ఉదయాన్నే కాఫీ అంత మంచిది కాదు..
కొత్త పరిశోధన
మనలో చాలామందికి కాఫీతో దినచర్య మొదలుపెట్టే అలవాటు ఉంటుంది. పొద్దున్న నిద్రలేవగానే కాఫీ పడకుంటే బండి కదలదనేంతగా ఆ అలవాటు ఉంటుంది. కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నా, ఉదయాన్నే కాఫీ తీసుకోవడం మాత్రం అంత మంచిది కాదని చెబుతున్నారు వైద్య నిపుణులు. కాఫీ తీసుకోవడానికి ఉదయం అంత సానుకూలమైన సమయం కాదని, పొద్దున్నే ఏదైనా కడుపులో పడేసుకున్న తర్వాత కాసేపటికి కాఫీ తీసుకుంటే ఫర్వాలేదని అంటున్నారు.
యూట్యూబ్ సైన్స్ చానల్ ‘ఏఎస్‌ఏపీ సైన్స్’ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో కాఫీ తీసుకునేందుకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు తగిన సమయమని తేల్చారు. ఉదయం నిద్రలేస్తూనే శరీరంలో కార్టిసాల్ విడుదల అధిక స్థాయిలో ఉంటుందని, అలాంటి సమయంలో కాఫీకి దూరంగా ఉండటమే మేలని ఈ నిపుణులు చెబుతున్నారు.