బర్కినా ఫాసో
ఖండం : ఆఫ్రికా
వైశాల్యం : 2,74,200 చదరపు కిలోమీటర్లు
జనాభా : 17,322,796 (తాజా అంచనాల ప్రకారం)
రాజధాని : ఓగాండోగో
కరెన్సీ : సిఎఫ్‌ఎ ఫ్రాంక్
అధికార భాష : ఫ్రెంచి
ప్రభుత్వం : సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్
మతం : ఇస్లాం (55%) క్రైస్తవులు (25%), స్థానిక తెగలు (20%)
వాతావరణం : సంవత్సరం పొడుగునా 25-40 డిగ్రీల మధ్య ఉంటుంది.
పంటలు : ప్రత్తి , వేరుశనగ, జొన్నలు, రాగులు, మొక్కజొన్న, వరి.
పరిశ్రమలు : ప్రత్తి జిన్నింగ్, బీరు, ఆహార పదార్థాల ప్రాసెసింగ్, సబ్బులు, దుస్తులు, బంగారం.
స్వాతంత్య్రం : 1960 ఆగస్టు 5
ఎగుమతులు : ప్రత్తి, బంగారం, మాంగనీసు.
సరిహద్దులు : మాలి, నైగర్, బెనిన్ టోగో, ఘనా, కోబెడి ఐవోరీ.
చరిత్ర
క్రీస్తు పూర్వం ఈ ప్రాంతం అడవి వేటగాళ్లకు ప్రసిద్ధి. ఆ కాలంలో వారు ఉపయోగించిన రాతి కత్తులు, కొడవళ్లు, బాణాలు ఇంకా ఇతర పరికరాలు 1973 నాటి పురావస్తు తవ్వకాలలో బయట పడ్డాయి. క్రీ.పూ. 3600 - 2500 మధ్య కాలంలో వ్యవసాయం చేసిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. క్రీ.పూ. 1200 శతాబ్దంలోనే ఇక్కడి వాళ్లు ఇనుప వస్తువులు తయారు చేసి, ఆయుధాలుగా ఉపయోగించారు. క్రీ.శ.700 లో ఈ ప్రాంతానికి ప్రోటో మోసి రాజులు వచ్చి, ఈ ప్రాంతంలో తమ రాజ్యాన్ని ఏర్పరిచారు. క్రీ.శ. 1400 శతాబ్దంలో సామో రాజులు ప్రాంతాన్ని ఆక్రమించారు. 15, 16 శతాబ్దాలలో డోగన్ రాజులు దేశ ఉత్తర ప్రాంతాన్ని ఆక్రమించుకుని, పరిపాలన చేశారు. 16వ శతాబ్దంలో సోంఘై రాజులు, 18వ శతాబ్దంలో గ్విరికో రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్, ఫ్రెంచి, జర్మనీ పాలకులు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. చివరికి 1960 ఆగస్ట్ 5న ఫ్రెంచి నుండి ఈ దేశం స్వాతంత్య్రాన్ని పొందింది.
పరిపాలనా రీతులు
దేశం మొత్తం పరిపాలనా సౌలభ్యం కోసం 13 పాలనా రీజియన్లుగా విభజించారు. ఒక్కొక్క రీజియన్‌కు ఒక్కొక్క గవర్నర్ ఉంటాడు. ఈ రీజయన్లు తిరిగి 45 ప్రావిన్స్‌లుగా, 301 డిపార్టుమెంటులుగా విభజింపబడి ఉన్నాయి. దేశం మొత్తంలో పది పెద్ద నగరాలు ఉన్నాయి. అవి, రాజధాని ఓగడోగో, బోబో డియోలాసో, బాన్ ఫోరా, కొడోగో, ఒయాహిగోయా, కాయా, ఫాదా ఎన్‌గోర్మా, టెంకొడోగో, హోండే, డిడోగోలు.
ప్రజలు - సంస్కృతి
బర్కినా ఫాసో ఒక అనేక భాషల, మతాల సమ్మేళనం. దేశంలో దాదాపు 69 భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. ఇందులో 60 భాషలు మాట్లాడే వాళ్లు ఆటవిక తెగలకు చెందినవారు. మోసి భాషను మొత్తం జనాభాలో 40% ప్రజలు మాట్లాడుతారు. అధికార భాష ఫ్రెంచి అయినా ఇతర భాషలకు కూడా దేశంలో ప్రాధాన్యత ఉంది. మండే, ద్యూలా, గారున్సి, బిస్సా, బోబో, సమో, మార్కా, పులా, గోర్ మంచి మొదలైన భాషలు మాట్లాడే ప్రజలు దేశ వివిధ భాగాలలో నివసిస్తున్నారు. దేశంలో 55% ప్రజలు ఇస్లాం మతానికి, 25% క్రైస్తవ మతానికి, మిగిలిన వారు ఆటవిక తెగలకు చెందినవారు ఉన్నారు. దేశంలో అక్షరాస్యత చాలా తక్కువ. కేవలం 23% మంది మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు. దేశంలో నివసిస్తున్న ప్రజలను బురినబి అంటారు.
పంటలు - పరిశ్రమలు
దేశం ఉత్తర భాగమంతా సహారా ఎడారి ఆక్రమించి ఉంది. మధ్య భాగం, దక్షిణ భాగాలలో ప్రజలు ప్రత్తి, చెరకు పంటలను ఎక్కువగా పండిస్తారు. జొన్నలు, మిల్లెట్, మొక్కజొన్న, వరి, వేరుశనగ, నువ్వుల పంటలు కూడా రైతులు పండిస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ దుస్తులు, మాంగనీస్ గనులు, బంగారం గనులు బాగా పుంజుకున్నాయి. దేశం నుండి ప్రత్తి, బంగారం ఇతర దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తారు. పరిశ్రమలు ఎక్కువగా రాజధాని నగరం పరిసరాలలో నెల కొని ఉన్నాయి. తోలు వస్తువులు, సిగరెట్లు, ఇటుకలు, తేలికపాటి మెటల్ వస్తువులు, వ్యవసాయ పనిముట్ల తయారీ పరిశ్రమలు ఉన్నాయి.
