టెండనైటిస్‌ తగ్గుతుందా? | Back Pain Homeopathic Treatment For Problems Is Available | Sakshi
Sakshi News home page

టెండనైటిస్‌ తగ్గుతుందా?

Published Thu, Oct 31 2019 3:24 AM | Last Updated on Thu, Oct 31 2019 3:24 AM

Back Pain Homeopathic Treatment For Problems Is Available - Sakshi

నా వయసు 39. నేనొక క్రీడాకారుణ్ణి. కొంతకాలంగా చేయి కదిలించినప్పుడు భుజంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే టెండన్స్‌కి సంబంధించిన సమస్య అని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా?

మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు టెండినైటిస్‌ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్‌ అని అంటాము. వీటికి సాగగల గుణం ఉండటం వల్ల అవి కండరాలు ముడుచుకునే సమయంలో, ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతనైనా వీటికి హానికలిగితే, కదలికలు ఇబ్బందికరంగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.

ఈ టెండన్స్‌ ఇన్ఫెక్షన్‌కు గురికావడాన్ని టెండినైటిస్‌ అంటారు. శరీరంలో ఎక్కడైనా ఏర్పడే ఈ సమస్య... భుజాలలో, మోచేతుల్లో, మణికట్టు, బొటనవేలు మొదటి భాగంలో, తుంటి, మోకాలు, మడమలు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. 40 ఏళ్లు పైబడిన వారిలో సాధారణంగా టెండాన్స్‌ సాగేతత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గడం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

►కారణాలు: వృత్తిరీత్యా లేదా హాబీల కారణంగా టెండన్స్‌పై అధిక ఒత్తిడి కలిగించే ఒక రకమైన కదలికలను ఎక్కువగా కొనసాగించడం. ఉదా: కంప్యూటర్‌ కీ–బోర్డులు, మౌస్‌లు ఎక్కువగా వాడటం, కార్పెంటింగ్, పెయింటింగ్‌ మొదలైనవి.

►క్రీడల వల్ల:
పరుగెత్తడం, టెన్నిస్, బాస్కెట్‌బాల్, గోల్ఫ్, బౌలింగ్‌ మొదలైనవాటివల్ల.
డయాబెటిస్, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి ఇబ్బందులతో బాధపడేవారు

కొన్ని ఇన్ఫెక్షన్‌లు లక్షణాలు: టెండినైటిస్‌కి గురైన ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం, ఆ భాగాన్ని కదిలించినప్పుడు నొప్పి అధికమవ్వడం, వాపు, చేతితో తాకితే ఆ ప్రదేశం వేడిగా అనిపించడం, ఎర్రగా మారడంవంటి లక్షణాలు.

జాగ్రత్తలు:
కంప్యూటర్లను, కీబోర్డులను, మౌస్‌లను సరైన పొజిషన్‌లో సర్దుబాటు చేసుకోవడం.
పనిలో కొంత విశ్రాంతి తీసుకోవడం
వ్యాయామాలు ఒకేసారి అధిక ఒత్తిడికి గురిచేసేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించడం
క్రీడలలో కోచ్‌ సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం.

చికిత్స: కాన్‌స్టిట్యూషనల్‌ విధానంలో చికిత్స అందించడం ద్వారా రోగ నిరోధకశక్తిని సరిచేసి టెండన్స్‌ను దృఢపరచి సమస్యను సమూలంగా నయం చేయవచ్చు.
డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్,
హైదరాబాద్‌

నడుమునొప్పి తగ్గుతుందా?
నా వయసు 42 ఏళ్లు. నాకు కొద్దికాలంగా తీవ్రంగా నడు ము నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే అది డిస్క్‌ సమస్య అని,  ఆపరేషన్‌ అవసరమవుతుందన్నారు. హోమియో చికిత్స ద్వారా ఆపరేషన్‌ అవసరం లేకుండా నా సమస్య తగ్గుతుందా?

నడుమునొప్పి తగ్గితే చాలని సర్జరీకి సిద్ధపడితే... ఒకవేళ ఆ ఆపరేషన్‌ విఫలమైతే కొత్త సమస్యలు మొదలవుతాయి. ఆ బాధలు చెప్పనలవి కాదు. చాలా మంది విషయంలో ఇదే జరుగుతుంది. డిస్క్‌లో సమస్య అని సర్జరీ చేస్తే అది కొత్త అనర్థాలకు కారణమవుతుంది. తప్పుడు భంగిమల్లో కూర్చుని, గంటల తరబడి అదేపనిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిజానికి డిస్క్, స్పాండిలోసిస్‌ వంటి సమస్యలను ఆపరేషన్‌ అవసరం లేకుండానే హోమియో మందులతోనే సమూలంగా తగ్గించే వీలుంది.

నడుము భాగంలో విపరీతమైన నొప్పి వస్తున్నట్లయితే దాన్ని లంబార్‌ స్పాండిలోసిస్‌ అంటారు. నడుమునొప్పి కారణంగా ఏ పనీ చేసుకోలేకపోవడం వంటి అసహాయత ఏర్పడుతుంది. ఉదయం వేళల్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఆ నొప్పి క్రమంగా నడుము నుంచి కాళ్లలోకి పాకుతుంది.  మహిళలకు మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోవడం వంటి సమస్యలు సైతం వచ్చే అవకాశాలున్నాయి.  లంబార్‌ స్పాండిలోసిస్‌తో దీర్ఘకాలం బాధపడే వారిలో శృంగార సమస్యలూ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.

వ్యాధి నిర్ధారణ: ఎక్స్‌–రే, ఎమ్మారై స్కాన్‌ ద్వారా డిస్క్‌లలో తేడాను, నడుమునొప్పి గల కారణాలను గుర్తించవచ్చు.

చికిత్స: దీర్ఘకాలంగా వేధిస్తున్న నడుము నొప్పి సమస్యలకు హోమియో వైద్య విధానంలో చికిత్స అందుబాటులో ఉంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న మందుల ద్వారా నడుమునొప్పిని పూర్తిగా దూరం చేయవచ్చు. వెన్నుపూసలో జరిగే మార్పులను నివారిస్తూ, కండరాలకు బలం చేకూర్చే విధంగా చికిత్స ఇవ్వడం వల్ల సత్ఫలితాలుంటాయి. అయితే పరిస్థితి పూర్తిగా విషమించకముందే డాక్టర్‌ను సంప్రదిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్‌ను సంప్రదించండి.
డా‘‘ కె. రవికిరణ్,
మాస్టర్స్‌ హోమియోపతి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement