
చర్మం పొడిబారకుండా...
బ్యూటిప్స్
చలికాలం చర్మం పొడిబారి దురదగా అనిపిస్తుంటుంది. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే... మాయిశ్చరైజింగ్ క్రీములు, మేకప్ ఉత్పత్తులలో ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉంటుంది. అందుకని చలికాలం సౌందర్య ఉత్పత్తులను ఎక్కువ వాడకపోవడమే మంచిది.తేనె, రోజ్ వాటర్ సమపాళ్లలో కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మానికి మేలైన ప్యాక్. చర్మం చక్కగా శుభ్రపడుతుంది. మృదువుగా అవుతుంది.సహజసిద్ధమైన వెన్న, నూనె, గ్లిజరిన్‌లను చలికాలంలో మాయిశ్చరైజర్లుగా ఉపయోగించడం మంచిది.
గుడ్డు పచ్చ సొనలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పాల పొడి కలిపి ముఖానికి చేతులకు పట్టించాలి. మృదువుగా మర్దనా చేసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. కలబంద (అలొవెరా) రసం శరీరానికి పట్టించి, అరగంట తర్వాత స్నానం చేయాలి. సౌందర్య ఉత్పాదనల వల్ల చర్మానికి అప్పటి వరకు ఏదైనా హాని కలిగినా దాని నుంచి కలబందరసం ఉపశమనం కలిగిస్తుంది.విటమిన్-ఎ, ఇ ఉన్న పప్పుధాన్యాలు, ఆకుకూరలు, చేపలను ఆహారంగా తీసుకోవాలి. రోజులో 10 గ్లాసుల నీళ్లు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చర్మం మృదుత్వం కోల్పోదు.