
భార్యాభర్తల మధ్య ‘స్పేస్’ అవసరమా?
‘ఎడం’ ఉంటే బంధం బలపడుతుందా?
భార్యాభర్తల మధ్య ‘స్పేస్’ అవసరమా?
పెళ్లిపుస్తకం తెరవనంతసేపూ అంతా గుట్టే.
దాచిపెడితే డిఫరెన్సెస్ మాయం అయిపోతాయా?
ఓపెన్ చేస్తే టైమ్‌బాంబులా తయారవుతాయా?
ఇద్దరి భావాల భాషలు వేరైనా, ఈ పుస్తకం తెరిచి ఉంటే...
సంభాషణ మొదలవుతుంది. సంభాషణ ఉంటే, మాటలు ఉంటాయి.
మాటలుంటే, అపార్థాల చీకట్లు తొలగుతాయి. పరిష్కారాలు దొరుకుతాయి.
కొత్త దాంపత్యాలలో కొత్తగా డిస్కస్ చేస్తున్న విషయం... ‘స్పేస్’.
భార్యకీ భర్తకీ మధ్య ‘ఎడం’ ఉంటే బంధం బలంగా ఉంటుందట!
‘ఎడం’ లేకుంటే బాగుంటుందనుకునే వారికిది ‘కల్చరల్ షాక్’.
ఏం చేస్తాం..? ఈ కొత్త ట్రెండ్ సూపర్‌ఫాస్ట్ ట్రెయిన్‌లాంటిది.
టైమ్‌కి క్యాచ్ చేయకపోతే, జీవితకాలం లేటైపోతాం.
అందుకే, అందరికీ పనికొచ్చేలా కొందరి భావాలూ...
ఇంకొందరి సూచనలూ జతకూర్చాం.
మీకు పనికొచ్చేవి ఏరుకుని, మీ పెళ్లిపుస్తకాన్ని ఇంకా అందమైన...
ఆల్బమ్‌గా మార్చుకుంటారని ఆశిస్తున్నాం.
ఆధునిక కాలంలో ఆలుమగల బంధాలు మరీ సంక్లిష్టమైపోతున్నాయి. చాలా జంటల మధ్య చేరువలోనే దూరాలు పెరిగిపోతున్నాయి. ఒకే పైకప్పు కింద నివసిస్తున్నా, ఎవరి ‘స్పేస్’ వారికి కావాలని ఆరాటపడే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎవరి ‘స్పేస్’ వారిదైనప్పుడు ఇక పెళ్లెందుకని ప్రశ్నించే వారూ లేకపోలేదు.
పరస్పర గౌరవం, నమ్మకం, అనురాగం ఉన్నప్పుడు అసలు ‘స్పేస్’ వంటి విషయాలేవీ భార్యాభర్తల మధ్య సమస్యలు సృష్టించేంత అంశాలు కావని సంసార సాగరంలో తలపండిన అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఆధునిక జీవనంలోని సంక్లిష్టతలను ఆకళింపు చేసుకున్న మానసిక నిపుణులు మాత్రం ‘స్పేస్’కు అర్థం తెలుసుకోవాలని, జీవిత భాగస్వామి చెప్పేదానికి విలువ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాంపత్య బంధంలో ఉన్న కొంతమంది మహిళలను పలకరిస్తే, వారి మనోగతాలను వెల్లడించారు. అవి వారి మాటల్లోనే...
