
కేక్ వాక్... స్వీట్ టాక్
2017 కొత్త నోటు. 2016 పాత నోటు
కొద్ది గంటల్లో పాత నోటు చేజారిపోతుంది! పాత నోట్ల జ్ఞాపకాలు గుండె గదుల్లోకి చేరిపోతాయి. కొత్త నోట్లు ఇప్పటికే చేతుల్లోకి వచ్చేశాయి. కానీ గుండె గదుల్లోకే... అవి చోటు చేసుకోలేకపోయాయి! ఏదైనా.. కాలం గడవాలి. అప్పుడే కొత్తదనం అలవాటవుతుంది. పాత జ్ఞాపకం మానుతుంది. పాత నుంచి కొత్తకు షిఫ్ట్ అవడమే కదా జీవితం. ‘మధురమైన జ్ఞాపకాలను జ్ఞాపకాలుగా కాకుండా గాయాలుగా ఎందుకు తడుముకోవాలి? నేనిక్కడే ఉండిపోతా’ అని నిలబడిపోతే పాత నోటుకు ఎంత విలువ ఉంటుందో మనిషికీ అంతే విలువుంటుంది. నెత్తి కొట్టుకుంటూనే కంప్యూటర్‌కి అలవాటు పడ్డాం, ‘ఇన్‌హ్యూమన్’ అని తిట్టుకుంటూనే స్మార్ట్‌ఫోన్‌కీ అలవాటు పడ్డాం. లైఫ్ ఎంత ఈజీ ఐపోయింది!
‘ఈజీ ఐపోతే సరిపోయిందా?! లైఫ్‌లో జీవం ఉండొద్దా?’ న్యాయమైన ప్రశ్నే. మార్పే జీవం అనుకుని చూడండి. మళ్లీ ఈ ప్రశ్న వెయ్యరు. అవును. మార్పే జీవం, జీవితం. న్యూ ఇయర్‌కి కౌంట్ డౌన్ మొదలైంది. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. చిన్న కేకు ముక్క హ్యాపీని ఇస్తుంది. చిన్న ముద్దు తునక హ్యాపీని ఇస్తుంది.ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మీ ఇష్టం. ఈలోపు న్యూ ఇయర్ గురించి కొన్ని విశేషాలు మీ కోసం...
లాస్ట్ 60
ప్రపంచంలో అతి పెద్ద న్యూ ఇయర్ సెలబ్రేషన్ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద జరుగుతుంది (కింది ఫొటో అక్కడిదే). అక్కడి ‘న్యూ ఇయర్ బాల్ డ్రాప్’ ఈవెంట్‌ను చూడ్డానికి కనీసం 10 లక్షల మంది గుమిగూడతారు. టైమ్ బాల్‌గా ప్రసిద్ధి చెందిన ఓ వెలుగుపూల బంతి సరిగ్గా 11:59 గంటలకు టైమ్ స్క్వేర్ కూడలిలో ఏర్పాటు చేసిన పోల్ నుంచి 60 సెకన్లలో 141 అడుగుల ఎత్తునుంచి కిందికి దిగుతుంది (పక్క ఫొటోలో ఉన్నది అదే). బంతి ఇలా దిగగానే అలా కొత్త సంవత్సరం వచ్చేసినట్లు! మొదట్లో ఇక్కడ బంతి సంప్రదాయం లేదు. బాణాసంచా కాల్చేవారు. బాణాసంచాను నియంత్రించాక తొలిసారి 1907లో వంద 25 వాట్‌ల బల్బుల కాంతితో 700 పౌండ్ల (318 కిలోలు) టైమ్ బాల్‌ని జారవిడిచారు. ఇప్పుడు 32,000 ఎల్.ఇ.డి. బల్బుల కాంతితో 11,875 పౌండ్ల (5,390 కిలోలు) బరువు, 12 అడుగుల వ్యాసం ఉన్న బాల్‌ను పై నుంచి ‘డ్రాప్’చేస్తున్నారు. దేదీప్యమైన వెలుగుల కోసం ఈ బంతి ఉపరితలంపై 2,688 క్రిస్టల్స్‌ని పొదుగుతున్నారు. బంతి కిందికి దిగుతున్న దృశ్యం చూస్తుంటే, నిజంగా న్యూ ఇయర్ దివి నుంచి భువికి దిగుతున్నట్లే ఉంటుంది.
టాప్ 5
కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానాలు చేసుకోవడం అనే సంప్రదాయం అన్ని దేశాల్లోనూ ఉంది. ఏ దేశంలో అయినా ఎక్కువమంది చేసుకునే తీర్మానాలు... ప్రాధాన్యక్రమంలో ఇలా ఉంటాయి.
1. బరువు తగ్గాలి.
2. ప్లాన్డ్‌గా ఉండాలి.
3. ఖర్చు తగ్గించాలి.
4. సేవింగ్స్ పెంచాలి.
5. హెల్తీగా ఉండాలి.
తియ్యని సంప్రదాయం
మధ్యయుగాల నుంచీ ఈ తియ్యని సంప్రదాయం వస్తోంది. ముఖ్యంగా జర్మన్లు, బ్రిటిషర్లు.. ముద్దుతో కొత్త సంవత్సరాన్ని ఆరంభిస్తారు. ఆ రోజున ఇష్టమైన వారిని ముద్దు పెట్టుకుంటే ఏడాది అంతా సంతోషకరంగా గడుస్తుందట!