భయం మోసుకువచ్చే మార్కులెన్ని..? | caretaking age | Sakshi
Sakshi News home page

భయం మోసుకువచ్చే మార్కులెన్ని..?

Published Fri, Feb 20 2015 11:04 PM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

భయం మోసుకువచ్చే  మార్కులెన్ని..? - Sakshi

భయం మోసుకువచ్చే మార్కులెన్ని..?

13-19 కేరెంటింగ్
 
అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19...
 
పరీక్షల కాలం దగ్గరపడుతోంది. ఇంట్లో పెద్దలు చదివిస్తున్నారు. స్కూళ్లో టీచర్లు చదివిస్తున్నారు. అయినా పిల్లల్లో ఆందోళన రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎప్పుడు చదివింది అప్పుడే మర్చిపోయినట్టుగా ఉంది. ఎందుకిలా? పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు ఉండే ఈ సమస్యను అధిగమించేదెలా?!

సుజి పదవ తరగతి చదువుతోంది. స్కూల్లో ఎప్పుడూ టాపర్‌గా ఉండి అందరి ప్రశంసలూ అందుకునేది. ఈ మధ్య తరచూ కడుపునొప్పి, తలనొప్పి అని విలవిల్లాడిపోతోంది.  ‘పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అమ్మాయి పరిస్థితి ఇలా ఉంది’ అని ఇంట్లో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  

ఇదీ విషయం: పరీక్షల ముందు రోజుల్లో పిల్లల ప్రవర్తన ఉన్నట్టుండి మారిపోతుంటుంది. దానిని అర్థం చేసుకునేందుకు పెద్దలు తీరిక చేసుకోక తప్పదు. ఎప్పుడూ టాపర్‌గా ఉండే సుజి ప్రవర్తన పరిశీలిస్తే  పిల్లల మధ్య పోటీయే కాదు, పాఠశాలల మధ్యా ర్యాంకుల పోటీ పెరిగింది.  స్కూళ్లో పెట్టే టెస్టుల్లో అర మార్కు తగ్గినా క్లాస్‌లో అందరి ముందూ నిలబెట్టడం, చులకనగా మాట్లాడటం, నిందించడం మొదలయ్యాయి. ఇంట్లోనూ ఇంకా  మంచి మార్కులు రావాలి అనే హెచ్చరికలు ఎక్కువయ్యాయి. దీంతో సుజీ భయపడిపోయింది. ఆ ఆందోళన ఆమెకు పుస్తకాలు అన్నా, స్కూల్ అన్నా భయం పుట్టేలా చేసింది. అది అనారోగ్యం రూపంలో కలవరపెడుతోంది.
       
వర్థ్ధన్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఈ మధ్య ఇంట్లో చిన్న అసౌకర్యానికి కూడా విపరీతంగా చికాకు పడుతున్నాడు. గట్టి గట్టిగా అరుస్తున్నాడు.

ఇదీ విషయం:  టాప్ ర్యాంక్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు వర్థన్. చదువుతున్నాడు కానీ, ధ్యాసంతా మార్కుల మీదే ఉంటోంది. పరీక్షల టైమ్ దగ్గరపడుతోంది. చదివింది గుర్తుండటం లేదు. గుర్తున్నది సరిగా రాస్తానో లేదో అనే సందేహం. ఈ భయం వల్ల చదువుకి ప్రతీది అడ్డంకిగా ఉంది అనుకుంటున్నాడు. దాని వల్ల త్వరగా చిరాకు పడుతున్నాడు. అసహనంగా ఉంటున్నాడు.     
       
కుక్క-మేక...

ఒకతను మేకను పట్టుకుని తీసుకెళుతూ ఉంటే, దారిలో చూసిన వారు ‘కుక్కను తీసుకెళుతున్నావేంటి?’ అని అడుగుతూ ఉన్నారట. మొదట కొందరికి ‘మేకనే తీసుకెళుతున్నాను’ అని ధైర్యంగా చెప్పిన ఆ వ్యక్తిలో పది మంది ఒకే విధంగా చెప్పేసరికి తను తీసుకెళుతున్నది కుక్కనే అనుకొని ఆ మేకను వదిలేశాట్ట. పరీక్షల భయం కూడా నేడు అలాగే ఉంది. పిల్లలు చిన్నప్పటి నుంచి పరీక్షలు రాస్తున్నారు. వాళ్లు బాగానే రాస్తారు. కానీ, స్కూల్లో టీచర్లు, ఇంట్లో పెద్దవాళ్లు ‘ఎగ్జామ్స్ వస్తున్నాయి. బాగా రాయాలి. అందుకు బాగా చదువు. పరీక్షలు అంటే భయం లేకపోతే ఎలా?’ ఇలాంటి మాటలు అందరినోటా వినీ వినీ నిజంగానే పరీక్షలను వదిలేసి భయాన్ని వెంట తెచ్చుకుంటున్నారు. దీన్నే ‘క్రియేటెడ్ ఫియర్’ అంటారు.

కూరలో ఉప్పు అంత...