భరించలేకపోతున్నాను
మా పెళ్లై ఏడాది పూర్తికావొస్తోంది. సాయంకాలమైందంటే నేరుగా ఇంటికే వచ్చే మా వారు ఈ మధ్య ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయం ఉంటున్నారు. ఈవెనింగ్ ఈ మధ్య తను ఒక్కడే బయటకువెళుతున్నాడు. అదేమని అడిగితే, ఫ్రెండ్స్ అనీ, పనులనీ చెబుతున్నాడు. మా మధ్య మంచి రిలేషన్‌షిప్ ఉంది. ఎక్కడా లోపం, అనుమానం లేదు. కానీ, ఇంట్లో ఒక్కదాన్నే ఉండిపోవాల్సి వస్తోంది. పెళ్లంటే నా దృష్టిలో ఉన్న భావన ఈ మధ్య చెదిరిపోతున్నట్టుగా ఉంది. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. ఎప్పుడైనా ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లు అని మా వారు చెబుతున్నారు. మా ఫ్రెండ్స్ కూడా ‘ఎంత భార్యాభర్తలు అయినా ఎవరి స్పేస్ వారికుండాల’ని చెబుతున్నారు. నమ్మకం లేక కాదు.. కానీ, అలా ఎవరి లోకం వారిదే అన్నట్టుగా ఉండటం అంటే ఇక పెళ్లి ఎందుకు? ఒకే ఇంటికప్పున ఉండటమెందుకు చెప్పండి.
- వసు, గృహిణి
పరిధులు దాటితే అంతే!
ఎవరి స్పేస్ వారికి ఉండాలనే ఉద్దేశ్యంతో పరిమితిని మించి స్పేస్ తీసుకున్నాను. అదే నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. మా వారు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగి. మాకు పెళ్లై ఎనిమిదేళ్లు. పిల్లలను చూసుకోవడం కుదరడంలేదని జాబ్ మానేశాను. పార్ట్‌టైమ్‌గా ఇంటి నుండే జాబ్ చేసేదాన్ని. కొన్నాళ్లకు ఇంట్లో ఒకదాని తర్వాత ఒక పని.. ఊపిరి తీసుకోవడమే మర్చిపోతున్నాను అనిపించేది. ‘నా కోసం కాస్తంత టైం మిగుల్చుకోవాలి. నాదైన ప్రపంచంలో గడపాలి’ అనుకునేదాన్ని. పగలంతా పనులు ఎలాగూ ఉంటాయి.. అందుకే రాత్రిళ్లు స్నేహితులతో చాటింగ్‌లు, కబుర్లు ఎంచుకునేదాన్ని. నా భర్త ఒకట్రెండు సార్లు వారించాడు. చదువుకున్నవాడివి, నా స్పేస్ నాకు ఇవ్వాలని తెలియదా! ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నానో.. ఎందుకు చేస్తున్నానో.. అన్నీ చెప్పి తీరాలా? అని నిలదీశాను. చాలా ఆలస్యంగా నేను తెలుసుకుందేమిటంటే.. నా స్పేస్ నాకు కావాలని ఆయన ఆప్యాయతకు దూరమయ్యానని. మా మధ్య స్పేస్ కొద్ది కొద్దిగా పెరుగుతూ ఆరు నెలలు ఎడం అయ్యింది. ఏ స్పేస్ కావాలనుకున్నానో ఆ స్పేస్ వల్లే మా వైవాహిక బంధం అభద్రతలో పడిపోయింది. ఓ రోజు నా హృదయం ముక్కలయ్యే పదాలు ఆయన నోటి నుంచి విన్నాను. ‘నాకూ ఏకాంతం చాలా అవసరం.. నీ నుంచి ఆ ఏకాంతం పూర్తిగా కావాలి. ఆర్నెల్లుగా నీ లోకంగా నువ్వు, నా లోకంగా నేను... మన మధ్య మిగిలింది శూన్యం. అందుకే నాదో సలహా! మనం విడాకులు తీసుకుందాం’ అన్నాడు. సమాధానం చెప్పలేకపోయాను. ఈ శూన్యాన్ని ఎలా పూడ్చాలో తెలియడం లేదు.
- కల్యాణి, ఉద్యోగిని
అస్సలు ఒప్పుకోను
మా వారు రోజూ ఉదయం రెండు గంటలు జిమ్‌లో గడుపుతారు. ఆ తర్వాత ఆఫీస్‌కెళ్లే తొందర.. ఇంటి పనులు, పిల్లల పనులు పూర్తి అయ్యేసరికి నాకు రాత్రి 10 దాటుతుంది. ఆఫీసు నుంచి వచ్చిన ఈయన భోజనం చేసి ల్యాప్‌ట్యాప్ ముందేసుకుంటారు. లేదంటే టీవీ చూస్తూ కూర్చుంటారు. అప్పటికే నేను నిద్రలోకి జారుకుంటాను. ఈయనకు ఇంకెంత స్పేస్ కావాలి?! పిల్లల పనులు, ఇంటి పనులు, వంట పనులు, క్లీనింగ్‌తో రోజంతా అలసిపోయి ఉంటాను. నాతో కాసేపు కబుర్లు చెప్పడానికేమైంది? చాటింగ్‌లో ఫ్రెండ్స్‌తో కబుర్లు, టీవీలో ఆ రొద చూడటానికి నాతో మాట్లాడటానికి తేడా ఉండదా?
- శేషసాయి, గృహిణి
స్పేస్ అవసరం
మాకు పెళ్లై రెండేళ్లయ్యింది. మా మధ్య ఎలాంటి రహస్యాలు లేవు. ఏ చిన్న విషయమైనా ఇద్దరం షేర్ చేసుకుంటాం. ఫ్రెండ్స్‌లా ఉంటాం. ఆయనకు మ్యూజిక్ అంటే ఇష్టం. మ్యూజిక్‌కి సంబంధించిన సీడీలు, మ్యూజిక్ సిస్టమ్ అన్నీ ఒక సెటప్ చేసుకున్నారు. నేను వాటి జోలికి వెళ్లను. ఆ సంగీత ప్రపంచంలోకి నన్ను రమ్మని ఆయనా బలవంతం చేయరు. నాకు పెయింటింగ్స్ ఇష్టం. నేనూ పెయింటింగ్ గొప్పతనం గురించి, నేర్చుకుంటే కలిగే లాభాల గురించి చెప్పను. ఎంత ఆలూమగలైనా ఎవరి ఇష్టాయిష్టాలు వారికుంటాయి. వాటిని డిస్టర్బ్ చేయడం ఇద్దరికీ మంచిది కాదు. నమ్మకం ఉండాలి. ఇద్దరికీ విడి విడిగా కొంత స్పేస్ తప్పక ఉండాలి.
- వినీల, చిత్రకారిణి
నమ్మకం ముఖ్యం
మా పెళ్లై 47 ఏళ్లు దాటింది. మాది వ్యవసాయ కుటుంబం. నా కింత సమయం కావాలి అని ఏనాడూ అనిపించలేదు. నాకు తెలిసిందల్లా పెందరలాడే లేచి పనులు చేసుకోవడం. పొలం నుంచి వచ్చిన మా ఆయనకి వేళకు భోజనం పెట్టడం. మా పిల్లలు ముగ్గురు, తోడికోడళ్ల పిల్లలు ఐదుగురు... ఎప్పుడూ సందడిగా ఉండేది ఇల్లంతా. పొద్దున్న వంట పనులు మొదలుపెడితే ముగించే మధ్యాహ్నం. కాస్త తినగానే, మళ్లీ రాత్రి భోజనాలకు పనులు మొదలయ్యేవి. ఇలా ఆలూమగల మధ్య కొంత ఖాళీ ఉండాలి అనే ఆలోచన మా అప్పుడు లేదు.
- కమలమ్మ, గృహిణి
ఎంతటివారికైనా వ్యక్తిగత స్పేస్ అవసరమే. అయితే, స్నేహపూర్వకమైన సంభాషణలతో సుదీర్ఘ స్పేస్‌కి చెల్లుచీటి రాయండి. పెళ్లిపుస్తకంలోని ప్రతిపేజీని అందంగా రాసుకోండి.
ఇవి తెలుసుకోండి...
1. హెచ్చరికలు గుర్తించండి
నాకు మాత్రమే సొంతం అనే భావన, అస్తమానూ అంటిపెట్టుకొని ఉండటం, ఈర్ష్య.. ఇవి బంధంలో ఉంటే భాగస్వామిని ఊపిరి తీసుకొనివ్వవు. చేసే పనిలోనూ వృద్ధి ఉండదు. ఎప్పుడెప్పుడు ఆ బంధం నుంచి బయటపడదామా! అనిపించే ప్రమాదమూ ఉంది.
2. పరస్పరం ఆధారపడటం
సరదాగా గడపాలే కానీ, బంధాలను సరదాగా తీసుకోకూడదు. ముఖ్యంగా వివాహబంధం పరిపూర్ణత సాధించాలంటే తగినంత నిబద్ధత అవసరం. ఎదుటివారిని అర్థం చేసుకుంటూ దానికనుగుణంగా తమ నడవడికలో మార్పులు చేసుకోవాలి.
3. సంభాషణ ఉండాలి
రోజులో ఒక్కసారైనా కాఫీ/టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటే చాలు, స్నేహపూర్వకమైన ఆ వాతావరణంలో ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. ఒకరి ఇష్టాలు మరొకరికి తెలిసిపోతాయి. స్నేహితుల మధ్య ఉండే బంధం దంపతుల మధ్య ఉంటే స్పేస్ కావాలనే గొడవే ఉండదు.
4. స్పేస్‌కి అర్థం తెలియాలి...
భాగస్వామి అంటే భయం, బరువు, ఇంకా అర్థం చేసుకోలేకపోవడం.. వంటివి ఉంటే తప్పకుండా కొంత స్పేస్ తీసుకోవాలి. అయితే, అది ఎలాంటి స్పేసో కచ్చితంగా తెలుసుండాలి. లీజర్ టైమ్ కావాలా? పని నుంచి కొంత స్పేస్ కావాలా? భావోద్వేగాలను అదుపు చేసుకునేందుకు స్పేస్ కావాలా? ఆర్థికపరమైన స్పేస్ కావాలా? ఏ తరహాకు చెందిన స్పేస్ కావాలో నిర్ధారించుకొని అది భాగస్వామికి చెప్పగలగాలి.
5. వివరణ అవసరం...
చాలామంది దంపతులు తమ భాగస్వామి అవసరాలేంటో గుర్తించకపోవడం వల్లే అపార్థాల బాటను ఎంచుకుంటారు. భాగస్వామికి మీ ఆడ-మగ స్నేహితుల గురించి కూడా తెలిసుండాలి. మీరు కోరుకునే స్పేస్ మీ భాగస్వామికి అనుమానాలను రేకెత్తించకూడదు. నిజాయితీతో కూడిన వివరణ ఇద్దరికీ అవసరం.
అర్థం చేసుకోవాలి
భార్యాభర్తల మధ్యనే కాదు, ప్రతి రిలేషన్‌లోనూ వ్యక్తిగత స్పేస్ తప్పక ఉండాలి. లేదంటే కిటికీ లేని జైలులా ఉంటుంది. అదీకాదంటే, ఇది మా జీవితం కాదు అనిపిస్తుంది. దీని వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఒంటరిగా ఆలోచించుకోవడానికి, తమ హాబీస్‌ను పెంపొందించుకోవడానికి స్పేస్ ఎవరికైనా తప్పనిసరి. అలాగని ఆ స్పేస్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. పెరిగిన పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం, పనులను బట్టి ఎవరికి ఎంత స్పేస్ కావాలో వారే నిర్ణయించుకుంటారు. దానిని భాగస్వామి అర్థం చేసుకుంటే స్పేస్ ఓ సమస్య కాదు.
- డా.శేఖర్‌రెడ్డి, సైకియాట్రిస్ట్
బలపరుచుకోవాలి
ఇటుకకు ఇటుకకు మధ్య కొంత స్పేస్ ఉంటుంది. సిమెంట్ అనే బంధంతో ఆ స్పేస్‌ను పూడుస్తాం. భార్యాభర్తల బంధం కూడా అంతే. నమ్మకం, గౌరవం, సాయపడటం, ప్రేమ, ఆప్యాయత.. అన్నీ ఇద్దరమధ్యా సిమెంట్‌లా ఉంటే ఆ బంధం పదికాలాలు ఆనందంగా ఉంటుంది.
- సి. వాణీమూర్తి, ఫ్యామిలీ కౌన్సెలర్