satyanarayana swamy
-
సత్యదేవుని దేవేరికి నేడు వజ్ర కిరీట సమర్పణ
అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి 134వ ఆవిర్భావ దినోత్సవాలు (జయంత్యుత్సవాలు) సోమవారం ఘనంగా ప్రారంభం కానున్నాయి. దీన్ని పురస్కరించుకుని సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీ అధినేతల్లో ఒకరైన మట్టే సత్యప్రసాద్ దంపతులు వజ్ర కిరీటం సమర్పించనున్నారు. సోమవారం మ«ధ్యాహ్నం స్వామివారి ప్రధాన ఆలయంలో రూ.1.50 కోట్ల విలువైన ఈ వజ్రకిరీటాన్ని అందజేయనున్నట్లు సత్యప్రసాద్ తెలిపారు. ఈ కిరీటంతో పాటు స్వామి, అమ్మవార్లకు రూ.50 లక్షలతో చేయించిన వజ్ర కర్ణాభరణాలు కూడా అందజేయనున్నట్లు చెప్పారు. కాగా, ఇకపై ప్రతి రోజూ స్వామి, అమ్మవార్లు ఈ వజ్రకిరీటాలు, వజ్ర కర్ణాభరణాలు ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
కన్నుల పండువగా సత్యదేవుని తెప్పోత్సవం
అన్నవరం/అరసవల్లి: కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై వెలసిన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి పంపా నదిలో కన్నుల పండువగా జరిగింది. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన హంసవాహనంపై సత్యదేవుడు, అమ్మవార్లు నదిలో విహరించారు. ఈ తెప్సోత్సవానికి భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. సాయంత్రం 5–30 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను, క్షేత్రపాలకులు సీతారాములను రత్నగిరి నుంచి ఊరేగింపుగా పంపా తీరాన గత పూజా మండపం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 6–30 గంటలకు స్వామి అమ్మవార్లను హంస వాహనంపై కూర్చోబెట్టి తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కే రామచంద్ర మోహన్, ఏసీ రమే‹Ùబాబు పాల్గొన్నారు. సుమారు 150మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వైభవంగా ఆదిత్యుని తెప్పోత్సవం ప్రఖ్యాత అరసవల్లి ఆదిత్య క్షేత్రంలో క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా శుక్రవారం తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉషాపద్మినిఛాయా దేవేరులతో స్వామి వారు హంస వాహనంపై పవిత్ర ఇంద్రపుష్కరిణిలో 12 సార్లు జలవిహారం చేశారు. అలాగే రోజంతా ఆదిత్యుడు పూర్తి స్వర్ణాలంకరణలో దర్శనమిచ్చారు. ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ సమక్షంలో హంస నావలో శ్రీచక్రార్చన పూజలు నిర్వహించారు. -
రత్నగిరీశునికి ముత్యాల వస్త్రం
అన్నవరం: దేవతామూర్తులకు బంగారు, వజ్ర, వైఢూర్యాలతో ఆభరణాలు తయారుచేసి భక్తితో అలంకరించి తరిస్తుంటాం. అలాగే మంచి ముత్యాలతో నఖశిఖ పర్యంతం ఉండే ఒక ముత్యాల వస్త్రం (ముత్తంగి) అలంకరించడం కూడా పలు దేవాలయాల్లో ఆనవాయితీగా వస్తోంది. