మృదువుగా... కాంతిమంతంగా...
బ్యూటిప్స్
చలికాలం చర్మంతో పాటు కురులూ పొడిబారి నిస్తేజంగా మారుతాయి. ఇంట్లోనే తీసుకునే కొన్ని జాగ్రత్తల వల్ల చర్మం మృదుత్వం కోల్పోకుండా, శిరోజాలు నిగనిగలాడేలా చేయవచ్చు.
కోడిగుడ్డు
అరటిపండు గుజ్జులో కోడిగుడ్డు పచ్చ సొన కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 10-30 నిమిషాలు వదిలేయాలి. తర్వాత జుట్టును శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం జుట్టుకు మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. మాడు పొడిబారకుండా చేస్తుంది.
తేనె
టేబుల్ స్పూన్ ముడి తేనెను కొద్దిగా వేడి (చర్మం తట్టుకునేంత) చేయాలి. వేళ్లతో ఈ తేనె అద్దుకుంటూ ముఖమంతా రాసి 5-10 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. పొడి బారిన చర్మానికి ఇది మేలైన ప్యాక్.
ఆలివ్ ఆయిల్
రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌లో టేబుల్ స్పూన్ ఉప్పు(సీ సాల్ట్)ను కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టిస్తూ, కాస్త ఒత్తిడి కలిగిస్తూ రుద్దాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడిన బాడీ స్క్రబ్.
గ్లిజరిన్
రోజూ రాత్రి పూట గ్లిజరిన్‌లో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పాదాలకు రాయాలి. మరుసటి రోజు ఉదయం పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. రోజూ రాత్రి పూట ఈ విధంగా చేస్తూ ఉంటే పాదాల పగుళ్ల సమస్య ఉండదు.