వారి వెనుకే మనం కూడా నడుస్తున్నాం | Annamayya who spent 95 years in full life | Sakshi
Sakshi News home page

వారి వెనుకే మనం కూడా నడుస్తున్నాం

Published Sun, May 19 2019 1:24 AM | Last Updated on Sun, May 19 2019 1:24 AM

Annamayya who spent 95 years in full life - Sakshi

పూర్వం తిరుమలలో వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాలంటే...చింతచెట్టు, సంపెంగచెట్ల మార్గం అని పెద్ద పెద్ద మానులతోఉన్న ఓ మార్గం గుండా వెళ్ళేవారట. పంచవన్నెల చిలకల్ని అక్కడ పంజరాల్లో పెట్టి ఉంచేవారట. ‘కోనేటిరాయుడు లోపల ఉన్నాడు, వెళ్ళి దర్శించుకోండి, కానుకలు సమర్పించుకోండి, మీ కోరికలు తీర్చుకోండి’ అని అవి అరుస్తుండేవట. అవి విన్నారు అన్నమాచార్యులవారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చి కోనేటి దగ్గర కూర్చున్నారు.గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు కొద్దిసేపు గుడిమెట్ల మీద తప్పనిసరిగా  కూర్చోవాలంటారు. ఎందుకంటే.. మీరు లోపల దర్శనం చేసుకున్న మూర్తిని మళ్ళీ ఒకసారి మనసులోకి ప్రతిబింబింప చేసుకుని, ధారణ చేసుకోవాలి. అన్నమాచార్యుల వారికి కూడా అలా స్వామివారి సౌందర్యం జ్ఞాపకానికొచ్చింది. చిలకపలుకులు గుర్తుకొచ్చాయి.

ఆ క్షణాల్లో చేసిన కీర్తనే...‘‘కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు...’’. అన్నమయ్య ఆ కొండమీదే ఉండిపోయాడు. తల్లిదండ్రులు పిల్లవాడిమీది బెంగతో ఉపవాసాలు చేస్తూ వెతుక్కుంటూ బయల్దేరారు. అక్కడ ప్రవర చెబుతున్న అన్నమాచార్యులును చూసి ఘన విష్ణుయతి అనే వైష్ణవయతి ఆయనకు పంచసంస్కారాలు చేసాడు. అన్నమాచార్యులవారు పాపనాశనం వెళ్ళి స్నానం చేసి తడిబట్ట ఆరేసుకుంటే.. అది ఆరిపోయేలోపల వేంకటేశ్వర స్వామి వారి మీద శతకం చెప్పేసారు. వేంకటేశ్వర స్వామివారు దర్శనమిచ్చి ‘నీవు సంకీర్తనా యజ్ఞం చేయాలి’ అని ఆదేశించినట్లు ఆయనకు అనిపించింది. అప్పటినుంచి ప్రతిరోజూ ఎక్కడికెళ్ళినా తప్పనిసరిగా ఒక కీర్తన చేసేవారు. ‘నీ కీర్తనలతో వైరాగ్యం వచ్చేసి స్వామి నాకేసి చూడడం మానేసాడు’ అని అమ్మవారు చెప్పినట్లనిపించి..‘‘పలుకు తేనెల తల్లి పవ్వళించెను..’’ అని పాడి స్వామివారిలో కదలిక తీసుకు వచ్చాడట.

ఆయన ‘జో అచ్యుతానంద జోజో ముకుందా..’ అని పాడితే నిద్రఎరుగని వేంకటాచలపతి హాయిగా కన్నుమూసి నిద్రపోయాడట.ఈరోజుకు కూడా ఉదయం సుప్రభాతం జరిగితే అన్నమాచార్య వంశీయులు వస్తారు. తాంబూలంలో వెన్నపెట్టి ఇస్తారు వారికి. రాత్రి మళ్ళీ ఊయల సేవ జరిగేటప్పడు కూడా వారు వచ్చి కీర్తనలు చేస్తారు. 95 సంవత్సరాల నిండు జీవితం గడిపిన అన్నమయ్య 90వ సంవత్సరం వచ్చిన తరువాత కూడా తంబుర పట్టుకుని శరీరం వణుకుతున్నా గుడి మెట్లమీద కూర్చుని ధ్వజస్తంభం కనబడుతుంటే..‘‘శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీపతి వల్లభ/శరణు రాక్షసగర్వ సంహార శరణు వేంకట నాయకా.

’’ అని శరణాగతి చేస్తుంటే–పురంధరదాసు గారు ఎదురొచ్చి‘‘శరణు శరణు సురేంద్ర సన్నుత శ్రీపతి సేవిత శరణు పార్వతీ తనయ శరణు సిద్ధి వినాయక...’’ అని ఆయన కీర్తన చేసారు. ‘మహానుభావా, మీ కీర్తన వింటేనే గానీ వేంకటేశ్వరుడు నిద్రపోడు. మీ పాట వింటేనే గానీ నిద్రలేవడు’’ అని పురంధర దాసు అంటే..దానికి ‘‘నీవేం తక్కువ వాడివా !  వేన్నీళ్ళు తీసుకు రాలేదని పండరీపురంలో నీవు సేవకుడి రూపంలో వచ్చిన స్వామివారి వీపుమీద చరిస్తే పాండురంగడి వీపు వాచిపోయింది. అంతగా భగవంతుడిని వశం చేసుకున్నవాడివి’’ అని అన్నమాచార్యుల వారంటూ ‘నీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అంటూ ఆశీర్వదించారట.ఇద్దరు మహాపురుషులు, ఇద్దరు వాగ్గేయకారులు రాజద్వారం దగ్గర కలుసుకున్న మహత్తర క్షణాలవి. వారు నడిచిన చోట, ఆది శంకరులు నడిచిన చోట, భగవద్‌ రామానుజులు నడిచిన చోట మనం నడుస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement