మా ఫ్రెండ్‌వాళ్ల అబ్బాయి వయసు 15 ఏళ్లు. ఈమధ్య అతడికి కీళ్లవాతం వచ్చిందని డాక్టర్ చెప్పారు. దాంతో మేము ఎంతగానో ఆశ్చర్యపోయాం. ఇంత చిన్న పిల్లలకు కూడా ఆర్థరైటిస్ వస్తుందా?
కీళ్లవాతం లేదా ఆర్థరైటిస్ అనేవి కేవలం పెద్దవాళ్లకే వస్తాయనే అపోహ చాలామందిలో ఉంటుంది. ఈ వ్యాధులు కేవలం పెద్దవారికే పరిమితం కావు. పిల్లలు కూడా చిన్న వయసులోనే లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఏంకైలోజింగ్ స్పాండలైటిస్, వాస్క్యులైటిస్ వంటి అనేక రకాల కీళ్లవాతాల బారిన పడవచ్చు. వీటన్నింటిలోకీ జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ అనేది చాలా సాధారణంగా చూసే రకం. ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు. నెలలు, సంవత్సరాలు లేదా జీవితకాలం కూడా కొనసాగుతాయి.
పిల్లలకు కీళ్లవాతం ఎందుకొస్తుంది? : ఈ జబ్బులు ఎందుకు వస్తాయనే అంశంపై నిర్దిష్టంగా ఇంకా కారణాలు పెద్దగా తెలియదు. అయితే రకరకాల పరిశోధనల తర్వాత వీటిని జన్యులోపాలే ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. జన్యులోపం ఉన్నప్పుడు బయటి వాతావరణంలోని క్రిములు, కాలుష్యం వంటి అంశాలు వ్యాధిని తేలిగ్గా ప్రేరేపించగలవు. ఫలితంగా మన శరీరంలోని వ్యాధినిరోధక శక్తి సొంత కణాలనే పరాయివిగా భావించి వాటిపై దాడికి దిగుతాయి. ఈ స్వీయదాడి ఫలితంగా కీళ్లు, కండరాలు మాత్రమేగాక ఇంకా చాలా అవయవాలు ప్రభావితమవుతాయి. అందుకే దీన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు.
లక్షణాలు: వ్యాధి లక్షణాలు పిల్లలందరిలో ఒకేలా ఉండవు. ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపించడమే కాకుండా తరచూ మారుతుంటాయి. ఎక్కువగా కీళ్ల మీద ప్రభావం చూపినప్పటికీ, ఊపిరితిత్తులు, కళ్లు, చర్మం, కాలేయం, మూత్రపిండాలు, గుండె వంటి అవయవాలపైన కూడా ఈ వ్యాధి ప్రభావం పడుతుంది. పెద్దవారిలో కనిపించే కీళ్లవాతానికీ, పిల్లల్లో కనిపించే దానికి చాలా తేడాలుంటాయి. పిల్లల్లో అభివృద్ధి చెందే ఎముకలపైన ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో పెరుగుదల ఆగిపోతుంది. కళ్ల మీద కూడా ప్రభావం పడి, చూపు పోయే ప్రమాదం ఉంటుంది. ఈ కీళ్లవాతపు వ్యాధులు సాధారణ చికిత్సా విధానాలకు లొంగవు.
పిల్లలు పెరుగుతున్న కొద్దీ లక్షణాల తీవ్రత పెరగడం, మందుల దుష్ప్రభావాలు కలగడం, జీవితకాలపు వైకల్యం వంటి ప్రమాదాలనూ ఎదుర్కొంటారు. కొన్నిసార్లు జబ్బు తీవ్రత అకస్మాత్తుగా ఏ కారణమూ లేకుండానే పెరిగిపోతుంది. మరికొన్నిసార్లు ఎలాంటి తీవ్రతా కనిపించదు. అలాగే మానసిక ఆరోగ్యంపై కూడా ఈ వ్యాధుల ప్రభావం ఉంటుంది. ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్యాప్రయత్నాల వంటి పరిణామాలకు దారితీస్తాయి. అందువల్ల కుటుంబసభ్యుల మీద కూడా ఒత్తిడి ఉంటుంది. విద్యా, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా రోగులు సామాజికంగా ఇక్కట్లు ఎదుర్కొంటారు.
జాగ్రత్తలు : ఈ జబ్బు లక్షణాలను పసిగట్టినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రుమటాలజిస్ట్‌ను కలవాలి. వ్యాధి నిర్ధారణ జరిగాక, దాని తీవ్రతను బట్టి వారు మందులు సూచిస్తారు.
►రుమటాలజిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే ఈ మందులు వాడాలి.
►కంటిపైనా, ఇతర అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం పడిందో లేదో తెలుసుకునేందుకు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
►సరైన పోషణ, క్యాల్షియమ్, విటమిన్–డి సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే చాలామందికి ఆహారం ద్వారా కావలసిన క్యాల్షియమ్ లభించదు. అలాంటి వారికి క్యాల్షియమ్ సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
►కీళ్లవాతం వల్ల ఎముకలు, కండరాలు బలాన్ని కోల్పోతాయి. సరైన వ్యాయామం వల్ల ఇవి బలంగా తయారవుతాయి. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వైకల్యాన్ని నివారించవచ్చు.
►ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో, రుమటాలజిస్టుల సలహా మేరకు సరైన మందులు వాడటం వల్ల ఈ రోగులు ఎప్పటికీ నార్మల్ జీవితాన్నే గడపవచ్చు.
చికిత్సా విధానాలు: గతంలో అరుదుగా కనిపించే ఈ రకం జబ్బుల్ని ఇటీవల తరచూ చూడటం జరుగుతోంది. చికిత్సావిధానాలు కీళ్లవాతం రకాన్ని బట్టి ఉంటాయి. కొంతమందికి చిన్ని నొప్పినివారణ మందులతోనే నయమవుతుంది. మరికొందరిలో స్టెరాయిడ్స్ అవసరమవుతాయి. వాటికీ లొంగని వ్యాధులకూ, ప్రాణాంతకమైన రకాలకు డిసీజ్ మాడిఫైడ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ (డీమార్డ్స్) అనే తరహా మందులు వాడాల్సి ఉంటుంది. వీటిని నివారించలేనప్పటికీ, సరైన సమయంలో వైద్యచికిత్స తీసుకుంటే శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment