
విశ్వాసి శక్తికి మూలం... దేవుడే!
దైవప్రజలైన ఇశ్రాయేలీయులకు వారి బద్ధ శత్రువులైన ఫిలిష్తీయులకు ఒకసారి యుద్ధం జరుగుతోంది. గొల్యాతు అనే ఫిలిష్తీయుని దేహదారుఢ్యం, పెడబొబ్బలకు జడిసి ఇశ్రాయేలీయుల్లో ఎవరూ అతన్నెదుర్కోవడానికి సాహసించడం లేదు. అయితే చాలా చిన్నవాడు, బలహీనుడు, యుద్ధ విద్యలేవీలేని గొర్రెల కాపరియైన దావీదు, తనతో దేవుడున్నాడన్న విశ్వాసం, విశ్వాసియైన తన ముందు సున్నతి లేని అల్పుడైన గొల్యాతు ఎంత? అన్న రోషంతో కేవలం తన వడిశెలతో చిన్న రాయితో అతన్ని పడగొట్టి చంపి గొప్ప విజయం సాధించిపెట్టాడు (1 సమూ 17:17-54).
విశ్వాసానికి మరోపేరు రోషం. విజయసాధనలో ఆయుధాలు, సామర్థ్యం కన్నా మన దృక్పథమే కీలకం. ‘నేను గొప్పవాణ్ణి’ అని కాగ ‘నా దేవుడెంతో గొప్పవాడు’ అన్న దృక్పథం గలవాడే విజయుడవుతాడు. బల్బు వెలగడానికి మూలం అదృశ్యంగా ఉండే విద్యుచ్ఛక్తితో ఉన్నట్టే, విశ్వాసి శక్తికి మూలం, ప్రాప్తిస్థానం దేవుడే! దేవుడు తన తెలివిని, సామర్థ్యాన్నంతా మనిషిలో నిగూఢపర్చాడు. వాటితో అతడు తన జీవితాన్ని, చుట్టూ ఉన్న లోకాన్ని పరలోకానందమయం చేసుకోవాలని సంకల్పించాడు.
కాళ్లు, చేతులు లేనివారిని వికలాంగులంటారు. కాని తాను దేవుని వాడనని, దేవుని రూపమే కాదు, శక్తి కూడా తనదేనన్న గ్రహింపు లేక జీవితాన్ని నిరర్థకం చేసుకునేవాడే నిజమైన వికలాంగుడు. మన పిడికిట్లో వెయ్యేళ్లున్నా, మొలకెత్తని విత్తనం, నేలలోపడ్డ మరుక్షణం మరో సృష్టి రూపమవుతుంటుంది. అది మొలకెత్తి మహావృక్షమై, ఫలదాతయై మానవాళి కల్యాణానికి కారకమవుతోంది.
మనిషి ప్రజ్ఞకు, సామర్థ్యానికి దేవుని కృప అనే నేల, పరిశుద్ధాత్ముని సహవాసం అనే తేమతోనే సృజనాత్మక శక్తి రూపం వస్తుంది. ఇక్కడకొక విషయం గుర్తుంచుకోవాలి. తనకేది ఉత్తమమైనదో మనిషికి తెలయదు. ఉత్తమమైనది తప్ప మనిషికి మరొకటివ్వడం దేవునికిష్టం ఉండదు. మనకు ఆశీర్వాదాలు రావడంలో ఆలస్యానికి ఈ వైరుధ్యమే కారణం. అందువల్ల దైనందిన జీవన స్థితిగతులు, పరిణామాలను పరలోకపు దృష్టితో చూడగలిగితే విశ్వాసి జీవితమంతా విజయపథమే. దేవుని నిర్ణయాల్లో పొరపాట్లు ఉండవు.
ఆయన శక్తిని, పద్ధతులను మనం అర్థం చేసుకోవడంలోనే పొరపాట్లుంటాయి. అంతటి తన సర్వజ్ఞత, అసమాన శక్తి మానవునికి అర్థమై అందుబాటులో ఉండేందుకే దేవుడు దాన్నంతా తన కుమారుడైన యేసుక్రీస్తులో నింపి మానవరూపంలో ఈ లోకానికి పంపాడు. యుగయుగాల మానవుని ఒంటరితనానికి, సందేహాలకు, ప్రశ్నలకు దేవుడు జవాబివ్వడం కాదు, దేవుడే జవాబై యేసుక్రీస్తుగా ఈ లోక సందర్శనకు వచ్చాడు. అదే క్రిస్మస్!!
- రెవ.టి.ఎ.ప్రభుకిరణ్