టెన్షన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అయితే ఆ ఆందోళన కూరలో ఉప్పు ఎంత ఉండాలో అంత ఉంటేనే సరైన ఫలితం లభిస్తుంది. కానీ, నేడు అది మోతాదును మించుతోంది. పిల్లల్లో పరీక్షలు అంటే కొంత ఆందోళన ఎలాగూ ఉంటుంది. దానికి తోడు ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు ‘పరీక్షలు వస్తున్నాయి. బాగా చదవాలి, బాగా రాయాలి’ అని పెట్టే ఒత్తిడుల ఆందోళన మోతాదు పెరుగుతోంది. మోతాదు మించిన ఒత్తిడి జ్ఞాపకశక్తి మీద దుష్ర్పభావం చూపిస్తుంది. తగ్గిన జ్ఞాపకశక్తి చదివింది గుర్తుంచుకోలేకపోతోంది.
 
పండగ వచ్చిందని...

రోజూ కన్నా పండగ రోజున ఎక్కువ కష్టపడతాం. కానీ, సంతోషంగా ఉంటాం. అందుకే ఆ పండగను అంత బాగా ఆనందించగలం. పరీక్షలు కూడా పండగలాంటివే! ‘రోజూ చదువుతాం. పరీక్షల రోజుల్లో ఇంకాస్త ఎక్కువ చదువుతాం. కనుక పండగరోజున సంతోషంగా ఎలా ఉంటామో అలాగే ఉండాలి’ అనే విషయాన్ని పిల్లలకు చెప్పాలి. అలా ఒత్తిడి దృష్టిని మరల్చాలి.

నేటి పిల్లలు ‘మా అమ్మ కోసం, మా నాన్న కోసం, లేదంటే స్కూల్ కోసం... అనే భావనతో చదువుతున్నారు. దీని వల్ల చదివే అంశం మీద ఆసక్తి ఉండటం లేదు. ‘ఎవరి కోసమో కాదు, నీ కోసమే నువ్వు చదువు. పక్కనవారితో కాదు నీతోనే నువ్వు పోటీపడు’ అనే మాటలు పిల్లల మీద బాగా పనిచేస్తాయి.
     
‘పాజిటివ్ సెల్ఫ్ థింకింగ్’ ఎప్పుడూ మంచి ప్రయోజనాలను ఇస్తుంది. అంటే మనతో మనం మాట్లాడుకోవాలి. ‘నేను చేయగలను, నా మీద నాకు నమ్మకం ఉంది. కష్టపడ్డాను కాబట్టి బాగా రాస్తాను’... ఇలా పిల్లలు ఎవరికి వారు తమకు తామే చెప్పుకోవడం వల్ల 100 శాతం ప్రయత్నిస్తారు. ఈ భావనను పెద్దలే పిల్లల్లో కలగజేయాలి.

విశ్రాంతి పొందే ఉపాయాలు...

బాగా నిద్రపోతే విశ్రాంతి లభిస్తుందని అర్థం కాదు. శరీరం, మైండ్ - రెండూ విశ్రాంతి పొందేలా మన చర్యలు ఉండాలి. ఒత్తిడి పెరిగినట్టుగా అనిపిస్తే అరికాళ్లు, అరిచేతులు చల్లని నీళ్లతో కడుక్కోమని చెప్పాలి. చదవడానికి ముందు, తర్వాత 5 సార్లు దీర్ఘశ్వాస తీసుకుంటూ, వదులుతూ ఉండాలి. ఇలా పది నిమిషాలు చేస్తే త్వరగా విశ్రాంతి లభిస్తుంది. అలాగే చదవడానికి ముందు తర్వాత కాళ్లూ చేతులు ఒంచుతూ శరీరాన్ని కొద్దిగా స్ట్రెచ్ చేయాలి. అప్పుడు మైండ్ చురుకు అవుతుంది.  కంప్యూటర్‌లో సిపియుకి, మానిటర్‌కి మధ్య ఒక కేబుల్ కనెక్షన్ ఉంటుంది. ఇది ఏ ఎలుకో కట్ చేస్తే.. సిస్టమ్ పనిచేయదు. అలాగే భయం అనే ఎలుక వల్ల ఎంత బాగా చదివినా టైమ్‌కు గుర్తుకురాదు. భయానికి గల కారణాలు అన్వేషించి, వాటి నివారణ వైపు దృష్టి పెట్టాలి.
     
అందరిలోనూ మైండ్ పవర్ ఒకటుంటుంది. ఆ ‘పవర్’ (శక్తి) ఏంటో పిల్లలకు తెలియదు. ఊహాశక్తి, సృజనాత్మక శక్తి, మనో నేత్రంతో వీక్షించే శక్తి, క్లిష్ట పరిస్థితిలోనూ కలిగే ఆలోచనాశక్తి... ఇవన్నీ ఉంటాయి. ఈ శక్తిని ఉపయోగించుకోమని చెప్పాలి.ఎవరికి వారు ‘మైండ్ మ్యాప్’ను ఒకటి తయారుచేసుకోవాలి. చదవదగినది, చదువుతున్నది, చదివినది.. ఇలా విభజించుకుంటూ ఆ మైండ్ మ్యాప్ ఉండాలి.  {పశ్నలు-సమాధానాలు వరుసగా చదువుకుంటూ వెళ్లిపోతే గుర్తుండవు. అందులో ముఖ్యమైన పాయింట్స్‌ను లిస్ట్ చేసుకోవాలి.
 - డా. గీతా చల్లా, సైకాలజిస్ట్
 www.sudishacounselingcentre.org
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement