
ఉపవాసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని గతంలో పలు పరిశోధనలు రుజువు చేశాయి. తాజాగా మరో మంచి విషయం తెలిసింది. నిరాహారంగా ఉండటం వలన మన పేవుల్లో ఉండే మూలకణాల పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందట. సాధారణంగా పేవుల్లోని ఈ మూలకణాలు తగ్గితే ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి తేరుకోవడం కష్టం. వయసు పెరిగే కొద్దీ ఈ మూలకణాల పునరుత్పత్తి సామర్థ్యం సహజంగానే తగ్గిపోతుంటుంది. అయితే ఉపవాసం చేసినప్పుడు మాత్రం వీటి సంఖ్య గణనీయౖ స్థాయిలో పెరుగుతున్నట్లు గుర్తించామని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జీవశాస్త్రవేత్తలు చెప్పారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో కేవలం 24 గంటల ఉపవాసంతోనే మూలకణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగినట్లు తెలిసిందిట.
ఉపవాసం ఉన్నప్పుడు కణాలు గ్లూకోజ్ బదులుగా కొవ్వులను ముక్కలుగా చేస్తాయని ఫలితంగా మూలకణాలు చైతన్యవంతమై పునరుత్పత్తి వేగం పుంజుకుంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఓమెర్ ఇల్‌మాజ్ తెలిపారు. ఈ జీవక్రియను ప్రేరేపించే ఓ మూలకాన్ని తాము గుర్తించామని ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారికి, కీమోథెరపీ చేయించుకుంటున్న రోగులకూ ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఉపవాసంకు పేవులకు సంబంధించిన చాలా సమస్యలకు చెక్ పెట్టే సామర్థ్యముందని ఇందులో కేన్సర్ కూడా ఒకటని ఇల్‌మాజ్ వివరించారు.