శిరోజాల సంరక్షణ
మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే వెంట్రుకలే అందాన్ని కాపాడతాయి. తలస్నానం చేసిన ప్రతిసారి దువ్వెనను కూడా శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చుండ్రు, మురికి వంటి సమస్యలు తిరిగి జుట్టుకు అంటుకోకుండా ఉంటాయి.
♦ పెరుగులో పెసరపిండి కలిపి, రెండు రోజులు బయటే ఉంచాలి. తర్వాత రోజు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు తగ్గుతుంది. వెంట్రుకలు మృదువుగా అవుతాయి.
♦ ఆలోవెరా జెల్‌ను రాత్రి పడుకునేముందు మాడుకు పట్టించి, మరుసటి రోజు శుభ్రపరుచుకోవాలి. ఇది జుట్టుకు మంచి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడటమే కాకుండా, చుండ్రు తగ్గుతుంది.
♦ రెండు టేబుల్ స్పూన్ల మెంతులను నానబెట్టి, మరుసటి రోజు ఉదయం మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమంలో మరో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. శిరోజాలకు పట్టుకుచ్చుల్లాంటి మృదుత్వం వస్తుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది.
♦ నిమ్మకాయను రసం తీయకుండానే పై పొట్టును మాత్రమే తురమాలి. ఈ తురుమును రెండు కప్పుల నీటిలో కలిపి, కప్పు అయ్యేంతవరకు మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టాలి. తలంటుకున్న తర్వాత ఈ నీటిని జుట్టుకు స్ప్రే చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసుకుంటే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉంటాయి.