
శక్తి కోసం, కండలు పెంచుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రొటీన్ పౌడర్లు వాడుతున్నారు. కండపుష్టి కోసం సహజసిద్ధమైన ఆహారపదార్థాలే మేలైనవని, ప్రొటీన్ పౌడర్లు సహజమైన ఆహార పదార్థాలకు ప్రత్యామ్నాయం కాలేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, వివిధ బ్రాండ్ల పేర్లతో ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ప్రొటీన్ పౌడర్లలో సీసం, ఆర్సెనిక్, కాడ్మియం వంటి ప్రమాదకరమైన భార లోహాలు ఉంటున్నాయని హెచ్చరిస్తున్నారు.
ప్రొటీన్ పౌడర్లు వాడటం వల్ల కండపుష్టి సమకూరడం సంగతి అలా ఉంచితే, వాటిలో మోతాదుకు మించి ఉంటున్న భార లోహాల వల్ల తలెత్తే దుష్పరిణామాలు దీర్ఘకాలంలో చాలా తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. ప్రొటీన్ పౌడర్లలో సీసం, ఆర్సెనిక్ వంటి భార లోహాలతో పాటు పురుగుమందులు తదితర 130 రకాల ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నట్లు అమెరికాలోని ‘క్లీన్ లేబుల్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన పరీక్షల్లో తేలింది.