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు, తిరుమల బ్రహ్మోత్సవాల్లో మలయప్పస్వామి, భద్రాద్రిలో సీతారాములు ముత్తంగి అలంకరణలో దర్శనమిస్తూ ఉంటారు. అన్నవరం పుణ్యక్షేత్రంలో శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి, ఈశ్వరుడు కార్తీకమాసం నుంచి ముత్తంగి అలంకరణలో దర్శనమివ్వనున్నారు. దీని తయారీకి అయ్యే ఖర్చు రూ.8 లక్షలు సమకూర్చేందుకు దేవస్థానం వ్రత పురోహిత సంఘం ముందుకు వచ్చింది. ప్రాచీన కళను కాపాడుతూ.. ముత్తంగి తయారీ ప్రాచీనమైన కళ. దీన్ని హైదరాబాద్‌కు చెందిన సుధీర్ చరణ్ కుటుంబం వంశపారంపర్యంగా కాపాడుతూ వస్తోంది. తమిళనాడులోని శ్రీరంగంలో సుమారు 12 అడుగుల పొడవున పవళించి ఉండే శ్రీరంగనాథునికి 17వ శతాబ్దంలో నాయకర్ రాజులు ముత్తంగి తయారు చేయించి అలంకరించారు. వందేళ్ల తరువాత వన్నె తగ్గడంతో దాన్ని తీసి భద్రపరిచారని సుదీర్ చరణ్ ‘సాక్షి’కి చెప్పారు. తరువాత 1932లో చెన్నైకి చెందిన ఆయన ముత్తాత కృష్ణాజీని శ్రీరంగం దేవస్థానం ప్రతినిధులు సంప్రదించి, భద్రపరిచిన ముత్తంగిని మళ్లీ ముత్యాలు, వజ్రాలు, కెంపులతో తయారు చేయించి శ్రీరంగనాథునికి అలంకరించారు. ఎలా తయారు చేస్తారంటే.. ముత్తంగి తయారీ చాలా శ్రమ, నైపుణ్యం, ఏకాగ్రతతో కూడిన కళ. ఇందుకు అవసరమయ్యే ముత్యాల వ్యయం తక్కువే అయినప్పటికీ వాటిని వస్త్రంగా తయారు చేయడానికి నెలల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. శిరస్సు దగ్గర నుంచి పాదాల వేళ్ల వరకూ దేవతామూర్తుల కొలతలు తీసుకుని, ముందుగా వెండి లేదా రాగి రేకుతో వస్త్రంలా తయారు చేసి, దానికి వివిధ సైజుల్లో ముత్యాలు అతికిస్తారు. వీటి మధ్యలో ఎటువంటి ఖాళీ ఉండదు. కేవలం స్వామి, అమ్మవార్ల ముఖాలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన భాగమంతా మంచిముత్యాలే కనిపిస్తాయి. సత్యదేవునికీ ముత్తంగి సేవ సత్యదేవుడు, అమ్మవారు, శంకరులకు ప్రతి సోమవారం ముత్తంగి అలంకరించి, ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించాం. దీనికి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ కూడా అంగీకరించారు. దాతల ద్వారా ముత్తంగి చేయించాలనుకున్నాం. అదే సమయంలో వ్రతపురోహిత సంఘం ముందుకు వచ్చింది. – ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో, అన్నవరం దేవస్థానం -
అన్నవరం సత్యదేవుని పరిణయ వేడుక
భక్తుల పాలిట కొంగు బంగారం... తెలుగు ప్రజల ఇలవేల్పు అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి. వారి దివ్యకల్యాణ మహోత్సవాలకు తూర్పుగోదావరి జిల్లా, అన్నవరంలో గల రత్నగిరి ముస్తాబైంది. ఈ నెల 25, బుధవారం, వైశాఖ శుద్ధ దశమి నుంచి, మే 1, వైశాఖ బహుళ పాడ్యమి వరకు జరగనున్న ఈ వార్షిక కల్యాణ వేడుకలకు దేవస్థానం వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట్లో వివాహమైనా, గృహప్రవేశమైనా, మరే ఇతర శుభకార్యమైనా శ్రీసత్యదేవుని వ్రతమాచరించాల్సిందే. తన వ్రతమాచరిస్తేనే కోరిన కోర్కెలు తీర్చే భక్తసులభుడు శ్రీఅనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేత శ్రీసత్యదేవుడు. అటువంటి మహత్తు కలిగిన స్వామివారిని దర్శించినా భాగ్యమే. శ్రీసత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాల వివరాలు , ఏప్రిల్ 25, వైశాఖ శుద్ధ , దశమి, బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు రత్నగిరిపై అనివేటి మండపంలో శ్రీసత్యదేవుడు, అమ్మవార్లను వధూవరులను చేస్తారు. రాత్రి ఏడు గంటలకు కళావేదిక మీద స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం. 26, గురువారం రాత్రి తొమ్మిది గంటలకు రత్నగిరి కల్యాణ వేదిక మీద శ్రీసత్యదేవుడు, అమ్మవారికి దివ్యకల్యాణ మహోత్సవం రత్నగిరి రామాలయం పక్కనే గల కల్యాణ వేదిక మీద స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. 27, శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆస్థాన సేవలు. సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన ప్రవేశ స్థాలిపాక హోమాలు. 28, శనివారం మధ్యాహ్నం 2–30 గంటలకు శ్రీసత్యదేవుడు, అమ్మవారి సమక్షంలో వేదపండిత సభ, అనంతరం పండిత సత్కారం. ఈ వేదపండిత సభ కు విచ్చేసి తమ విద్వత్తు ప్రదర్శించి స్వామి వారి సన్నిధిలో సత్కారాలు అందుకోవాలని 140 మంది వేదపండితులకు దేవస్థానం ఆహ్వానం పంపించింది. 29, ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీసత్యదేవుడు, అమ్మవార్లకు వనవిహార మహోత్సవం. ఈసారి కొండ దిగువన గల ఉద్యానవనంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఏప్రిల్ 30, వైశాఖ పౌర్ణమి, సోమవారం: ఉదయం ఎనిమిది గంటలకు పంపా రిజర్వాయర్ నందు శ్రీసత్యదేవుడు, అమ్మవార్లకు శ్రీచక్రస్నానం. సాయంకాలం నాలుగు గంటలకు నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన. మే ఒకటి, వైశాఖ బహుళ పాడ్యమి, మంగళవారం రాత్రి ఏడు గంటలకు శ్రీసత్యదేవుడు, అమ్మవారికి స్వామివారి నిత్యకల్యాణ మండపంలో వేలాది మంది భక్తులు తిలకిస్తుండగా స్వామి, అమ్మవార్ల శ్రీపుష్పయోగ మహోత్సవం. అనంతరం నీరాజన మంత్రపుష్పాలు, ఆశీర్వచనం శ్రీసత్యదేవుని కల్యాణ వేడుకల విశేషాలు శ్రీ సీతారాములే పెళ్లిపెద్దలు శ్రీసత్యదేవుడు, అమ్మవారి దివ్యకల్యాణ మహోత్సవాలకు రత్నగిరి క్షేత్రపాలకులు శ్రీసీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. విశేషమేమిటంటే ఈ ఉత్సవాల ఏడు రోజులు మినహాయిస్తే ఏడాదిలో 358 రోజులు శ్రీసత్యదేవునికి నిత్య కల్యాణం నిర్వహిస్తారు. ఆ నిత్య కల్యాణానికి కూడా సీతారాములే పెళ్లి పెద్దలు. శ్రీరామనవమి నాడు జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి శ్రీసత్యదేవుడు, అమ్మవారే పెళ్లిపెద్దలుగా వ్యవహరిస్తారు. 5 రోజులు అంగరంగ వైభవంగా ఊరేగింపు ఉత్సవాలలో ఐదు రోజులు రాత్రి తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ శ్రీసత్యదేవుడు, అమ్మవారిని అన్నవరం కొండదిగువన వివిధ వాహనాలపై ఘనంగా ఊరేగిస్తారు. 29, 30 తేదీలలో చాగంటి వారి ప్రసంగం స్వామివారి కల్యాణ మహోత్సవాలలో 29, 30 వ తేదీలలో సాయంకాలం ఆరు గంటలకు రత్నగిరిపై ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శ్రీసత్యదేవుని వైభవం గురించి ఉపన్యసిస్తారు. అన్నవరం రావాలంటే... చెన్నయ్– కలకత్తా హైవే–15 మీద గల అన్నవరానికి చేరుకోవాలంటే రోడ్డు లేదా రైళ్ల ద్వారా రావచ్చు. రాజమండ్రి నుంచి గంటన్నర ప్రయాణం. విశాఖపట్నం నుంచి రెండున్నర గంటలు ప్రయాణం. అన్ని ముఖ్యమైన రైళ్లు అన్నవరం రైల్వేస్టేషన్లో ఆగుతాయి. విశాఖపట్నం, రాజమండ్రి (మధురపూడి) విమానాశ్రయాలు ఉన్నాయి. – అనిశెట్టి వేంకట రామకృష్ణ సాక్షి, అన్నవరం -
సత్యదేవుడే పెళ్ళిపెద్దగా...
