క్యూట్ కేర్...
బ్యూటిప్స్
పెదాల చుట్టూ చర్మం నల్లగా మారుతుంది చాలామందికి. అది వేడి వల్ల కానీ, విటమిన్స్ లోపం వల్ల కానీ అయ్యుండొచ్చు. అలాంటి వారు తమ పెదాలు పూర్తిగా ఎరుపురంగులోకి రావడానికి రోజూ స్నానానికి వెళ్లే ముందు వాటిపై టూత్‌పేస్ట్ అప్లై చేయండి. అది ఆరాక మెల్లిగా మర్దన చేసుకుంటూ పెదాలను కడుక్కోవాలి. కొంచెం సమయం తీసుకున్నా సరే ఈ చిట్కా తప్పకుండా మంచి ఫలితాన్నిస్తుంది.
అర్జెంట్‌గా పార్టీకి వెళ్లాలి. కానీ ముఖం మాత్రం జిడ్డుగా, కాంతిహీనంగా ఉందని చింతించకండి. పార్టీకి వెళ్లే రెండు గంటల ముందు ముఖానికి నేరేడుపళ్ల ఫేస్‌ప్యాక్ వేసుకోండి. దానికి కావాల్సినవి 4-5 నేరేడుపళ్లు మాత్రమే. నేరేడుపళ్ల గుజ్జులో కాస్త శనగ పిండి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఓ 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ఫేస్‌వాష్ చేసుకుంటే సరి. అందులోని విటమిన్-సి, మినరల్స్ కారణంగా చర్మం ఆరోగ్యంతో నిగనిగలాడుతుంది.
ముఖం తెల్లగా ఉండి అక్కడక్కడా నల్ల మచ్చలు ఉండటం వల్ల తాము అందంగా లేమని బాధపడుతుంటారు యువతులు. అలాంటి వారు ఈ ఇంటి చిట్కాను పాటించి చూడండి. రాత్రి పడుకునే ముందు ఉల్లిరసంలో దూదిని ముంచి నల్లమచ్చలపై అద్దండి. అలా రోజూ చేస్తే మచ్చలు తగ్గుముఖం పడతాయి.