
కొంచెం నునుపు... కొంచెం మెరుపు...
బ్యూటిప్స్
ముడతలు, మచ్చలు ముఖవర్చస్సును దెబ్బతీస్తాయి. ఫలితంగా ముఖం జీవం లేనట్టుగా కనిపిస్తుంది. ఈ ప్యాక్స్ చర్మానికి సహజమైన మెరుపు ఇవ్వడంతో పాటు నునుపుదనాన్ని తీసుకువస్తాయి.
రెండు టీ స్పూన్ల క్యారెట్ తురుము, టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ జత చేర్చి ముఖానికి పట్టించాలి. మృదువుగా రబ్ చేసి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి జీవకాంతి లభిస్తుంది.
మూడు టీ స్పూన్ల దోసరసం, రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది.
టీ స్పూన్ గోధుమపిండిలో పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించి స్క్రబ్ చేయాలి. పాలు చర్మానికి బాగా ఇంకాయనిపించాక చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం కోల్పోయిన చర్మానికి ఈ ప్యాక్ వల్ల మంచి కాంతి లభిస్తుంది.