గూడెం సత్యనారాయణస్వామి కళ్యాణ క్షేత్రాలు సత్యనారాయణ స్వామి అంటే ఎవరికైనా అన్నవరం దేవస్థానం గుర్తుకు వస్తుంది. కాని ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామ శివారులో గోదావరి నదీ తీరాన ఎత్తయిన కొండపై వెలిసిన రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం కూడా చాలా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం మంచిర్యాల నుంచి 30 కిలోమీటర్ల దూరంలో, ఆదిలాబాద్ నుంచి 133 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరీంనగర్ నుంచి 70 కిలోమీటర్లు. భక్తులు ప్రేమగా ‘గూడెం సత్యనారాయణ స్వామి’ అని పిలుచుకునే ఈ స్వామి సన్నిధిలో ప్రతినిత్యం భక్తుల పూజలు, సామూహిక వ్రతాలతో పాటు ప్రతి ఏటా పెళ్లిళ్ల సీజన్లో అనేక పెళ్లిళ్లు కూడా జరుగు తుంటాయి. ఒక కిలోమీటరు దూరంలోనే గోదావరి ప్రవాహం ఉంది కనుక పుణ్యస్నానాలు ఆచరించి పునీత భావన పొందుతుంటారు. జిల్లాలో బాసర తర్వాత గూడెం సత్యనారాయణస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. కరీంనగర్ ధర్మపురి క్షేత్రం ఈ ఆలయానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయ ప్రాశస్త్యం.. 1964 సంవత్సరంలో గ్రామంలోని గోవర్దన పెరుమాండ్లు అనే చాత్తాద శ్రీవైష్ణవుడికి సత్యదేవుడు కలలో కనిపించి మీ ఊరి రాట్నపు చెవుల కొండపై ఉన్నానని చెప్పాడు. ఆ వైష్ణవుడు కొండపై వెదకగా చిన్న విగ్రహం దర్శనమిచ్చింది. దీంతో ఆయన సంతోషంతో సమీపాన గల గోదావరినదిలో స్నానం ఆచరించి గోదావరి జలంతో అభిషేక పూజలు నిర్వహించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు కూడా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పెరుమాండ్లు గుట్టపైనే స్వామి వారి ఆలయం నిర్మించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్రంలోనే ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి జాతర, కార్తీక పౌర్ణమికి భారీ జాతర నిర్వహిస్తూ ప్రతిఏటా స్వామివారికి కళ్యాణ బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు. 63వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఆలయం ఉండటంతో ప్రతి నిత్యం ఇక్కడ భక్తుల రద్దీ ఉంటుంది. పూజలతో పాటు పెళ్ళిళ్లు గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో ప్రతినిత్యం పూజలు, వ్రతాలతోపాటు పెళ్లిళ్ల సీజన్లో పెళ్లిళ్లు కూడా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ జరిగే పెళ్లిళ్లు కొద్దిపాటి నిబంధనలతో కూడుకుని ఉంటాయి. ఇక్కడ పెళ్లి జరుపుకోవాలంటే ముందుగా పెళ్లి నిర్వహణకు ఆలయం నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి. ఇవి వధువు, వరునికి వేర్వేరుగా ఉంటాయి. వాటిపై పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఫొటోలు అతికించాలి. ఏ గ్రామం వారైతే ఆ గ్రామ సర్పంచ్, మున్సిపాలిటీ వారైతే ఆ మున్సిపాలిటీ చైర్మన్ సంతకాలు చేయాలి. పెళ్లికొడుకు, పెళ్లికూతురు తల్లిదండ్రుల వివరాలు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డుతో సహాపూర్తి వివరాలు అందజేయాలి. పెళ్లి కానుక కింద ఆలయానికి రూ.2016 చెల్లించాలి. బదులుగా ఆలయం నుంచి వేదపండితుడు, సన్నాయి, పెళ్లి మండపం ఏర్పాటు చేసి పెళ్లి జరిపిస్తారు. - మొదంపురం వెంకటేష్, దండేపల్లి, ఆదిలాబాద్ ఇలా వెళ్లొచ్చు...: గూడెం సత్యనారాయణస్వామి ఆలయానికి కరీంనగర్ నుంచి వచ్చేవారు లక్సెట్టిపేట మీదుగా ఆదిలాబాద్, మంచిర్యాల వెళ్లే బస్సుల్లో రావచ్చు. ఈ బస్సులు ఆలయం ముందు నుంచే వెళతాయి కాబట్టి ఆలయం వద్దనే దిగొచ్చు. నిజామాబాద్, జగిత్యాల వైపు నుంచి వచ్చేవాళ్లు లక్సెట్టిపేట, మంచిర్యాల వెళ్లే బస్సుల్లో రావచ్చు. ఈ బస్సులు కూడా ఆలయం ముందు నుంచే వెళతాయి. ఆదిలాబాద్ నుంచి వచ్చే వాళ్లు మంచిర్యాల లేదా లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, గుంటూరు, ఖమ్మం వెళ్లే బస్సుల్లో రావచ్చు. రైలు మార్గం ద్వారా..: గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి రైలు మార్గం ద్వారా వచ్చే వారు మంచిర్యాల రైల్వేస్టేషన్ లో దిగాలి. అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు వెళతాయి. -
ఏరువాక సాగేనా... అన్నో రైతన్నా!
