
ద హంటర్ ఈజ్ నౌ.. ద హంటెడ్! వేటగాడే ఇప్పుడు వేటాడబడుతున్నాడు. గాల్లోకి లంఘించిన టైగర్ బోనులో పడింది. ఈ టైగర్‌ని నమ్ముకున్న వేలకోట్ల ఇండస్త్రీ... డోలాయమానంలో పడింది!
సల్మాన్ ఖాన్‌లో ఎప్పుడూ ఇద్దరు మనుషులు ఉంటారు. ఐశ్వర్యకు పువ్విచ్చి ఐలవ్యూ చెప్పిన సల్మాన్, ఐశ్వర్యను చాచిపెట్టి చెంపదెబ్బకొట్టిన సల్మాన్. కత్రినాను స్టార్‌గా నిలబెట్టిన సల్మాన్, కత్రినాను ఛీ కొట్టిన సల్మాన్. యాభై ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని సల్మాన్, అనాథ చెల్లికి ఆకాశమంత పందిరి వేసి పెళ్లి చేసిన సల్మాన్. ఏదో ఒక వివాదంలో జైలుకు వెళ్లొస్తుండే సల్మాన్, ఎప్పుడూ ఏదో ఒక చారిటీకి విరాళాలిస్తుండే సల్మాన్. పుట్టుకతో మనిషిలో ఈ స్పిట్ పర్సనాలిటీ ఉండదు. పరిస్థితులు స్పి›్లట్ చేస్తుంటాయి. అబ్దుల్ రషీద్ సలీమ్ సల్మాన్‌ఖాన్ ఇలా ఇప్పటికి అనేకసార్లు స్పి›్లట్ అయ్యాడు. అయితే ఇవన్నీ తనకు తనుగా తెచ్చిపెట్టుకున్నవి తప్పితే ఎవరో తెచ్చిపెట్టిన పరిస్థితులు కావు.
ఒక శిఖరం.. ఒక అగాధం
యాభై రెండేళ్ల వయసు, ముప్పై ఏళ్ల కెరీర్, వందకు పైగా సినిమాలు ఉన్న సల్మాన్ చుట్టూ అనేక వివాదాలు, విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని మాత్రమే అతడు దోషి అని గానీ, నిర్దోషి అని గానీ నిర్ధారించవలసినవి. మిగతావన్నీ అతడి అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ప్రియురాళ్లు, విరోధులు, ప్రత్యర్థులు ఎవరికివారుగా ఇస్తుండే తీర్పులు మాత్రమే. సల్మాన్ జీవితంలో ‘మైనే ప్యార్ కియా’ చిత్రం ఎంత గొప్ప శిఖరమో.. కృష్ణజింకను వేటాడ్డం అంత పెద్ద అగాధం. ఇవాళ్టికీ అతడు ఆ అగాధంలోంచి బయటికి రాలేకపోతున్నాడు. ఇరవై ఏళ్ల క్రితం ‘హమ్ సాత్ సాత్ హై’ చిత్రం షూటింగ్ విరామ సమయంలో జో«ద్‌పూర్‌లో వేటకు వెళ్లిన సల్మాన్.. ఈనాటికీ వేటాడబడుతున్న ఒక జింక! జింక చెరలో పడిలో పులి. చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి, సల్మాన్ కూడా.
వేట సరదా.. నోటి దురుసు
వేట సరదా ఒక్కటే కాదు, నోటి దురుసు కూడా అతడిని అనేకసార్లు వెంటాడి వెంటాడి వదిలిపెట్టింది. 2016లో ‘సుల్తాన్’ సినిమాలోని కుస్తీ సన్నివేశాల్లో తనెంత కష్టపడిందీ ప్రెస్‌మీట్ చెబుతూ.. ‘రేప్’ జరిగాక ఎలా ఉంటుందో అలా.. నా ఒళ్లు హూనం అయింది’ అన్నాడు సల్మాన్. దేÔ¶ వ్యాప్తంగా మహిళలు భగ్గుమన్నారు. తర్వాత క్షమాపణ చెప్పాడు కానీ, అనాలోచితంగా అన్న మాట వల్ల రేగిన జ్వాలను ఎన్ని వేల క్షమాపణలు మాత్రం ఆర్పేయగలవు? నవంబర్ 26 ముంబై ఉగ్రదాడుల మీద 2010లో సల్మాన్ చేసిన కామెంట్ కూడా ఆయన్ని దేశద్రోహి కన్నా తక్కువ కానీ ఒక ‘హీనుడి’గా నిలబెట్టింది. ‘‘పెద్దపెద్దవాళ్లు టార్గెట్‌గా ఉన్నారు కాబట్టి ఈ పేలుళ్ల గురించి రాద్ధాంతం చేస్తున్నారు కానీ, నిజానికి అంతలేదు’’ అని ఒక పాకిస్తానీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ అన్నాడు. ఈసారి దేశం మొత్తం భగ్గుమంది. ‘‘ఇందులో పాకిస్తాన్ తప్పేమీ లేదు. ఇండియా చేతగాని తనం ఉంది’’ అని కూడా అదే ఇంటర్వ్యూలో సల్మాన్ అన్నాడు. ఈ రెండు కామెంట్‌లపై అప్పట్లో దుమారం రేగింది. ‘ఈ దేశద్రోహిని ఉరి తియ్యాలి’ అనే నినాదాలు వినిపించాయి. (అయితే ఇదే సల్మాన్ 2008లో దేశంలోని ముస్లింల ఆగ్రహానికి కూడా గురయ్యాడు. గణేశ్ పూజను నిర్వహించినందుకు అతడిపై ఫత్వాలు జారీ అయ్యాయి!).
మనసులో ఉన్నది అనేస్తాడు
సల్మాన్ ఎమోషనల్. తటాలున ఒక మాట అనేస్తాడు. తన అనుకున్నవాళ్ల మీద ఏదైనా మాటొచ్చి పడితే.. అంతే వైల్ట్‌గా రియాక్ట్ అవుతాడు. ఐశ్వర్య విషయంలో వివేక్ ఒబేరాయ్‌తో, కత్రిన బర్త్‌డే ఫంక్షన్‌లో షారుక్ ఖాన్‌తో సల్మాన్ గొడవపడినప్పుడు అతడి ముఖం చూడాలి. వాళ్లిద్దర్నీ మీద పడి కొట్టినంత పని చేశాడు. 2014లో ముజఫర్‌నగర్ పునరావాస శిబిరాలలో కనీస వసతులు లేక పిల్లలు చనిపోతున్నారు. ఆ టైమ్‌లో సల్మాన్‌ఖాన్, మాధురీ దీ„ì త్, ఆలియాభట్, ఇంకా కొందరు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పిలిస్తే ‘సైఫై మహోత్సవ్’కి వెళ్లారు. దానిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వెంటనే ఆలియాభట్ క్షమాపణ చెప్పారు. అయితే సల్మాన్ ఆ విమర్శలపై అంతే స్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మా పని మేం చేస్తే తప్పేంటి?’’ అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించడం పెద్ద వివాదం అయింది. మాట్లాడకుండా ఉంటే సరిపోయేది. కానీ మనసులో ఉన్నది అనేయడం సల్మాన్ నైజం. ఇవన్నీ.. సల్మాన్ మాటల వల్ల వచ్చిన ఇబ్బందులైతే.. చేతలతో అతడు తెచ్చిపెట్టుకున్న తలనొప్పులూ ఉన్నాయి.
ఆత్మను వెంటాడే అంతరాత్మ
2002లో ముంబైలోని ఓ బేకరీ సమీపంలో పేవ్‌మెంట్ మీద పడుకున్న వారి మీదుగా కారును నడిపి ఒకరి మృతికి, ముగ్గురి గాయాలకు కారణమైన ఘటనలో సల్మాన్ ఏళ్ల పాటు విలన్‌గా నిలబడవలసి వచ్చింది. ఈ కేసు 13 ఏళ్లపాటు సాగింది. కేసు నుంచి అతడు బయటపడినా, అది ఎప్పటికైనా దెయ్యంలా అతడి అంతరాత్మను నిలదీసే ఘటనే. 2013లో బిగ్‌బాస్ రియాల్టీ షోలో సల్మాన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పటికి నాలుగేళ్లుగా అతడు షో ను హోస్ట్ చేస్తున్నాడు. కంటెస్టెంట్‌లుగా బాలీవుడ్ నటులను చేరదీసి, టీవీ యాక్టర్‌లను పక్కన పెడుతున్నాడని అతడిపై ఆరోపణ. అయితే తనకలాంటి పక్షపాతాలేవీ లేవని ఉండవని ట్వీట్ చేసి ఆ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చేశాడు. సల్మాన్. తర్వాతి ఏడాది గుజరాత్‌లో కైట్ ఫెస్టివల్ జరుగుతుంటే అక్కడికెళ్లాడు. దానికి అతడిని ఆహ్వానించింది.. ముస్లింలకు వ్యతిరేకి అయిన నరేంద్ర మోదీ. అలా సల్మాన్‌ఖాన్ మోదీని కలవడంపైన కూడా వివాదం అయింది. సల్మాన్ నటించిన ‘జై హో’ చిత్రాన్ని బాయ్‌కాట్ చెయ్యాలని ప్రదర్శనలు జరిగాయి. ఏడేళ్ల క్రితం ఓ మత్స్యకారుల కుటుంబాన్ని సల్మాన్, అతడి బాడీ గార్డులు బెదిరించారని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. సముద్రం ఒడ్డున కాటేజీల ‘వ్యూ’కి అడ్డుగా ఉన్న పడవలను తొలగించాలని ఆ కుటుంబంతో సల్మాన్ గొడవకు దిగారన్నది ఆరోపణ.
ఒకవైపే చూద్దామా?!
సల్మాన్‌ని ఒక వైపు మాత్రమే చూస్తే వినిపించే విమర్శలు, కనిపించే వివాదాలు ఇవన్నీ. రెండో వైపున అతడిలో చేయూతనిచ్చే ‘మెంటర్’ ఉన్నాడు. ఆ సంగతి బాలీవుడ్‌లో ఇప్పుడు స్టార్‌లుగా వెలుగుతున్న కొంతమందికి తెలుసు. అతడిలో ఒక ధార్మికుడు ఉన్నాడు. ఛారిటీ వీరుడూ ఉన్నాడు. ఆ సంగతి అతడిచ్చిన కోట్ల రూపాయల విరాళాలతో సామాజిక సేవాకార్యక్రమాలు చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు తెలుసు. అలాగని ఈ ఛారిటీ వీరుడు.. కండల వీరుడికి గుడ్ బాయ్ అని సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. గుడ్డు గుడ్డే. బ్యాడ్ బ్యాడే. కొన్నిసార్లు మాత్రం ఉత్తిపుణ్యానికే.. లోకం మీద పడిపోతుంది. అలాంటప్పడు అతడిలోని గుడ్‌బాయే పైకి కనిపిస్తాడు. ‘భంగీ’ అనే మాటను వాడి ఎస్సీల మనోభావాలకు భంగం కలిగించాడని కొన్నేళ్ల క్రితం సల్మాన్ ఖాన్‌పై ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) కేసు వేసింది. అయితే రియాల్టీ షోలో అతడు ఉపయోగించిన ఆ ‘భంగీ’ అనే మాట ఒక ‘స్టెయిల్ ఆఫ్ డ్యాన్స్’ అని నిర్ధారణ అయ్యాక అతడు పునీతుడు అయ్యాడు.ఈ వివాదాలు, విమర్శలను పక్కన పెట్టి చూస్తే సల్మాన్ నిస్సందేహంగా ఈ దేశానికి అభిమాన పాత్రుడు. కోర్టు దోషి అనగానే దోషినైపోయానని సల్మాన్‌ఖాన్ అనుకోకపోవచ్చు. పైనింకా చాలా కోర్టులు ఉన్నాయి కదా అనీ అనుకోవచ్చు. అయితే కండలు తిరిగిన బలిష్టమైన ఆ దేహం లోపల ‘మనస్సాక్షి’ అనే కోర్టు ఒకటి ఉంటుంది. ఆ కోర్టు తీర్పును సల్మాన్ శిరసా వహించ వలసిందే.
గాలిలో వెయ్యి కోట్లు!
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘రేస్ 3’ సినిమా షూటింగ్‌ను దాదాపుగా పూర్తి చేశారు. ఈ సినిమా రంజాన్ రిలీజ్‌కు రెడీ అయింది. ఆ తర్వాత ‘దబాంగ్’ ఫ్రాంచైజ్‌లో ‘దబాంగ్ 3, మరో సినిమా భరత్’, వీటితో పాటు.. రెమో డీసౌజాతో ఓ సినిమాను అంగీకరించారు. సల్మాన్ ఖాన్ సినిమా సూపర్ హిట్ అని టాక్ వస్తే చాలు.. ఆ సినిమా కలెక్షన్ ఈజీగా 300 కోట్ల క్లబ్‌కు చేరుకుంటుంది. అలాంటిది ఈ టైమ్‌లో సల్లూ భాయ్ జైలులో ఉంటే ఒప్పుకున్న మూడు సినిమాలు కలిపి దాదాపు 900 కోట్ల బిజినెస్ ఆగిపోతుందని ట్రేడ్ టాక్. ఇదిలా ఉంటే త్వరలో ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్ 12’ టీవీ షోకి కూడా సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.‘బిగ్ బాస్ 11’ ఎపిసోడ్‌కు 10 కోట్లు తీసుకున్నారట సల్మాన్. ఈజీగా 50కి పైగానే ఎపిసోడ్స్ ఉండే ఈ షో ద్వారానే ఆయనకు ఓ 50 కోట్లు దాకా వస్తుంది. ఇవి కాకుండా యాడ్స్ కూడా చేస్తుంటారు. అంటే సల్మాన్ జైలులో ఉంటే సుమారు వెయ్యి కోట్ల బిజినెస్ ఇరకాటంలో పడుతుందని బాలీవుడ్ అంచనా.