
ఇక ఆరామ్‌గా..అంజలి చేతి కాఫీ
ఇవాళ ఈడెన్, వారానికి వాంఖేడ్! తర్వాత? మాస్టర్ బ్లాస్టర్... ఎ ఫుల్‌టైమ్ ఫ్యామిలీ మేన్. భార్య, పిల్లలు, కబుర్లు, కుటుంబంతో టూర్లు. ఇప్పటి వరకు ఇవన్నీ లేవా? ఉండే ఉంటాయ్ కానీ... అంజలిని మొదటి సారి కలిసిందీ, కలిసి మొదటి సినిమా చూసిందీ తనని, పిల్లల్ని ఆమె ఎలా బ్యాలెన్స్ చేసిందీ... ఇవన్నీ మాట్లాడుకోడానికి ఎక్స్‌ట్రాగా ఇంకొంచెం టైమ్!! ఎట్లీస్ట్... బెడ్ కాఫీ అడగడానికీ, అర్ధాంగి తెచ్చే కాఫీ కోసం వెయిట్ చెయ్యడానికీ, ఆరామ్‌గా మరికొంత సమయం. అద్సరే... ఉరుకులు ‘పరుగుల’ మధ్య... పద్దెనిమిదేళ్ల పాటు వీరి దాంపత్య జీవితం ఎలా గడిచి ఉంటుంది? ఎలాగేముందీ... ‘మనసే జతగా...’
సచిన్ టెండూల్కర్
నా జీవితంలో ముగ్గురు మహిళలున్నారు. ఒకరు మా అమ్మ. తను ఉద్యోగిగానూ, ఇంటి బాధ్యతలను నిర్వర్తించడంలోనూ తీరికలేకుండా ఉండేది. కాని అంతపనిలోనూ నాకోసం సమయం కేటాయించేది. ఆఫీస్ అయిపోగానే ఇంటినీ చక్కదిద్దుకునేవారు. తనెప్పుడు నాకూ శక్తిమంతమైన మహిళగా అనిపిస్తుంది. మరొకరు మా మేనత్త. నాలుగేళ్లు అత్త వాళ్ల ఇంటిలో పెరిగాను. నాకు క్రికెట్ మీద ఉన్న ఇష్టాన్ని వారి ద్వారానే మా ఇంట్లో గుర్తించారు. ఇక మూడవ మహిళ నా భార్య అంజలి.
అంజలి ఎప్పుడూ చాలా లో ప్రొఫైల్‌ను మెయింటెయిన్ చేస్తుంది. తను డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ! ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి కామెంట్ చేయదు. కుటుంబంలోనూ, బంధుమిత్రుల్లోనూ.. అందరితోనూ కలివిడిగా ఉంటుంది.
అంజలీ టెండూల్కర్
అందరూ అనుకుంటున్నట్టు మా ఇద్దరికీ ముందు నుంచీ పరిచయం లేదు. మేమిద్దరం మొదటిసారి కలుసుకున్నది 1990లో ముంబయ్ ఎయిర్‌పోర్ట్‌లో! ఇంగ్లండ్ మ్యాచ్ ముగిశాక ఇండియా టీమ్ స్వదేశానికి వస్తోంది. ఆ రిటర్న్‌లో ఫస్ట్ టైమ్ ఎయిర్‌పోర్ట్‌లో సచిన్‌ను చూశాను. మా పరిచయం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. అప్పటివరకు నాకు క్రికెట్ గురించి ఏ మాత్రం పరిజ్ఞానం లేదు. మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ ద్వారా మా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఐదేళ్లకు 1995లో మా పెళ్లి అయ్యింది.
పెళ్లికి ముందు మేమిద్దరం కలిసి చూసిన సినిమా ‘రోజా’. అప్పుడు నేను మెడిసిన్ చదువుతున్నాను. నేను సచిన్‌ను ఎందుకు ఇష్టపడ్డాను అంటే ఇదీ కారణం అని చెప్పలేను. మా అనుబంధం అలా పెరుగుతూనే ఉంది. మా బంధం నానాటికీ బలపడుతూనే ఉంది.
