మంచి భార్య దొరికినవాడే అదృష్టవంతుడు...
బెటర్‌హాఫ్
ఈ ప్రపంచంలో అదృష్టవంతుడైన మగాడు ఎవడు? ఇంకెవడు... మంచి భార్య దొరికినవాడే. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ విషయంలో చాలా అదృష్టవంతుడిలానే కనిపిస్తున్నాడు. తన భార్య ట్వింకిల్ ఖన్నా (రాజేష్ ఖన్నా, డింపుల్‌ల కుమార్తె) తన జీవితానికి ఎంతో చేసిందని అంటున్నాడు. ఏమంటాడంటే...
జీవితంలో చాలా కష్టాలు పడ్డాను. ఇబ్బందులు అనుభవించాను. ఢిల్లీ చాందినీ చౌక్‌లో సాధారణ సగటు జీవితాన్ని చవి చూశాను. చదువు వంటబట్టలేదు. ముంబైలో కాలేజ్ డ్రాపవుట్‌ని. మార్షల్ ఆర్ట్స్ టీచర్‌గా పని చేశాను. థాయ్‌లాండ్ వెళ్లి బ్యాంకాక్‌లో షెఫ్‌గా పని చేశాను. ముంబై తిరిగి వచ్చి కొంతకాలం గ్రూప్ డాన్సర్‌గా నటించాను. చివరకు హీరో అయ్యాను. మార్షల్ ఆర్ట్స్ నన్ను ఒక అర్థంలో మగాణ్ణి చేశాయి. కాని ట్వింకిల్ నన్ను ఇంకో అర్థంలో మగాణ్ణి చేసింది. నిజమైన మగాడు భార్యకు పిల్లలకు కుటుంబానికి అంకితమవుతాడు. వృత్తి పట్ల నిబద్ధత లక్ష్యం పట్ల ఏకాగ్రత ఇవన్నీ ఏర్పడాలంటే భార్య సహకారం అవసరం. ట్వింకిల్ అలాంటి భార్య.
పెళ్లికి ముందు అల్లరి చిల్లరిగా తిరడం అందరూ చేసేదే. నాకు ప్లేబాయ్ ఇమేజ్ ఉంది. అది మంచిదో చెడ్డతో కూడా తెలియకుండా కొన్నాళ్లు ఆ ఇమేజ్‌ను క్యారీ చేశాను. కాని ట్వింకిల్ చాలా త్వరగా ఆ అలంకారాన్ని తీసి పారేసింది. నను కడిగిన పలకలా చేయగలిగింది. పెళ్లి తర్వాత ఏ మగాడైనా భర్తగా తండ్రిగానే ఎక్కువ సంతృప్తి పొందుతాడు. థాయ్‌లాండ్ నాకు ఏమి నేర్పించినా నేర్పించకపోయినా ఆ దేశపు రుచికరమైన వంటకం గ్రీన్ చికెన్ కర్రీని వండటం మాత్రం నేర్పించింది. అది చేసిన ప్రతిసారీ నా భార్య మనసును గెలుచుకుంటూనే ఉంటాను.