గుండెకోత వద్దు | Breast Cancer Awareness Campaign | Sakshi
Sakshi News home page

గుండెకోత వద్దు

Published Wed, Oct 5 2016 10:45 PM | Last Updated on Mon, Aug 20 2018 8:09 PM

గుండెకోత వద్దు - Sakshi

గుండెకోత వద్దు

సాక్షి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ క్యాంపెయిన్
పింక్ అక్టోబర్ థింక్ టుడే

 
 
భారతీయ మహిళలకు వచ్చే క్యాన్సర్‌లలో మిగతా అన్నిటికంటే ఎక్కువగా కనిపించే వాటిల్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ఇటీవల చాలా ఎక్కువ మంది మహిళలు దీనికి గురవుతున్నారు. ఒకప్పుడు దాదాపు 50 ఏళ్లు పైబడితేనే రొమ్ము క్యాన్సర్ వస్తుందనుకునే వారు. అయితే ఇటీవల చిన్న వయసు మహిళల్లోనూ ఇది కనిపిస్తుండటం ఒక విషాదం. ఇక భారతీయ మహిళల్లో మరో అంశమూ కాస్త ఆందోళన కలిగించేదే. పాశ్చాత్య దేశవాసులతో పోలిస్తే మన దేశపు మహిళల్లో ఇది ఒక దశాబ్దం ముందుగానే కనిపిస్తోంది. అంటే పాశ్చాత్య మహిళల్లో ఏ 40 దాటిన వారిలోనో కనిపించే రొమ్ముక్యాన్సర్... మన దేశ మహిళల్లో ఇటీవల 30లలోనే కనిపిస్తోంది. కానీ కారుచీకట్లలో కాంతిరేఖలా ఒక ఆశాజనకమైన విషయం కూడా ఉంది. దీన్ని గురించి ముందే  తెలుసుకుంటే పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. దీనిపై అవగాహన పెంచుకుని ముందుగానే గుర్తించగలిగితే దాదాపు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా మరెన్నో ఏళ్లు ఆర్థిక భారాలు లేకుండా మానసికంగా కలిగే బాధలకు దూరంగా, ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చు. అందుకు ఉపయోగపడేవే ఈ కథనాలు.
 
 
మమకారం రంగేంటి? మేమైతే ‘పింక్’ అనే అంటాం. అమ్మ, చెల్లి, భార్య, కూతురు... అందరూ పంచేది మమకారమే. మరి వాళ్లను జాగ్రత్తగా చూసుకోని నాన్న, అన్న, భర్త, కొడుకు ఉంటే... ఏమవచ్చు? గుండెకోతే!!  బ్రెస్ట్ క్యాన్సర్‌ను వెంటనే కనుగొంటే ఎదకోత వరకూ పోదు.  మగవాళ్లకో విన్నపం. మీవాళ్ల గురించి  కేర్ తీసుకోండి.  ఇప్పుడైనా బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్‌కి తీసుకెళ్లండి.
 
 
మహిళల్లో ఇటీవల రొమ్ము క్యాన్సర్లు పెరగడానికి ఆధునిక జీవనశైలి (లైఫ్ స్టైల్) దోహదం చేస్తోంది. ఈ అంశంతో పాటు మరెన్నో అంశాలు దీనికి కారణమవుతున్నాయి. వాటిలో కొన్ని... సాధారణంగా పెరిగే వయసు (పైబడుతున్న వయసు-ఏజింగ్) రొమ్ము క్యాన్సర్‌కు ఒక ప్రధానమైన ముప్పు (రిస్క్ ఫ్యాక్టర్). అయితే ఇది అందరిలోనూ ఉండే నివారించలేని రిస్క్ ఫ్యాక్టర్.  ఆధునిక జీవనశైలిలో వచ్చే మార్పులతో కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంది. పైన పేర్కొన్న అంశం వల్ల స్థూలకాయం వచ్చేందుకూ దోహదం చేస్తుంది. దాని వల్ల ఇతర అనర్థాలతో పాటు రొమ్ము క్యాన్సర్‌కూ అవకాశాలు ఎక్కువ.
   
తల్లులు తమ బిడ్డలకు రొమ్ము పాలు పట్టకపోవడం. బిడ్డ పుట్టాక తల్లులు కనీసం ఆర్నెల్లు / ఏడాది పాటైనా బిడ్డకు రొమ్ము పాలు పట్టించాలి. అది జరగకపోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ రావచ్చు. ఇక మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు కూడా రొమ్ము క్యాన్సర్‌కు ఒక కారణం కావచ్చు.   పాశ్చాత్య దేశ వాసులతో పోలిస్తే మన దేశంలో రొమ్ము క్యాన్సర్ త్వరగా గుర్తించినప్పుడు... మన దేశ మహిళల్లో ఉండే జన్యుపరమైన అంశాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం. కొంతవరకు జన్యుపరమైన అంశాలు.
 
లక్షణాలు
రొమ్ము క్యాన్సర్‌ను చాలా తేలిగ్గా గుర్తించవచ్చు. ఉదాహరణకు తమలో అంతకు ముందు కనిపించని గడ్డలు చేతికి, స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కోసారి అవి నొప్పిగా లేనప్పుడు మహిళలు వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అవి హానికరం కాని గడ్డలా, లేక హానికరమైనవా అని తెలుసుకున్న తర్వాతే వాటి గురించి నిశ్చింతగా ఉండాలి.
   
రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం రొమ్ము ఆకృతిలో మార్పులు  బాగా ముదిరిన దశలో రొమ్ము అల్సర్స్ రావడం.  రొమ్ములో సొట్టలు పడినట్లుగా ఉండటం  రొమ్ము పరిమాణంలో మార్పులు వచ్చినట్లుగా అనిపించడం, వాటిలో ఏదైనా తేడాను గమనించడం. (అయితే నెలసరి సమయంలో మహిళల్లో రొమ్ములు గట్టిబడి... ఆ తర్వాత మళ్లీ నార్మల్ అవుతాయి. అందుకోసం ప్రతినెలా వచ్చే మార్పుల గురించి అంతగా ఆందోళన అవసరం లేదు. కానీ అలాగే గట్టిబడి ఉండటం కొనసాగితే మాత్రం ఆ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి.
     
నిపుల్‌కు సంబంధించినవి : రొమ్ముపై దద్దుర్ల వంటివి (ర్యాష్) లేదా వ్రణాలు రావడం రొమ్ము నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం  రక్తం వంటి  స్రావాలు రావడం. బాహుమూలాల్లో: చివరిదశలో గడ్డ బాగా పెరిగి చంకలోనూ దాని స్పర్శ తెలవడం. భుజానికి సంబంధించి: భుజం వాపు కనిపించడం.
 
స్క్రీనింగ్
సాధారణం కంటే ఎక్కువ రిస్క్ ఉన్నవారు తరచూ పరీక్షలు చేయించుకోవాలి. జాతీయ హెల్త్ సర్వే (ఎన్‌హెచ్‌ఎస్) బ్రెస్ట్ స్క్రీనింగ్ కార్యక్రమం సిఫార్సుల మేరకు రిస్క్ ఫ్యాక్టర్లు లేని మహిళలైతే 50 - 70 ఏళ్ల మధ్యలో ప్రతి మూడేళ్లకోసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్న మహిళలైతే మరింత తరచుగా ఈ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలి. కుటుంబ చరిత్రలో రొమ్ము క్యాన్సర్ వచ్చిన దగ్గరి బంధువులు (అంటే అమ్మ, చెల్లెళ్లు, కూతుళ్లు) ఉంటే రిస్క్ రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుంది. ఇక మహిళల్లోని జన్యువులైన బీఆర్‌సీఏ1, బీఆర్‌సీఏ2 అనే రెండింటిలో తేడాలు ఉంటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చిన మహిళల్లోని 5% మందిలో ఈ రెండు జన్యువుల్లో మ్యుటేషన్స్ (ఉత్పరివర్తన మార్పులు) చోటు చేసుకున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి.
 
