
ఉదయం నిద్ర లేవగానే కడుపు కదలకపోతే.. మనలో చాలామందికి అదో వెలితి. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితముండదు. ఇలాంటి అన్ని రకాల మలబద్ధకం సమస్యలకు తాము ఓ వినూత్నమైన పరిష్కారాన్ని కనుక్కున్నామని అంటున్నారు మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు. ట్రైప్టామిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసేలా ఓ బ్యాక్టీరియాలో జన్యుమార్పులు చేయడం ఈ కొత్త పద్ధతిలోని విశేషమని పూర్ణ కశ్యప్ అనే శాస్త్రవేత్త తెలిపారు. మలబద్ధకంతో ఇబ్బంది పడే వారికి సాధారణంగా డాక్టర్లు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, లేదంటే ప్రోబయాటిక్‌లు తీసుకోవాలని సూచిస్తూంటారని, అయితే మన పేవుల్లో ఉండే సూక్ష్మజీవి ప్రపంచం ఎవరికి వారిదే ప్రత్యేకమైంది కాబట్టి చాలా సందర్భాల్లో డాక్టర్ల సూచనలు పనిచేయవని చెప్పారు.
ఈ నేపథ్యంలో తాము ట్రైప్టామిన్‌ను పెద్దఎత్తున ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియాపై పరిశోధనలు మొదలుపెట్టామని ఈ రసాయనం మన పేవుల్లో ఉత్పత్తి అయ్యే సెరెటోనిన్‌ను పోలి ఉంటుందని చెప్పారు. ఎలుకల్లో ఈ బ్యాక్టీరియాను జొప్పించినప్పుడు వాటి పేవుల్లో ద్రవాలు ఎక్కువగా స్రవించాయని, ఫలితంగా ఆహారం తొందరగా కదలడంతోపాటు ఆ సమస్య కూడా తీరిందని ఆయన వివరించారు. పైగా తాము ఎంచుకున్న బ్యాక్టీరియా అక్కడికక్కడే నశించిపోతుంది కాబట్టి దుష్ప్రభావాలు ఏమీ ఉండవని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో మూడేళ్లలో ఈ కొత్త బ్యాక్టీరియా వైద్యం అందుబాటులోకి రావచ్చునని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment