
ఎంత టాప్ స్టార్ అయితే మాత్రం...
‘‘ఎంత టాప్ స్టార్ అయితే మాత్రం ఇంతలా బిల్డప్ ఇవ్వాలా? అతనికి కూడా హోమ్ బేనర్ ఉంది కదా? మరి, నిర్మాతల కష్టం తెలియదా?’’ అని సల్మాన్ ఖాన్ గురించి నిర్మాత ఆదిత్యా చోప్రా, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తమ సన్నిహితుల దగ్గర చెప్పి, వాపోతున్నారట. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న చిత్రం ‘సుల్తాన్’. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. ఇంతకీ సల్మాన్ విషయంలో దర్శక-నిర్మాతలు ఎందుకు ఫీలవుతున్నారనే విషయానికి వస్తే... చెప్పిన సమయానికి షూటింగ్‌కి హాజరు కావడంలేదట.
ఒక రోజైతే చిత్రీకరణకు అంతా సిద్ధం చేసుకుని, ఇక సల్మాన్ రాగానే మొదలుపెడదామని అందరూ ఎదురు చూస్తుండగా, ఓ ఫోన్ కాల్ వచ్చిందట. ‘ఈరోజు నేను షూటింగ్‌కి రావడం లేదు. క్యాన్సిల్ చేసేయండి’ అని అవతలివైపు నుంచి సల్మాన్ నిర్మొహమాటంగా చెప్పారట. అప్పుడెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ చిత్రం విషయంలో సల్మాన్ ఏమాత్రం సహకరించడంలేదని టాక్. స్టార్ హీరో కాబట్టి, ఏమీ అనలేక దర్శక-నిర్మాతలు లోలోపల మదనపడిపోతున్నారట.