
కృత్రిమ గుండె
హమ్మయ్యా... ఎట్టకేలకు మనిషికి గుండె అందుబాటులోకి రానుంది.. వ్యాధి లేదా పోటు వంటి కారణాలతో గుండె బాగా బలహీనపడితే ఇప్పటివరకూ కృత్రిమ గుండెను వాడేవారు గానీ.. అదంతా తాత్కాలికమే. అవయవ దానం ద్వారా ఇంకో గుండె దొరికేంత వరకూ రోగిని బతికేలా చేస్తుంది ఈ గుండె. అయితే ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనుంది. డాక్టర్ రిచర్డ్ వాంప్లర్ అనే శాస్త్రవేత్త 2014 నుంచి ఈ కృత్రిమ గుండెను అభివృద్ధి చేస్తున్నారు. మిగిలిన కృత్రిమ గుండెల మాదిరిగా ఇందులో బోలెడన్ని భాగాలు ఉండవు.
కచ్చితంగా చెప్పాలంటే ఒకే ఒక్క కదిలే భాగం ఉంటుంది. అలాగే మనిషి గుండెలో మాదిరిగా కవాటాలు లేకుండానే దీన్ని తయారుచేశారు. టైటానియం గొట్టం... అందులో అటుఇటు కదిలే గొట్టం లాంటి నిర్మాణం. ఇదీ ఒరెగాన్ గుండె స్థూల నిర్మాణం. కదిలే గొట్టం గుండె దిగువ భాగంలో ఉండే రెండు కవాటాల మాదిరిగా పనిచేస్తుందన్నమాట. రోగి తనతోపాటు మోసుకెళ్లే బ్యాటరీ ద్వారా శక్తితో పనిచేస్తుంది ఇది. ఆవులు, గొర్రెల్లో ఈ కృత్రిమ గుండెను ఇప్పటికీ విజయవంతంగా పరీక్షించారు. మూడు నెలలపాటు పనిచేయించిన తరవాత మానవులపై ప్రయోగాలు చేస్తామని ఒరెగాన్ యూనివర్శిటీ అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment