
ప్రతీకాత్మక చిత్రం
లండన్ : ఉద్వేగానికి లోనయ్యే వారి ఎముకలు పటుత్వం కోల్పోతాయని తొలిసారిగా ఓ అథ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా మొనోపాజ్ దశలో మహిళలు ఎముకల సాంద్రత మందగిస్తుందని, త్వరగా పెళుసుబారిపోతాయని పేర్కొంది. ఇది వయసుమీరుతున్న మహిళల్లో సహజ జన్యుపరమైన లక్షణమే అయినా మహిళల్లో ఉద్వేగస్థాయిలకు, వారి ఎముకల పటుత్వానికి గల సంబంధాన్ని తాజా అథ్యయనం నిగ్గుతేల్చింది. యాంగ్జైటీ డిజార్డర్లతో మహిళలకు అనారోగ్య సమస్యలు తీవ్రమవడం పెరుగుతోందని, ప్రపంచవ్యాప్తంగా 33 శాతం మంది మహిళలు ఈ తరహా అస్వస్థతలకు లోనవుతున్నారని తెలిపింది.
ఉద్వేగానికి లోనయ్యే మహిళల ఆరోగ్యం అంతంతమాత్రమేనని, వారు అనారోగ్యకర అలవాట్లకు లోనవుతున్నారని అథ్యయనానికి నేతృత్వం వహించిన మెస్సినా యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఆంటోనియా కటలానో విశ్లేషించారు. మహిళల్లో ఈస్ర్టోజన్ మందగించినప్పుడు ఎముకలు పటుత్వం కోల్పోతాయని, అయితే ఎముకలు బలహీనపడటానికి ఇదొక్కటే కారణం కాదని, ఉద్వేగం అధికంగా ఉన్న మహిళల్లో ఎముకలు బలహీనపడే రిస్క్ ఎక్కువగా ఉందని చెప్పారు. ఉద్వేగ సమస్యలతో ఉక్కిరిబిక్కిరయ్యే మహిళల్లో విటమిన్ డీ స్ధాయి తక్కువగా ఉన్నట్టు వెల్లడైందన్నారు. ఎముకల ఆరోగ్యానికి, ఉద్వేగ సమస్యలకు సంబంధం ఉందని తమ అథ్యయనంలో తొలిసారిగా స్పష్టమైందని చెప్పారు.