
ముక్కులో ఏదో అడ్డంకి... ఎందుకిలా?
ఇఎన్‌టి కౌన్సెలింగ్
నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. చాలా రకాల మందులు వాడాను. మార్కెట్‌లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అవి వాడినప్పుడు మాత్రం సమస్య తాత్కాలికంగా తగ్గినట్లు అనిపించినా మళ్లీ వస్తోంది. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం చెప్పండి.
– సుదర్శనమూర్తి, మహబూబాబాద్
ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్‌ఎస్) కూడా తీయించాల్సిరావచ్చు. ఈ పరీక్షలతో ముందుగా మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. వాటిలో వచ్చే ఫలితాల ఆధారంగా చికిత్స ఉంటుంది.
మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు.
డాక్టర్ ఇ.సి. వినయకుమార్
హెచ్‌ఓడి – ఈఎన్‌టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్
హఠాత్తుగా హైబీపీ... ఏం చేయాలి?
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. రోజూ వాకింగ్‌కు వెళ్తాను. ఆర్నెల్ల క్రితం హఠాత్తుగా 160/100 బీపీ వచ్చింది. ఈ నెల అదికాస్తా 190/100కు పెరిగింది. బీపీ కంట్రోల్ కాకపోతే అనేక సమస్యలు వస్తాయని మిత్రులు హెచ్చరిస్తున్నారు. ఏయే సమస్యలు వస్తాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. – ఏ.వి.జి.రావు, ఆదిలాబాద్
మీరు క్రమం తప్పకుండా వాకింగ్‌కు వెళ్తుండటం, వ్యాయామం చేయడం మంచి అలవాటు. ఇక రక్తపోటు విషయానికి వస్తే... పూర్తిగా ముదిరే వరకు ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించకుండా హఠాత్తుగా దెబ్బతీసే హైపర్‌టెన్షన్‌ను సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది కాబట్టి దానికి ఆ పేరు. దీనిలో ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలుంటాయి. చాలామందిలో ఏ ప్రత్యేక కారణం లేకుండా వ్యక్తమయ్యే రక్తపోటును ప్రైమరీ హైపర్‌టెన్షన్‌గా పేర్కొనవచ్చు. ఇది నెమ్మదిగా ఏళ్లతరబడి పెరుగుతూ వచ్చి, అకస్మాత్తుగా కనిపిస్తుంది. మరికొందరిలో పైకి కనిపించని కొన్ని ఆరోగ్య కారణాల వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీన్ని సెకండరీ హైపర్‌టెన్షన్ అంటారు. ప్రైమరీతో పోలిస్తే సెకండరీ మరింత ప్రమాదకరమైనది. ఈ రకమైన రక్తపోటుకు దారితేసే కారణాలు... కిడ్నీల సమస్యలు, ఎడ్రినల్ గ్లాండ్‌లో గడ్డలు, థైరాయిడ్ సమస్యలు, గురకతో నిద్రకు అంతరాయం, పుట్టుకతో వచ్చే రక్తనాళ సమస్యలు, బర్త్ కంట్రోల్ పిల్స్, మితిమీరిన మద్యపానం.
బీపీ సమస్య మెదడు, గుండె, కిడ్నీ, కళ్లు... ఇలా మనలోని ఏ అవయవాన్నైనా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ప్రైమరీ హైపర్‌టెన్షన్‌ను ఒకింత సులభంగా అదుపు చేయవచ్చు గానీ... సమస్యల్లా సెకండరీ ౖహె పర్‌టెన్షన్‌తోనే. దీనిని అదుపు చేసేందుకు జాగ్రత్తగా, నేర్పుతో చికిత్స చేయాలి. మద్యం, పొగతాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఉప్పు వాడకాన్ని రోజూ 1.5 – 2 గ్రాములకు మించకుండా పరిమితం చేయాలి. కొవ్వుపదార్థాలు తక్కువగానూ, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగానూ ఉండేలా ఆహారం తీసుకోవాలి. ఒత్తిడిని అదుపు చేసుకునే ప్రశాంతమైన దృక్పథాన్ని కలిగి, ఉద్వేగాలకు దూరంగా ప్రశాంతమైన జీవనశైలిని అలవరుచుకోవాలి.
డాక్టర్ వరద రాజశేఖర్,
సీనియర్ ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్
ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
ఎముకల్లో నొప్పి, వాపు ఎందుకు?
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 48 ఏళ్లు. గత నెల రోజులుగా నా కాళ్ల ఎముకలలో రాత్రి సమయాల్లో నొప్పి ఎక్కువగా వస్తోంది. కొద్దిగా వాపు కూడా కనిపిస్తోంది. డాక్టర్‌ను సంప్రదించి యాంటీబయాటిక్స్ తీసుకున్నాను. అయినా ఎలాంటి ఫలితం లేదు. నా సమస్య ఏమిటి? దీనికి చికిత్స ఏదైనా ఉందా? – నాగభూషణం, ఒంగోలు
రాత్రి వేళ ఎముక నొప్పి రావడం అంత మంచి లక్షణం కాదు. ఇలా వస్తున్నప్పుడు మొదట ఎముక క్యాన్సర్‌ను అనుమానించాల్సి ఉంటుంది. మామూలుగా ఎముక క్యాన్సర్లలో నొప్పితో గాని, నొప్పి లేకుండా గాని కణుతులను గుర్తిస్తారు. మృదుకణజాలంతో క్యాన్సర్ సోకినప్పుడు కణితి నొప్పిగా ఉండకపోవచ్చు. ఎముకలో గట్టిగా ఉండే కణజాలంలో క్యాన్సర్ ఉంటే మాత్రం నొప్పి, వాపు ముందుగా కనిపిస్తాయి.
చికిత్స : ఎముక క్యాన్సర్ సాధారణంగా రక్తం ద్వారా ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. ఇలా రక్తం ద్వారా ఇది శరీరంలో మరికొన్ని చోట్ల క్యాన్సర్‌ను కలిగించవచ్చు. క్యాన్సర్ ట్యూమర్ చుట్టూ కొంత భాగం వరకు వాపు ఉంటుంది. ఇది వ్యాపించకుండా చూడటం కోసం మన శరీరంలోని రక్షణ వ్యవస్థ దాని చుట్టూ ఒక చిన్న పొరను ఏర్పరుస్తుంది. దీని బయట కొంత మేరకు ఉన్న భాగాన్ని రియాక్టివ్ జోన్ అంటారు. క్యాన్సర్ మొదటి స్థాయిలో ఉన్నవారికి ఈ రియాక్టివ్ జోన్ వరకు ఉన్న కణాలను తొలగిస్తారు. కాబట్టి ఇది మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. కొన్నిసార్లు ఎముకను పూర్తిగా తొలగించి ప్రొస్థెసిస్ అనే కృత్రిమ ఎముక లేదా రాడ్‌ను అమర్చాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఎముకను పూర్తిగా శుభ్రం చేసి అక్కడికక్కడే ఎముకకు రేడియేషన్ అందించి తిరిగి దాన్ని అమరుస్తారు. దీన్ని ఎక్స్‌ట్రా కార్పోరల్ రేడియేషన్ థెరపీ అంటారు.
చాలామంది ఎముకలో నొప్పి, వాపు రాగానే మసాజ్ చేయిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా మసాజ్ చేయడం వల్ల రక్తసరఫరా పెరిగి క్యాన్సర్ కణాలు మరింత త్వరగా ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతాయి. ఎముకలో నొప్పి, వాపు కనిపించనప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి
కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జిన్
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్