
బతుకు కోరే బడ్జెట్.. నెలకు రూపాయే!
బతుకు కోరే బడ్జెట్.. నెలకు రూపాయే!
ప్రమాద సందర్భాలలో దేశంలోని ప్రతి ఒక్కరికీ కొంత మేర ఆర్థిక చేయూతను ఇవ్వాలనే ముఖ్యోద్దేశంతో ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం ప్రారంభమైంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం మొదలయింది. ప్రమాదం వల్ల సంభవించే మరణానికి లేదా అంగవైకల్యానికి ఇది బీమా రక్షణ కల్పిస్తుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని బ్యాంకుల ద్వారా నిర్వహిస్తోంది. ఏవైతే బ్యాంకులు బీమా కంపెనీలతో అనుసంధానమై ఉంటాయో ఆ బ్యాంకులు తమ సేవింగ్స్ అకౌంటు ఖాతాదారులకు ఈ పథకాన్ని అందజేస్తాయి. ఈ పథకం వివరాలను చూద్దాం.
ఒక ఖాతాదారుడు ఒక బ్యాంకు ద్వారా మాత్రమే ఈ పథకాన్ని కలిగి ఉండే వీలుంది. {పీమియం సంవత్సరానికి 12 రూపాయలు. ఆ మొత్తం ఖాతాదారుని ఖాతా ద్వారా ఆటో డెబిట్ విధానంలో కట్ అవుతూ ఉంటుంది.ఈ పథకం ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి మే 31 వరకు ఉంటుంది. మళ్లీ తర్వాత సంవత్సరానికి పొడిగించడానికి మే 31 లోపు ప్రీమియం కోసం తగిన మొత్తాన్ని ఖాతాలో ఉంచవలసి ఉంటుంది. ఖాతాదారుని సూచన మేరకు బ్యాంకు వారు ఆటో డెబిట్ ద్వారా ఖాతా నుండి ప్రీమియం సొమ్మును తీసుకుని బీమా కంపెనీకి చెల్లిస్తారు.
కనీసం 18 సం. వయస్సు నుండి 70 సం. వయస్సు వరకు ఈ పథకంలో చేరవచ్చు.ఈ పథకంలో చేరిన వారికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఈ కింద తెలియజేసిన విధంగా బీమా సొమ్ము అందుతుంది.
ఎ) ఖాతాదారుడు మరణిస్తే 2 లక్షల రూపాయలు నామినీకి అందజేస్తారు.
బి) రెండు కళ్లు / రెండు చేతులు / రెండు పాదాలు / ఒక కన్ను, చేయి, ఒక పాదం పనిచేయకపోతే 2 లక్షల రూపాయలు ఖాతాదారునికి అందజేస్తారు.
సి) ఖాతాదారునికి ఒక కన్ను /ఒక పాదం / ఒక చెయ్యి పూర్తిగా పని చేయకపోతే 1 లక్ష రూపాయలు ఖాతాదారునికి అందజేస్తారు.
డి) ఖాతాదారుని బ్యాంకు ఖాతాకు ఎవరైతే నామినీగా ఉంటారో వారినే ఈ పథకానికి కూడా నామినీగా నమోదు చేస్తారు. ఒక వేళ వేరేవారిని నామినీగా పెట్టదలచుకుంటే వారి వివరాలను బ్యాంకుకు అందజేసి నమోదు చేయించుకోవచ్చు.
ఈ పథకంలో చేరిన తర్వాత కింది సందర్భాలలో బీమా రక్షణ ఉండదు.
ఎ) 70 సం. వయసు నిండిన తర్వాత బీమా రక్షణ ఉండదు. ఇంకా...
బి) బ్యాంకు ఖాతా మూసి వేసినప్పుడు
సి) బ్యాంకు ఖాతాలో ప్రీమియం సొమ్మును జమ చేయనప్పుడు
డి) ఒకవేళ ఒక బ్యాంకు ఖాతా కన్నా ఎక్కువ బ్యాంకులలో ప్రీమియం చెల్లించినా కూడా ఒక ఖాతాలోని పథకం ద్వారానే బీమా రక్షణ ఉంటుంది కానీ, తక్కిన ఖాతాల ద్వారా ఉండదు. అలాగే మిగతా ఖాతాల ప్రీమియంలను కూడా వెనక్కి ఇవ్వరు. {పతి సంవత్సం ప్రీమియం ఎంత అనేది ఈ పథకంలోని క్లెయిమ్‌లను సమీక్షించి మార్పులు, చేర్పులు చేస్తుంటారు.జూన్ 1 తర్వాత ఈ పథకంలో జాయిన్ అయితే బీమా రక్షణ జాయిన్ అయిన తేదీ నుండి మే 31 వరకు లభిస్తుంది. కానీ ప్రీమియం మొత్తం కట్టాలి.ఖాతాదారుని ఆధార్ నంబర్‌ని కీలక పత్రంగా పరిగణిస్తారు. కనుక ఆధార్ నంబర్ తప్పకుండా బ్యాంకు ఖాతాకు అనుసంధానం అయి ఉండాలి.ఖాతాదారుని బ్యాంకు.. తన ఖాతాదారులందరికీ కలిపి మాస్టర్ పాలసీని కలిగి ఉంటుంది. ఈ పథకం ద్వారా చాలా తక్కువ ప్రీమియంతో సులభంగా ఖాతాదారులకు ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది.
రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’