 నిర్ధారణ

 తొలుత స్పర్శ ద్వారా ఏవైనా తేడాలు తెలుసుకోవడం (ఫిజికల్ ఎగ్జామినేషన్) ద్వారా.  మామోగ్రఫీ అనే స్కాన్ ద్వారా. (ఇందులో డిజిట్ లేదా ఎమ్మారై లేదా అల్ట్రాసౌండ్ స్కాన్)ను నిర్వహిస్తారు.  జెనెటిక్ స్క్రీనింగ్ కూడా చేస్తారు.  ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ (ఎఫ్‌ఎన్‌ఏసీ) అనే పరీక్ష  ఒకవేళ అవసరం ఉందని తెలిస్తే వైద్యులు బయాప్సీ (అంటే చిన్న ముక్క తీసి పరీక్షకు పంపి చేసే నిర్ధారణ) లేదా ఎఫ్‌ఎన్‌ఏసీ అనే చిన్న నీడిల్ పరీక్ష చేస్తారు.  మామోగ్రఫీతో పాటు ఫ్రోజెన్ సెక్షన్ ఎగ్జామినేషన్ (కొన్ని సందర్భాల్లో ఇది తప్పనిసరి)  ఛాతీ ఎక్స్‌రే  కడుపు స్కానింగ్  ఎముకల స్కానింగ్ (ఈ చివరి పరీక్ష వ్యాధి ఏ మేరకు వ్యాపించిందో తెలుసుకోవడం కోసం చేస్తారు).
 
ఇటీవల రొమ్ములో ఏవైనా తేడాలు రాగానే మామోగ్రఫీ చేయించుకునే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఒక స్క్రీనింగ్‌లో తప్పినా... మరో స్క్రీనింగ్‌లోనైనా ఈ వ్యాధిని కనుగొనడం ముమ్మరమైంది. ఫలితంగా ఎక్కువమందిని వ్యాధి బారినుంచి వైద్యులు కాపాడగలుగుతున్నారు. పైగా విదేశాల్లో ఆయుప్రమాణాలు ఎక్కువ కావడంతో అక్కడ 50 - 70 ఏళ్ల వయసులో జరిగే పరీక్షలు మన దేశంలో 30 -60లలోనే జరుగుతున్నాయి. దాంతో రొమ్ము క్యాన్సర్‌ను  మరింత ముందుగా కనుగొనడానికి అవకాశం ఏర్పడుతోంది.
 
చికిత్స
ఇప్పుడు క్యాన్సర్ ఉందని తెలిసినా వైద్యపరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని మొదటి లేదా రెండో దశలో కనుగొంటే పూర్తిగా నయం చేయవచ్చు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది కేవలం అపోహ మాత్రమే. ఇక తొలి దశల్లో తెలిస్తే రొమ్మును తొలగించాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. కేవలం క్యాన్సర్ గడ్డను మాత్రమే విజయవంతంగా తొలగించవచ్చు. రొమ్ము క్యాన్సర్ చుట్టుపక్కలకు కూడా పాకిందని తెలిసినప్పుడు మాత్రమే రొమ్మును తొలగిస్తారు. అయినా ఇప్పుడు ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానంతో రొమ్మును తొలగించినా... లేదా రొమ్ములోనే కాస్తంత భాగాన్ని తొలగించినా మిగతా చోట్ల ఉండే కండరాలతో ఆ
 ఇతర చికిత్సలు : ఈ రోజుల్లో శస్త్రచికిత్సతో పాటు, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మాసెక్టమీలో రొమ్ము తొలగిస్తారు. అయితే రొమ్ముక్యాన్సర్ తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియో థెరపీలను చేస్తారు. రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో ఇప్పుడు మొదటే దీన్ని కనుగొంటే ఆంకోప్లాస్టీ అనే శస్త్రచికిత్స సహాయంతో రొమ్మును పూర్తిగా రక్షిస్తారు.
 
నివారణ
ఒక మహిళకు రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవడం నివారణలో కీలకం అవుతుంది. ఇందుకోసం ఒక మహిళ వ్యక్తిగత అలవాట్లు/జీవనశైలి, ఆమె కుటుంబ ఆరోగ్య చరిత్ర, వృత్తి లాంటి అంశాలు ఇందుకోసం ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో కొన్నింటిని ప్రయత్నపూర్వకంగా మార్చుకోవచ్చు. మరికొన్ని మార్చలేనివీ ఉంటాయి. ఈ రెండింటినీ కలుపుకొని ఒక మహిళకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను అంచనా వేస్తారు. ఇందులో...
 
మార్చలేని అంశాలు: వయసు, మహిళ కావడం (జెండర్), రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ బంధువులతో రక్తసంబంధం, రుతుస్రావ చరిత్ర, ఏ వయసులో రుతుస్రావం ఆగిపోతుంది వంటి అంశాలను మార్చలేం.

మార్చుకోగల అంశాలు: ఎక్కువ బరువు ఉండటం, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, ఎంత మంది పిల్లలు, బిడ్డలకు ఎంతకాలం పాటు రొమ్ముపాలు పట్టారు, ఆల్కహాల్ అలవాట్లు, పోషకాహారం.
 
వ్యాయామం: మహిళలంతా మరీ తీవ్రమైనవీ, మరీ తక్కువవీ కాకుండా ఒక మోస్తరు వ్యాయామాలను రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. ఇలా వారంలో కనీసం ఐదురోజులైనా వ్యాయామం చేయాలి.
 
డా. ఏవీఎస్ సురేశ్
సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, కాంటినెంటల్ హాస్పిటల్స్
గచ్చిబౌలి, హైదరాబాద్
 
ట్రీట్‌మెంటే...  ధైర్యం ఇచ్చింది
ఒకరోజు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ ఉంటే రొమ్ములో ఏదో తేడా అనిపించింది. మా నాన్నగారు రేడియేషన్ ఆంకాలజిస్ట్. అమ్మ పాథాలజిస్ట్. అందుకని బ్రెస్ట్ క్యాన్సర్ గురించి నాకు అవగాహన ఉంది. నా స్వీయపరీక్ష మీద ఉన్న నమ్మకంతో నేను డాక్టర్‌ని కలిశాను. నేను అనుకున్నది నిజమే. బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారించారు. అప్పుడు నా వయసు 35. క్యాన్సర్‌లాంటి పెద్ద వ్యాధిని ఎదుర్కొనే వయసు కాదది. కానీ ధైర్యంగా పోరాడాలనుకున్నా. రొమ్ము తీసినా పర్వాలేదనుకున్నా. ట్రీట్‌మెంట్‌లో భాగంగా జుత్తు ఊడిపోతుందని బాధపడలేదు. ఒంట్లో ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టడానికి ఇలాంటివన్నీ చిన్న చిన్న త్యాగాలు అనిపించింది. ఇలాంటి అనారోగ్యానికి గురైనప్పుడు శారీరకంగా, మానసికంగా చాలా బలంగా ఉండాలని తెలుసు. అయినా భయపడ్డాను. కాని ట్రీట్‌మెంట్ తీసుకోవడం మొదలుపెట్టాక ధైర్యం పెరిగింది. అనవసరంగా భయపడ్డానని అప్పుడు  అనిపించింది. నా అనుభవంతో చెబుతున్నా... రొమ్ము క్యాన్సర్‌ని సులువుగా జయించవచ్చు. నా కుటుంబ సభ్యులు, నాకు అత్యంత సన్నిహితుడు అయిన కమల్‌హాసన్ ఇచ్చిన ధైర్యం నేను కోలుకోవడానికి ఓ కారణం అయింది.

నేను కొన్ని సినిమాల్లో చాలా శక్తిమంతమైన పాత్రలు చేశాను. క్యాన్సర్ జయించడానికి అవి కూడా ఓ కారణం అయ్యాయి. నాకు క్యాన్సర్ సోకిందని తెలిసిన మొదటి సంవత్సరంలో నేను 56 సినిమాలు చూశాను. అన్నీ థియేటర్లకు వెళ్లి చూసినవే. ఏదో జరగకూడనిది జరిగిందని కుంగిపోయి మంచానికే పరిమితం కాకూడదు. ఓపిక ఉన్నంతవరకూ పనులు చేసుకోవచ్చు. తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స చాలా తేలిక అవుతుంది. అందుకే ముప్పై ఏళ్లు వచ్చాయంటే ‘మామోగ్రఫీ’ చేయించుకోవాలి. మహిళలకు ఇంట్లో ఉన్నవాళ్లమీద ఉండే శ్రద్ధ తమ మీద ఉండదు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు.
 - గౌతమి, సినీ నటి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement