
కమిలిన ముఖకమలానికి...
బ్యూటిప్స్
ఎండలో తిరిగితే చర్మం కమిలిపోవడం, పొడిబారి పోవడం లాంటివి జరుగుతుంటాయి. వాటి నుంచి ఉపశమనం పొందాలంటే జొన్నపిండి ఫేస్‌ప్యాక్ వేసుకుంటే సరి. ఒక టేబుల్ స్పూన్ జొన్నపిండిలో తగినంత పెరుగు, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకొని ఫేస్‌కు ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత పచ్చి పాలతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కళ్లు అలసిపోతుంటాయి. అందుకు రోజు రాత్రి పడుకునే ముందు ఉసిరిపొడిని నీళ్లలో నానబెట్టండి. ఉదయాన్నే లేచాక ఆ నీటితో కళ్లను కడుక్కోవాలి. ఇలా వారంపాటు ప్రతిరోజు చేసి చూడండి తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుంది.
మొటిమలతో బాధపడేవారు గోధుమ, వరి, శనగ, పెసర మొదలైన రకరకాల పిండిని ఒక్కో టీస్పూన్ చొప్పున తీసుకొని అందులో కొన్ని పాలు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమంతో రోజూ రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇలా ఒక వారంపాటు క్రమం తప్పకుండా చేసి చూడండి.