భక్తుల పాలిట కొంగు బంగారం... తెలుగు ప్రజల ఇలవేల్పు అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి. వారి దివ్యకల్యాణ మహోత్సవాలకు తూర్పుగోదావరి జిల్లా, అన్నవరంలో గల రత్నగిరి ముస్తాబైంది. ఈ నెల 25, బుధవారం, వైశాఖ శుద్ధ దశమి నుంచి, మే 1, వైశాఖ బహుళ పాడ్యమి వరకు జరగనున్న ఈ వార్షిక కల్యాణ వేడుకలకు దేవస్థానం వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట్లో వివాహమైనా, గృహప్రవేశమైనా, మరే ఇతర శుభకార్యమైనా శ్రీసత్యదేవుని వ్రతమాచరించాల్సిందే. తన వ్రతమాచరిస్తేనే కోరిన కోర్కెలు తీర్చే భక్తసులభుడు శ్రీఅనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేత శ్రీసత్యదేవుడు. అటువంటి మహత్తు కలిగిన స్వామివారిని దర్శించినా భాగ్యమే.
శ్రీసత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాల వివరాలు , ఏప్రిల్ 25, వైశాఖ శుద్ధ , దశమి, బుధవారం
సాయంత్రం నాలుగు గంటలకు రత్నగిరిపై అనివేటి మండపంలో శ్రీసత్యదేవుడు, అమ్మవార్లను వధూవరులను చేస్తారు. రాత్రి ఏడు గంటలకు కళావేదిక మీద స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం.
26, గురువారం
రాత్రి తొమ్మిది గంటలకు రత్నగిరి కల్యాణ వేదిక మీద శ్రీసత్యదేవుడు, అమ్మవారికి దివ్యకల్యాణ మహోత్సవం రత్నగిరి రామాలయం పక్కనే గల కల్యాణ వేదిక మీద స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు.
27, శుక్రవారం
మధ్యాహ్నం రెండు గంటలకు ఆస్థాన సేవలు. సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన ప్రవేశ స్థాలిపాక హోమాలు.
28, శనివారం
మధ్యాహ్నం 2–30 గంటలకు శ్రీసత్యదేవుడు, అమ్మవారి సమక్షంలో వేదపండిత సభ, అనంతరం పండిత సత్కారం. ఈ వేదపండిత సభ కు విచ్చేసి తమ విద్వత్తు ప్రదర్శించి స్వామి వారి సన్నిధిలో సత్కారాలు అందుకోవాలని 140 మంది వేదపండితులకు దేవస్థానం ఆహ్వానం పంపించింది.
29, ఆదివారం
సాయంత్రం నాలుగు గంటలకు శ్రీసత్యదేవుడు, అమ్మవార్లకు వనవిహార మహోత్సవం. ఈసారి కొండ దిగువన గల ఉద్యానవనంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఏప్రిల్ 30, వైశాఖ పౌర్ణమి, సోమవారం:
ఉదయం ఎనిమిది గంటలకు పంపా రిజర్వాయర్ నందు శ్రీసత్యదేవుడు, అమ్మవార్లకు శ్రీచక్రస్నానం. సాయంకాలం నాలుగు గంటలకు నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన.
మే ఒకటి, వైశాఖ బహుళ పాడ్యమి, మంగళవారం
రాత్రి ఏడు గంటలకు శ్రీసత్యదేవుడు, అమ్మవారికి స్వామివారి నిత్యకల్యాణ మండపంలో వేలాది మంది భక్తులు తిలకిస్తుండగా స్వామి, అమ్మవార్ల శ్రీపుష్పయోగ మహోత్సవం. అనంతరం నీరాజన మంత్రపుష్పాలు, ఆశీర్వచనం
శ్రీసత్యదేవుని కల్యాణ వేడుకల విశేషాలు శ్రీ సీతారాములే పెళ్లిపెద్దలు
శ్రీసత్యదేవుడు, అమ్మవారి దివ్యకల్యాణ మహోత్సవాలకు రత్నగిరి క్షేత్రపాలకులు శ్రీసీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. విశేషమేమిటంటే ఈ ఉత్సవాల ఏడు రోజులు మినహాయిస్తే ఏడాదిలో 358 రోజులు శ్రీసత్యదేవునికి నిత్య కల్యాణం నిర్వహిస్తారు. ఆ నిత్య కల్యాణానికి కూడా సీతారాములే పెళ్లి పెద్దలు. శ్రీరామనవమి నాడు జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి శ్రీసత్యదేవుడు, అమ్మవారే పెళ్లిపెద్దలుగా వ్యవహరిస్తారు.
5 రోజులు అంగరంగ వైభవంగా ఊరేగింపు
ఉత్సవాలలో ఐదు రోజులు రాత్రి తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ శ్రీసత్యదేవుడు, అమ్మవారిని అన్నవరం కొండదిగువన వివిధ వాహనాలపై ఘనంగా ఊరేగిస్తారు.
29, 30 తేదీలలో చాగంటి వారి ప్రసంగం
స్వామివారి కల్యాణ మహోత్సవాలలో 29, 30 వ తేదీలలో సాయంకాలం ఆరు గంటలకు రత్నగిరిపై ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శ్రీసత్యదేవుని వైభవం గురించి ఉపన్యసిస్తారు.
అన్నవరం రావాలంటే...
చెన్నయ్– కలకత్తా హైవే–15 మీద గల అన్నవరానికి చేరుకోవాలంటే రోడ్డు లేదా రైళ్ల ద్వారా రావచ్చు. రాజమండ్రి నుంచి గంటన్నర ప్రయాణం. విశాఖపట్నం నుంచి రెండున్నర గంటలు ప్రయాణం. అన్ని ముఖ్యమైన రైళ్లు అన్నవరం రైల్వేస్టేషన్‌లో ఆగుతాయి. విశాఖపట్నం, రాజమండ్రి (మధురపూడి) విమానాశ్రయాలు ఉన్నాయి.
– అనిశెట్టి వేంకట రామకృష్ణ సాక్షి, అన్నవరం
Comments
Please login to add a commentAdd a comment