రాజధాని ఓగడోగో
ఈ నగరం దేశం మొత్తంలోనే అతి పెద్దది. నగరంలో మనకు దేశంలోని అన్ని తెగల ప్రజలు కనిపిస్తారు. నగరం మధ్యలో విమానాశ్రయం ఉంది. నగరంలోనే బంగ్రే ఊగో అర్బన్ పార్క్ ఉంది. ఈ పార్కులో చిన్న జంతు ప్రదర్శనశాల కూడా ఉంది. ఇందులో మొసళ్లు చూడవచ్చు. ఈ పార్కును ఎన్నో శతాబ్దాల క్రితమే నిర్మించారు. దీనితో పాటు నగరానికి అతి సమీపంలో ఎల్ యునైట్ పెడగాగిక్ అనే మరో జూపార్కు కూడా ఉంది. ఇది 20 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో అనేక రకాల అడవి జంతువులు ఉన్నాయి. ఈ పార్కులోనే ఒక మ్యూజియం ఉంది. ఇందులో శతాబ్దాల నాటి దేశ సంస్కృతి, చరిత్రకు సంబంధించిన రకరకాల వస్తువులు ఉన్నాయి. నగరంలో ఐక్యరాజ్య సమితి స్క్వేర్‌లో ఓగా- లోడెన్ గార్డెన్ ఉంది. ఇది బర్కినా - ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న స్నేహానికి చిహ్నంగా ఉంటుంది. నగరంలో ఇంకా లే మూసీ నేషనల్ మ్యూజియం ఆఫ్ మ్యూజిక్, మూసి డి మనేగా, నాబా కూమ్ అనే శిల్పం, లా ప్లేస్ డు గ్రాండ్ ల్యాన్ స్మారకం మొదలైనవి చూడవచ్చు.
గౌవా నగరం
గౌవా నగరం దేశంలో రెండో అతి పెద్ద నగరం. ఈ నగరంలో లోబి తెగ ప్రజలు అధికంగా నివసిస్తారు. ఇదొక మార్కెట్ నగరం. ఇక్కడి ప్రజల్లో మూఢ నమ్మకాలు అధికం. ఇక్కడి పురాతన కాలం నాటి అడవులు, చెట్లు ఉన్నాయి. వీటిని ప్రజలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. బైబిల్ గ్రంథంలో పేర్కొన్న ఒక చెట్టు ఇక్కడ ఉంది. దీనిని అబ్రహం నాటాడని నమ్ముతారు. ఆ చెట్టును ప్రజలు దేవుడుగా కొలుస్తారు. ఆలివ్ చెట్లున్న ప్రాంతమంతా ఆకుపచ్చగా ఉంటుంది.
ఈ నగరంలో పురాతన కాలం నాటి చెట్లతో పాటు, ఒక మ్యూజియం, కొన్ని పురాతన గుహలు కూడా ఉన్నాయి. క్రైస్తవుల చర్చి, ముస్లింల మసీదు ఆ కాలం నాటివి ఉన్నాయి.
బాన్ ఫోరా నగరం
ఈ నగరం దేశ దక్షిణ పశ్చిమ ప్రాంతంలో ఉంది. శతాబ్దం క్రితం ఈ ప్రాంతాన్ని ఫ్రెంచి పాలకులు ఆక్రమించుకుని పరిపాలించారు. ఈ ప్రాంతంలో నేడు చెరకు అధికంగా పండుతుంది. ఇదొక పెద్ద వ్యాపార కేంద్రం. నగరమంతా కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఈ నగరంలో గోయిన్, కరబోరో, టుర్కా తెగల ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. వీరు ఫ్రెంచి, డియోలా భాషలు మాట్లాడుతారు. ఈ నగరానికి సమీపంలో బాన్‌ఫోరా కాస్కేడ్‌లు అనే జలపాతాలు ఉన్నాయి. పర్యాటకులను ఈ ప్రాంతం బాగా ఆకర్షిస్తుంది. ఇవి నగరానికి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడే కోమోనది ప్రవహిస్తుంది. రాళ్లు, గుట్టల పైనుండి జాలువారే నీరు చూపరులను బాగా ఆకర్షిస్తుంది.
డబ్ల్యు నేషనల్ పార్కు
డబ్ల్యు నేషనల్ పార్కు ఈ దేశంలోనే కాక నైగర్, బెనిన్ దేశాల భూభాగాలలో కూడా విస్తరించి ఉంది. మూడు దేశాల ప్రభుత్వాలు దీనిని పర్యవేక్షిస్తాయి. 1954లో ఈ జాతీయ పార్కును ఏర్పరిచారు. దీనిని యునెస్కో సంస్థ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ పార్కు దాదాపు 10 వేల కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. మెర్కో, నైగార్ నదులు ఈ ప్రాంతంలో ప్రవహిస్తాయి. రాతి గుట్టలు, వాటి సమీపాలలో పురాతన కాలం నాటి సమాధులు ఎన్నో కనిపిస్తాయి.
ఈ పార్కులో అడవి దున్నలు, బబూన్ రకపు కోతులు, చిరుత పులులు, ఏనుగులు, హిప్పోలు, సింహాలు మొదలైన జంతు వర్గం ఉంది. ఆఫ్రికన్ ఏనుగులకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. దాదాపు 350 రకాల పక్షిజాతులు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి.