
ఆధునిక జపాన్ సాహిత్యంలో అత్యంత గొప్ప రచయిత నత్సుమే సోసెకి(1867–1916). వెయ్యి యెన్ల నోటు మీద కూడా ఆయన చిత్రాన్ని ముద్రించారు. కొకొరో, బాచన్, ఐ యామ్ ఎ క్యాట్, ‘లైట్ అండ్ డార్క్‌నెస్’(అసంపూర్ణం) ఆయన ప్రసిద్ధ నవలలు.
అదివరకే ఐదుగురు పిల్లలున్న వయసు ముదిరిన తల్లిదండ్రులకు అక్కర్లేని సంతానంగా జన్మించాడు నత్సుమే. నత్సుమే కిన్నోసుకే. సంతానం లేని దంపతులకు దత్తత వెళ్లాడు. కానీ వాళ్లు విడిపోవడంతో తొమ్మిదేళ్లప్పుడు మళ్లీ సొంతింటికి తిరిగి వచ్చాడు. తల్లినీ, ఇద్దరు అన్నలనూ చిన్నవయసులోనే కోల్పోయాడు. ఒంటరితనం, అభద్రత తెలియకుండానే అతడిని చుట్టుకున్నాయి.
చైనీస్ సాహిత్యం మీది మక్కువతో తానూ రచయిత కావాలని కలగన్నాడు. కానీ ఇంట్లో వాళ్లు ఇదీ అక్కర్లేదన్నారు. దాంతో సోసెకి(మొండివాడు) అన్న మారుపేరు స్వీకరించాడు. విస్తృతంగా సాహిత్యాన్ని అధ్యయనం చేసిన సోసెకి– హైకూలు, సాహిత్య వ్యాసాలతో కెరియర్ ఆరంభించాడు. అతి సామాన్యుడి ఆర్థిక ఇక్కట్ల నుంచి ఆధునిక పరిశ్రమల విపరిణామాల దాకా తన రచనల్లో చర్చించాడు.
హైకూలాంటి నవల
జరుగుతున్న పరిణామాలను రచయిత మార్చలేడు. విరూపమూ, బాధాకరమూ అయిన జీవితాన్ని ఒక దృష్టికోణంతో చూడటం మొదలుపెట్టడం ద్వారా జీవితాన్ని అర్థవంతం చేయగలం అంటాడు సోసెకి. దీనికి రచయితకు కావాల్సినవల్లా ఉద్వేగమూ, ప్రత్యేకమైన రుచీ.