నేడు ప్రత్యేక పూజలు మహబూబ్‌నగర్ కల్చరల్: ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట తిరుమలనాథస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రాంమోహనాచార్యులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు శ్రీవారికి అభిషేకం, అనంతరం సహస్రపుష్పార్చన, 10 గంటలకు సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తామని, జిల్లాలోని భక్తులు ఈ విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని కోరారు. నేల తల్లిని నమ్ముకుని జిల్లాలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. నాగళ్లు, ఇతర పరికరాలు, విత్తనాలు సిద్ధం చేసుకునేందుకు రైతన్నలను ఏరువాక పౌర్ణమి మేల్కొలుపుతుంది. జిల్లాలోని అలంపూర్, గద్వాల, మక్తల్, కొడంగల్, నారాయణపేట తదితర ప్రాంతాల్లో ఈ పండుగకు ప్రత్యేకత ఉంది. పశువులను ప్రత్యేకంగా అలంకరించి ఆలయం చుట్టూ తిప్పించి, వాటికి ఇంట్లో చేసిన పిండి పదార్థలను తినిపించి, సాగుకు సిద్ధం చేశారు. ‘ఏరువాక సాగేనో రన్నో చిన్నన్న...నీ కష్టమంతా తీరునురో అన్నో రైతన్న’ అంటూ రైతన్న హాయిగా పాటలు పాడుకుంటూ సేద్యం చేసే రోజులు కావివి. విత్తనాలు మొదలుకుని పంటచేతికొచ్చే వరకు కష్టాలు, పడిగాపులు తప్పడం లేదు. గట్టు/బొంరాస్‌పేట/ మరికల్: ముంగారి సేద్యానికి ముందు వచ్చే రైతుల పండుగ ఏరువాక. సేద్యంలో చేదోడు వాదోడుగా ఉండే కాడెద్దులను ఏరువాక సందర్భంగా శుక్రవారం రైతులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. సాయంత్రం గ్రామంలో పుర వీధుల గుండా డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. గడిచిన మూడేళ్ల కాలంలో వరుసగా కరువు రైతులను కోలుకోకుండా చేసి ంది. గతేడాది కరువు రాక పోయినా ఖరీఫ్‌తో పాటు రబీ పంటల దిగుబడి పూర్తిగా తగ్గడం తో పాటు గిట్టుబాటు ధర రాక అన్నదాతలు తల్లడిల్లిపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ ఏ డాదైనా ఏరువాక సాఫీగా సాగేనా అనే సందేహం ఉంది. ఇప్పటి వరకు చీనుకు జాడలేకుం డా పోవడమే రైతులను తీవ్రంగా కలచి వేస్తోంది. రోహిణి కార్తె వచ్చినా ఇప్పటి దాకా ఆశించిన స్థాయిలో ఒక్క వర్షం కూడా పండలేదు. గ్రామ దేవతలకు పూజలు..... ఏరువాక పండుగ సందర్భంగా గ్రామాల్లో మారెమ్మ, సుంకులమ్మ, కొర్వ ంజమ్మ, సవారమ్మ, సుంకులమ్మ, దేవమ్మ, కాళీకాదేవీ ఇలా గ్రామ దేవతల కు రైతులు ప్రత్యేక పూజలు చేస్తారు. ప్ర త్యేక వంటకాలు తయారు చేసి నైవేద్య ంగా సమర్పిస్తారు. పొలాలను దుక్కి దు న్ని విత్తనాలు వేసేందుకు సిద్ధం చేస్తారు. అయితే ఈ ఏడాది కొందరు రైతులు పౌర్ణమికి ముందే విత్తనాలు వేశారు. ఏరు ముందా..