నాకు 9-5 జాబ్ ఇష్టం ఉండదు. అందుకే వైద్యవృత్తిని ఎంచుకున్నాను. నా వృత్తిని అమితంగా ప్రేమిస్తాను. ఒకవేళ సచిన్‌ను పెళ్లి చేసుకుంటే కెరియర్ ఆగిపోతుంది అనుకుంటే, నేనసలు పెళ్లికే ఒప్పుకునేదాన్ని కాదేమో!
ఎందుకు, ఏమిటి అనే విషయాల్లో సచిన్ చాలా క్లియర్‌గా ఉంటారు. రేపటి గురించి ఆలోచించరు. ప్రస్తుతం జరుగుతున్నదానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. నేనూ ప్రతిదీ సైంటిఫిక్‌గా, ప్రాక్టికల్‌గా చూస్తాను. మా ఇద్దరిలో ఉండే కామన్ థింగ్ ఇదే అనుకుంటాను. తను లతామంగేష్కర్, కిశోర్‌కుమార్ పాటలు వినడానికి చాలా ఇష్టపడతారు. హిందీ సినిమాలు, పాటలపై నాకు పెద్దగా పరిజ్ఞానం లేదు. సినిమాలు చూడ్డం, పాటలు వినడం.. అది కూడా పెళ్లి తర్వాతే మొదలుపెట్టాను.
మాకు సారా, అర్జున్ ఇద్దరు పిల్లలు. వారికి అతిముఖ్యమైన పుట్టినరోజు, స్కూల్ డే వంటి వేడుకలకు సచిన్ అందుబాటులో ఉండరు. కాని ఎందుకు రాలేదో తర్వాత వివరించి చెబుతారు. పిల్లలు అర్థ్ధం చేసుకుంటారు. సచిన్‌కు క్రికెట్ తర్వాతే అన్నీ! అది నాకు తెలుసు. ఎక్కువగా ప్రాక్టీస్‌లోనే ఉంటారు. ఈ మధ్య పిల్లల విషయంలో సచిన్ చాలా రియలైజ్ అయ్యారనిపిస్తోంది. పిల్లలు పెద్దవుతున్నారు కదా! వారితో ఈ మధ్య ఎక్కువ సమయం కేటాయించడానికి ఇష్టపడుతున్నారు.
క్రికెట్‌లో తనో లెజండ్! పిల్లలతో ఉండేప్పుడు మాత్రం చాలా సాధారణమైన తండ్రిలా అనిపిస్తారు.
అంజలి చాలా గ్రేట్‌గా కనిపిస్తుంది. నేను నా క్రికెట్‌తో 24 గంటలూ ఉండిపోయినా ఇంటినీ, పిల్లలను, ఆసుపత్రినీ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటుంది. తను నా జీవితంలోకి అడుగుపెట్టి 23 ఏళ్లు. మా పెళ్లయి 18 ఏళ్లు. కెరీర్‌లో ఒడిదొడుకులను ఎదుర్కొనే సమయంలో ఎంతో సపోర్ట్‌గా నిలిచింది అంజలి. గాయాలు అయి కష్టంగా అనిపించినప్పుడు నన్ను చిన్నపిల్లవాడిలా చూసుకుంది. జీవితంలో రెండోకోణాన్నీ చూడటం తన ద్వారానే తెలుసుకున్నాను. క్రికెట్‌లో ఇంతవరకు చేరుకోగలిగానంటే అది అంజలి వల్లే!
పెళ్లి తర్వాత చాలామంది నే చదివిన చదువు వృథా అయిపోతుందని, గృహిణిగా ఇంటికే పరిమితం అవుతాను అనుకున్నారు. కాని నేనలా అనుకోలేదు. సచిన్ నాకా స్వేచ్ఛను ఇచ్చారు. సచిన్‌ను పెళ్లిచేసుకోవడం వల్లే మెడిసిన్‌ను ఫుల్‌టైమ్ కెరీర్‌గా చేయగలుగుతున్నాను. నేను పిడియాట్రీషియన్‌ని. ఏ టైమ్‌లో అయినా సరే... హాస్పిటల్‌లో రోగిని అడ్మిట్ చేశారు అని పిలుపు రాగానే ఆ సమయంలో అక్కడ వారికి అందుబాటులో ఉంటాను. ఇంట్లో కూడా ఏ చిన్న మార్పు చేయాలన్నా నిర్ణయం నాకే వదిలేస్తారు సచిన్.