ముడతలను దూరం చేద్దాం
బ్యూటిప్స్
పొడిచర్మం త్వరగా ముడతలు పడుతుంది. కాబట్టి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి ఆముదం కాని కొబ్బరి నూనె కాని రాసి ఉదయం వరకు అలాగే ఉంచాలి. కొబ్బరి నూనె ముఖమంతా రాయవచ్చు. ఆముదం అయితే కళ్ల చుట్టూ మినహాయించాలి. కొంతమందికి కళ్ల దగ్గర ఆముదం రాస్తే ఇరిటేషన్ కలుగుతుంది. కీరదోస ముక్కను తీసుకుని అందులో ఒక కోడిగుడ్డు సొన, టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ గంజి వేసి మిక్సీలో బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల ముడతలను నివారించవచ్చు. నలభై దాటినప్పటి నుంచి వారానికి కనీసం రెండు సార్లు ఈ ట్రీట్‌మెంట్ చేస్తుంటే వార్ధక్యలక్షణాలు దరిచేరవు. వేసవిలో ఈ ప్యాక్ వేయడం వల్ల చర్మానికి చక్కటి సాంత్వన కలుగుతుంది.
నార్మల్ స్కిన్ అయితే ఒక టీ స్పూన్ తేనె ముఖానికి రాసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది, ముడతలు రావు. జిడ్డు చర్మానికి కోడిగుడ్డులోని తెల్లసొన రాసి ఆరిన తర్వాత కడగాలి. ఇలా వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు చేస్తుంటే వయసు మీద పడుతున్నప్పటికీ చర్మం ఆ లక్షణాలను సంతరించుకోదు. కీరదోస కాయ తొక్కను, కమలాపండు తొక్కను మెత్తగా పేస్టు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఇది ఏ తరహా చర్మానికైనా వేయగలిగిన ప్యాక్.