ఏరువాక ముందా? ఏరు ముందా... ఏరువాక ముందా అనేది నానుడి ఉంది. అంటే ఈ రెండు ఒకదానికొకటి పోటీ పడుతూ వస్తుంటాయని పెద్దలు చెబుతుంటారు. నైరుతి రుతుపవనాలు రాష్ర్టంలోకి ప్రవేశించిన తరుణంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు. ఇదే సమయంలో కర్ణాటకలో నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు కురిసి నదీ ప్రవాహం వస్తుంది. ఆ రెండింటిలో ఏది ముందు వచ్చినా రైతులు సంతోషిస్తారు. అందుకే ఏరు ముందా....ఏరువాక ముందా అనే నానుడి వచ్చింది. అయితే ఈ ఏడాది ఏరు(నదీ ప్రవాహం)కంటే ఏరువాక పౌర్ణమే ముందుగా వచ్చింది. ఒన్నంగి.. ఏరువాక తోరణం పాడిపంటలతో పచ్చగా తుల తూగాలని ప్రతి ఇంటికి పచ్చతోరణం (ఒన్నంగి) పెట్టడం గ్రామాల్లో అనాధిగా వస్తున్న సంప్రదాయం. బంటు, నెల్లి, తలారి కులాలకు చెందిన వారు రేల కొమ్మలను ఇంటికి తోరణాలకు అలంకరించి ఇంటి యజమానులు ఇచ్చే ధాన్యం, ఇతర సరుకులు తీసుకెళ్తారు. ఈ సంప్రదాయాన్ని కొన్ని గ్రామాల్లో మరిచిపోయినప్పటికీ ఏరువాక పండుగను పురస్కరించుకొని మూడు రోజుల ముందు నుంచి ‘ఒన్నంగి’ పెడుతున్నారు. మరికల్లో సంబరాలు పుష్కలమైన వర్షాలు కురిసి సమృద్ధిగా పాడిపంటలు పండాలని కోరుకుంటూ రైతన్నలు గురువారం మరికల్లో ఘన ంగా ఏరువాక పౌర్ణమి సంబరాలను నిర్వహించారు. ఎద్దులకు స్నానాలు చేయించి వాటిపై రంగులతో ప్రధాని మోడీ, తెలంగాణ చిత్రాలు వేశారు. ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఏరువాక తాడును తెంపేందుకు సంప్రదాయ పద్ధతి ప్రకారం రైతులు ఎద్దులను ఆ తాడు కింద పరుగులు పెట్టించారు. అనంతరం దొరల ఎ ద్దును తిప్పిన వ్యక్తి ఏరువాక తాడును తెప్పగ, ఆ తాడులో ఉన్న కొబ్బెర కోసం యువకులు పోటీపడి దక్కించుకున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. వర్షాలు పడితే చాలు పుడమి పులకరిస్తుంది. ఏటా జరిగే ఈ ప్రకృతి ధర్మం రైతన్నలకు ఎంతో మనోధైర్యాన్నిస్తుంది. వర్షాకాలంలో తొలకరి వర్షాలు కురిస్తే భూమిలోని గింజలు ఎంతో ఆశతో పైన కప్పుకొన్న మట్టిని తొలగించుకుంటూ మొలకెత్తుతాయి. ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఈ మొక్కలు పెరిగి పెద్దవై అన్నదాతలను ఆదుకుంటాయి. ఇటీవల కురిసిన తొలకరి చిరుజల్లులకు దేవరకద్ర-మహబూబ్‌నగర్ మార్గమధ్యలోని కోడూరు సమీపంలో గతంలో పంట పండినప్పుడు ఓ పొలంలో పడ్డ కొన్ని వేరుశనగ గింజలు పుడమి నుంచి ప్రాణం పోసుకొని మొలకెత్తిన దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. - దేవరకద్ర రూరల్