జుట్టుకు జామ...
బ్యూటిప్స్
జుట్టు ఎంత పొడవున్నా జీవం లేనట్టుగా.. పొడిబారిపోయి కనిపిస్తూంటే ప్రయోజనం ఏముంది... అందుకు ఇంట్లోనే ఓ ఔషధం తయారు చేసుకోవచ్చు. గుప్పెడు జామాకులను నీళ్లలో బాగా మరిగించాలి. తర్వాత ఆకులను తీసేసి నీరు గోరువెచ్చగా అయ్యాక ఆ నీటితో మాడుకు మర్దన చేయాలి. ఓ 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. జామాకుల్లో ఉండే పోషకాల వల్ల జుట్టు కుదుళ్లు దృఢపడటమే కాకుండా హెయిర్‌ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది.
తలకు కృత్రిమ రసాయనాలతో తయారైన కండిషనర్లకు బదులు గ్రీన్ టీని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. షాంపూతో కానీ కుంకుడురసంతో కానీ తలస్నానం చేసి తర్వాత గ్రీన్ టీని రాసుకొని రెండు నిమిషాలు ఆగి చల్లటి నీటితో జుట్టును కడిగేసుకోవాలి.
తల దురదగా ఉండటానికి పేలు, చుండ్రు మాత్రమే కాదు అలర్జీ కూడా కారణమే. దీనిని నివారించాలంటే మెంతి ఆకుల పేస్టును తలకు పట్టించి, అరగంట తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేస్తే సరి... వారానికి రెండు సార్లైనా ఈ చిట్కా పాటిస్తే అలర్జీ నుంచి తప్పించుకోవచ్చు.