సత్యదేవుడే పెళ్ళిపెద్దగా...
గూడెం సత్యనారాయణస్వామి
కళ్యాణ క్షేత్రాలు
సత్యనారాయణ స్వామి అంటే ఎవరికైనా అన్నవరం దేవస్థానం గుర్తుకు వస్తుంది. కాని ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామ శివారులో గోదావరి నదీ తీరాన ఎత్తయిన కొండపై వెలిసిన రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం కూడా చాలా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం మంచిర్యాల నుంచి 30 కిలోమీటర్ల దూరంలో, ఆదిలాబాద్ నుంచి 133 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరీంనగర్ నుంచి 70 కిలోమీటర్లు. భక్తులు ప్రేమగా ‘గూడెం సత్యనారాయణ స్వామి’ అని పిలుచుకునే ఈ స్వామి సన్నిధిలో ప్రతినిత్యం భక్తుల పూజలు, సామూహిక వ్రతాలతో పాటు ప్రతి ఏటా పెళ్లిళ్ల సీజన్‌లో అనేక పెళ్లిళ్లు కూడా జరుగు తుంటాయి. ఒక కిలోమీటరు దూరంలోనే గోదావరి ప్రవాహం ఉంది కనుక పుణ్యస్నానాలు ఆచరించి పునీత భావన పొందుతుంటారు. జిల్లాలో బాసర తర్వాత గూడెం సత్యనారాయణస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. కరీంనగర్ ధర్మపురి క్షేత్రం ఈ ఆలయానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఆలయ ప్రాశస్త్యం..
1964 సంవత్సరంలో గ్రామంలోని గోవర్దన పెరుమాండ్లు అనే చాత్తాద శ్రీవైష్ణవుడికి సత్యదేవుడు కలలో కనిపించి మీ ఊరి రాట్నపు చెవుల కొండపై ఉన్నానని చెప్పాడు. ఆ వైష్ణవుడు కొండపై వెదకగా చిన్న విగ్రహం దర్శనమిచ్చింది. దీంతో ఆయన సంతోషంతో సమీపాన గల గోదావరినదిలో స్నానం ఆచరించి గోదావరి జలంతో అభిషేక పూజలు నిర్వహించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు కూడా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పెరుమాండ్లు గుట్టపైనే స్వామి వారి ఆలయం నిర్మించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ రాష్ట్రంలోనే ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి జాతర, కార్తీక పౌర్ణమికి భారీ జాతర నిర్వహిస్తూ ప్రతిఏటా స్వామివారికి కళ్యాణ బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు. 63వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఆలయం ఉండటంతో ప్రతి నిత్యం ఇక్కడ భక్తుల రద్దీ ఉంటుంది.
పూజలతో పాటు పెళ్ళిళ్లు
గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో ప్రతినిత్యం పూజలు, వ్రతాలతోపాటు పెళ్లిళ్ల సీజన్‌లో పెళ్లిళ్లు కూడా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ జరిగే పెళ్లిళ్లు కొద్దిపాటి నిబంధనలతో కూడుకుని ఉంటాయి. ఇక్కడ పెళ్లి జరుపుకోవాలంటే ముందుగా పెళ్లి నిర్వహణకు ఆలయం నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి. ఇవి వధువు, వరునికి వేర్వేరుగా ఉంటాయి. వాటిపై పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఫొటోలు అతికించాలి. ఏ గ్రామం వారైతే ఆ గ్రామ సర్పంచ్, మున్సిపాలిటీ వారైతే ఆ మున్సిపాలిటీ చైర్మన్ సంతకాలు చేయాలి. పెళ్లికొడుకు, పెళ్లికూతురు తల్లిదండ్రుల వివరాలు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డుతో సహాపూర్తి వివరాలు అందజేయాలి. పెళ్లి కానుక కింద ఆలయానికి రూ.2016 చెల్లించాలి. బదులుగా ఆలయం నుంచి వేదపండితుడు, సన్నాయి, పెళ్లి మండపం ఏర్పాటు చేసి పెళ్లి జరిపిస్తారు. - మొదంపురం వెంకటేష్, దండేపల్లి, ఆదిలాబాద్
ఇలా వెళ్లొచ్చు...: గూడెం సత్యనారాయణస్వామి ఆలయానికి కరీంనగర్ నుంచి వచ్చేవారు లక్సెట్టిపేట మీదుగా ఆదిలాబాద్, మంచిర్యాల వెళ్లే బస్సుల్లో రావచ్చు. ఈ బస్సులు ఆలయం ముందు నుంచే వెళతాయి కాబట్టి ఆలయం వద్దనే దిగొచ్చు. నిజామాబాద్, జగిత్యాల వైపు నుంచి వచ్చేవాళ్లు లక్సెట్టిపేట, మంచిర్యాల వెళ్లే బస్సుల్లో రావచ్చు. ఈ బస్సులు కూడా ఆలయం ముందు నుంచే వెళతాయి. ఆదిలాబాద్ నుంచి వచ్చే వాళ్లు మంచిర్యాల లేదా లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, గుంటూరు, ఖమ్మం వెళ్లే బస్సుల్లో రావచ్చు.
రైలు మార్గం ద్వారా..: గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి రైలు మార్గం ద్వారా వచ్చే వారు మంచిర్యాల రైల్వేస్టేషన్ లో దిగాలి. అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు వెళతాయి.