
కాలుష్యపు తొలి ప్రభావం పడేది మొదట జుట్టు మీద... ఆ తర్వాత చర్మం మీద. ఇలా కాలుష్యపు తొలి ప్రభావం జుట్టు మీద పడటానికి కారణం తలపైన అన్నిటి కంటే మొదట ఉండేది జుట్టు కావడమే. మన చుట్టూ ఉండే వాతావరణంలో దుమ్ము, ధూళి, సస్పెండెండ్ పార్టికిల్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయి. దాంతో వాతావరణ కాలుష్యం, ఆటోమొబైల్ కాలుష్యాల జమిలి ప్రభావాల వల్ల చర్మం, జుట్టుకు చాలా నష్టం జరుగుతోంది. వాతావరణ కాలుష్యాలతో జుట్టు బలహీనపడుతుంది.
ఫలితంగా వెంట్రుక తేలిగ్గా తెగిపోవడం, వెంట్రుకకు సహజంగా ఉండే మెరుపు తగ్గిపోవడం జరుగుతుంది. దుమ్మూధూళి వల్ల జుట్టు చింపిరిగా చిక్కులు చిక్కులుగా మారడం వంటి చెడు ఫలితాలు కలగవచ్చు. దాంతో వెంట్రుకల్లో చుండ్రు, రోమం మూలాల్లో హానికరమైన బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి పెరిగేందుకు అవకాశం ఎక్కువ. ఈ అంశాలన్నీ కలగలసిన ప్రభావంతో వెంట్రుకలు తేలిగ్గా రాలడానికి అవకాశం ఉంటుంది. అందుకే కాలుష్య ప్రభావాల నుంచి వెంట్రుకలను కాపాడుకోవాలి.