తాటాకుతో చేసిన వింజామరల అంచులను రంగురంగుల వస్త్రాలతో అలంకరించి, మీద కొద్దిగా గంధపు నీళ్లు చిలకరించి విసురుకుంటుంటే, చల్లటి తుషారాలు శరీరాన్ని తాకుతుంటే, ‘ఏమి హాయిలే హలా’ అని పాడుకుంటూ ఎండను ఎంజాయ్ చెయ్యలేమా?! ఫ్యాను, కరెంటు ఉన్నా కూడా ఇదొక కూల్ ఐడియా!
అమ్మ బాబోయ్ ఏం ఎండలో.. భరించలేకుండా ఉన్నాం. సూర్యుడే దిగి వచ్చి అందరినీ సంబరంగా ఆశీర్వదిస్తున్నాడేమో అన్నట్లుగా ఉన్నాయి! తట్టుకోవాలి తప్పదు. అప్పుడేగా ఏ ఋతువునైనా మనం గౌరవించినట్లు. మూడు నెలల పాటు అతిథిగా వచ్చిన ప్రచండ భాస్కరుడినీ అలాగే గౌరవించాలి. అందుకు బదులు... ‘అష్’ ‘ఉష్’ అంటూ వేడి వేడి నిట్టూర్పులు నిట్టూరిస్తే ఎలాగ! ఆయన పని ఆయన సక్రమంగా చేయడమూ తప్పేనా? అసలు సూర్యుడు వేడిగా ఉండకపోతే ఆషాఢంలో వానలు పడవు. పైరులు కళకళలాడకుండా వెలతెలపోతాయి. ఆయన వేడివేడిగా వచ్చి, నీళ్లన్నీ పీల్చేస్తేనే కదా మేఘం వర్షించగలిగేది. ఆ విషయం మర్చిపోయి ‘ఎండలు బాబోయ్ ఎండలు’ అంటూ ఎండాకాలమంతా ఆ ప్రత్యక్ష నారాయణుడిని నిందిస్తూంటే ఎలాగ. ఆయనకే కనక కోపం వచ్చి, చిన్నబుచ్చుకున్నాడనుకోండి.. మన పరిస్థితి ఏంటి? వానలు పడవు, పంటలు పండవు.
సరే ఇదంతా ప్రకృతికి సంబంధించిన విషయం. కరెంటు లేని రోజుల్లో వేసవిలో దొంగలకు సౌకర్యంగా ఉండేది కాదు. తెల్లవార్లూ విసనకర్రలతో విసురుకుంటూ, నిద్రపోకుండా ఇంట్లోని పెద్దవాళ్లలో ఎవరో ఒకరు మెలకువగా ఉండటంతో చోరుడికి అనుకూలించేది కాదు. వాడు ఎన్ని కళలు ప్రదర్శిద్దామన్నా పప్పులుడికేవి కాదు. పరోక్షంగా ఎవరో ఒకరు కాపలా కాస్తూ ఉండేవారు. పాపం ఆ వచ్చినవాడికి నిరాశే మిగిలేది. వేసవిలో ఇదొక భరోసా మనకు. ఇక ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మల ప్రహసనం మరోలా ఉండేది. తాటాకుతో చేసిన వింజామరల అంచులను రంగురంగుల వస్త్రాలతో అలంకరించి, వాటి మీద కొద్దిగా గంధపు నీళ్లు చిలకరించి విసురుకుంటుంటే, చల్లటి తుషారాలు శరీరాన్ని తాకుతుంటే, ‘ఏమి హాయిలే హలా’ అని పాడుకుంటూ ఎండను ఆస్వాదించే ఉంటారు.సాయంత్రం సంబరం మరోలా ఉండేది.
ఊర్లో ఉండే పెద్ద చెరువుకి పిల్లలంతా తాబేలు పిల్లల్లా బుడి బుడి అడుగులు వేస్తూ, డాల్ఫిన్ చేపల్లా నీళ్లలోకి దూకి, సొర చేపల్లాగ ఈత కొడుతూ, రకరకాల విన్యాసాలు చేసి, శరీర తాపం చల్లారాక ఒంటి నిండా వాన ముత్యాలు నింపుకుని, ఇంటికి వచ్చేవారు. ఇంట్లో ఉండే మేనత్తలో, బాబయ్యలో.. చీకటి పడకుండా అన్నాలు తినిపించి, పిల్లల్ని పక్కనే పడుకోబెట్టుకుని, పోతన భాగవత పద్యాలు నేర్పుతూ, విసనకర్రతో చల్లగా విసురుతుంటే, ఆరుబయట చంద్రుణ్ని, నక్షత్రాలను చూస్తూ, తుంగ చాప మీద పడుకుని, ఆదమరిచి నిద్రపోయేవారు. అలా ప్రకృతికి అనుగుణంగా శరీరాన్ని అలవాటు చేసేసేవారు. ఇంతటి మహద్భాగ్యాన్ని కల్పిస్తున్న సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అని స్తుతిస్తూనే, ఎండల్తో చంపేస్తున్నాడని నిందించడం ఎంతవరకు న్యాయం? శ్రీరాముడు సూర్యవంశీయుడే కదా, అనునిత్యం ఆయనకు నమస్కరించేవాడు కదా! సూర్యభగవానుడిని దినమణి అని, పూర్వ దిక్పాలకుడు అని కూడా అంటారుగా.
అంతటి దేవుడిని ఇంతగా తెగనాడటం భావ్యమేనా? భావ్యమే లెండి. ఎందుకంటారా, ఆయన మనకు మిత్రుడు (సూర్యుడిని మిత్రుడు అని కూడా అంటారు), ఆయన దగ్గర మనకు చనువు ఉంది కదా, అందుకే అలా నిందాస్తుతి చేస్తుంటాం.ఇవన్నీ కాదు. వేసవి అంటే మామిడిపండ్లు, ద్రాక్షలు. నూజివీడు పెద్దరసాలు, చిన్న రసాలు, గోదావరి జిల్లాలలో ప్రత్యేకంగా దొరికే కొత్తపల్లి కొబ్బరి, చెరకు రసాలు, పంచదార కలశం, సువర్ణరేఖ.. ఇవేనా! ఊరు వెళితే చాలు తాటి చెట్లు ఎక్కినవాళ్లు కత్తితో తాటికాయలు కోసి ధబీధబీమని కింద పడేయడం, నీళ్లు బయటకు రాకుండా జాగ్రత్తగా కత్తితో చెదిపి ఇస్తే, ఒక్కో ముంజలోకి వేలితో చిన్న రంధ్రం చేసి స్ట్రా వంటివి లేకుండా ముంజకాయను నోట్లోకి తీసుకుని, నీళ్లు తాగేసి, గుజ్జు జాగ్రత్తగా తీసుకుని తినడం ప్రతి వేసవిలోనూ ఓ సరదా.
రసాలు తినడమైతే ఓ పెద్ద టాస్క్. ఒంటి మీద కారకుండా తినాలి. అదొక మధురమైన ఉల్లాసం. ఎర్రటి కొత్త ఆవకాయలోకి మామిడిపండు రసం నంచుకుని తింటే ‘ఆహా నా రాజా’ అని జంధ్యాల మార్కు డైలాగు గుర్తురాకుండా ఉండదు. చెప్పొచ్చేదేమంటే.. ఇంత వేడి, ఇంత ఎండ లేకపోతే ఇవన్నీ ఇంత చల్లగా ఎలా ఆస్వాదించగలం. అందుకే అష్షుబుష్షులు మాని, ఆహా ఓహో అనుకుందాం. మనమెంత నిట్టూర్చినా ఎండ వేడిగా ఉండకమానదు, వడ గాడ్పు వీచక మానదు, శరీరాలు చెమట చిందించకా తప్పదు. కనుక ఫీల్ ది కూల్ ఆఫ్ సమ్మర్.
వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment