ఇప్పుడు ఆనంద్ రోజూ హైపిచ్ జెట్ ఇంజన్‌ల శబ్దాల తీవ్రతను అనుభవిస్తున్నాడు.

ఇది భవిష్యత్తులో అతడి వినికిడిని దెబ్బతీస్తుంది. అతడి లోపలి చెవి ఆరోగ్యం బాగుండాలంటే పొగతాగడం పూర్తిగా మానేయాలి. చెవికి అపాయకరమైన కొన్ని రకాల మందులు (ఒటోటాక్సిక్ డ్రగ్స్)ను నిపుణులైన డాక్టర్ సలహా మేరకే వాడాలి. అలాగే కాఫీని చాలా పరిమితంగా తీసుకోవాలి. అది ఎక్కువగా తీసుకుంటే రక్తనాళాలు ముడుచుకొనిపోయి లోపలి చెవికి అందాల్సిన పోషకాలు అందవు. అతడు క్రమం తప్పకుండా ఈఎన్‌టీ నిపుణుల వద్దకు వెళ్లి నన్ను పరీక్షించుకుంటూ ఉంటే మేలు.
 
సమస్యలూ... చికిత్సలూ
నాలోని సంక్లిష్టతల వల్ల కూడా అనేక సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి మధ్య చెవి చివర ఉండే పొర చిరిగిపోవడం చాలా తరచూ జరిగే ప్రక్రియ. ఇలా జరిగినప్పుడు సాధారణంగా నన్ను నేనే రిపేర్ చేసుకుంటూ ఉంటా. కానీ ఒక్కోసారి ఇలా డ్రమ్ చివరన ఉండే పొర చిరిగిపోతే శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ఇక కొందరిలో చెవిలో ‘గుయ్‌య్‌య్’ అనే శబ్దం వినిపిస్తుంది. దీన్ని టినైటస్ అంటారు. కొందరిలో ఇది యాంటీబయాటిక్స్ వాడకం వల్ల, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, జ్వరం, రక్తప్రసరణలో మార్పులు, నాలోని అకాస్టిక్ నర్వ్ మీద కణుతులు రావడం వంటివి జరగవచ్చు. దీనికి అసలు కారణాన్ని గుర్తుపట్టి, దాన్ని తొలగించగలిగితే, ఈ సమస్య తగ్గిపోతుంటుంది.
 
మధ్య చెవి సమస్యలు కూడా ఒక్కోసారి వినికిడి శక్తి కోల్పోవడానికి కారణం కావచ్చు. మధ్య చెవిలోంచి గొంతులోకి వెళ్లే యూస్టేషియన్ ట్యూబ్ మార్గం ద్వారా ఒక్కోసారి హానికారక క్రిములు చెవికి సోకవచ్చు. అందుకే ఒక్కోసారి ఆనంద్‌కు జలుబు చేసినప్పుడు అతడి చెవిలోనూ నొప్పి వస్తుంది. ఆనంద్‌కు పెద్దగా అవగాహన లేకపోవడంతో ఒక్కోసారి గట్టిగా ముక్కు చీదుతూ ఉంటాడు. దాంతోనూ గొంతులోని కాలుష్యాలు నాలోకి చేరే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మధ్య చెవిలోని ఎముకలు కాస్త పెరిగి అవి జామ్ అవుతాయి. దాంతో మధ్యచెవిలోని  ఎముకల కదలికలు లేకపోవడంతో ఆనంద్‌కు వినపడదు. దీన్ని కండక్టివ్ డెఫ్‌నెస్ అంటారు. దీనివల్ల ఆనంద్ కొంత వినికిడి కోల్పోడానికి అవకాశం ఉంటుంది. సరైన సమయంలో మందులు లేదా శస్త్రచికిత్స ద్వారా వినికిడి శక్తిని మళ్లీ మామూలుగా చేసే అవకాశం ఉంటుంది.
 
కాలం గడుస్తున్న కొద్దీ తగ్గిపోయే వినికిడి

ఆనంద్ పుట్టిననాటి నుంచి అతడి వినికిడి శక్తి తగ్గిపోతూనే ఉంటుంది. అతడి లోపలి  కణజాలం తాలూకు సాగే గుణం (ఎలాస్టిసిటీ) తగ్గుతుండటం, వెంట్రుకల్లాంటి అతి సన్నటి కణాలు క్యాల్షియమ్ డిపాజిట్ల వల్ల గట్టిబారతుండటంతో అతడి వినికిడి తగ్గుతుంటుంది. ఆనంద్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ప్రతి సెకన్‌కు 30,000 కంపనాలు (వైబ్రేషన్స్) వినేవాడు. పదహారేళ్ల వయసులో తన సొంత శరీరం శబ్దాలు కూడా వినగలిగే వాడు. టీన్స్ దాటాక ప్రతి సెకన్‌కు 20,000 కంపనాలు మాత్రమే వినగలడు. అలాగే ఆనంద్ తన 80వ ఏట కేవలం 4000 కంపనాలు/సెకన్ మాత్రమే నినగలడు. అంటే ఆ సమయంలో చుట్టూ నిశ్శబ్దంగా ఉంటేనే తప్ప ఇతరులు మాట్లాడే విషయాలు కష్టంగా వినగలడన్నమాట.
 
- డాక్టర్ ఇ.సి. వినయకుమార్
హెచ్‌ఓడి - ఈఎన్‌టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement