caretaking
-
పిల్లలు ఎఫెక్ట్ అవుతారు
తల్లిదండ్రులూ.. కాస్త జాగ్రత్త. చిన్నారుల ఎదుట అస్తమానం కీచులాడుకుంటూ ఉండటం, తల్లిపై తండ్రి గృహహింసకు పాల్పడుతూ ఉండటం చిన్నపిల్లల మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. చిన్న వయసులో పసిపిల్లల ఎదుట తల్లిదండ్రుల కొట్లాటలూ, ఇంట్లో ఒకరినొకరు మానసికంగా హింసించుకోవడం జరుగుతుంటే... ఆ పిల్లలు పెద్దయ్యాక వాళ్లలో చాలా రకాల మానసిక రుగ్మతలు వచ్చే అవకాశముందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వెర్మాంట్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అలైస్ షేర్మెర్హార్న్ అంటున్నారు. అధ్యయనం కోసం ఆమె తొమ్మిది నుంచి పదకొండేళ్ల వయసున్న 99 మంది చిన్నారులను ఎంపిక చేశారు. వాళ్ల వాళ్ల భావోద్వేగ స్థాయిలను బట్టి ఆ సమూహాన్ని రెండు గ్రూపులుగా విభజించారు. ఆ తర్వాత వారికి రకరకాల భావోద్వేగాలతో ఉన్న జంటల ఫొటోలు చూపించారు. ఆ ఫొటోల్లోని జంటలు కొన్ని కోపంగా ఉంటాయి. మరికొన్ని సంతోషంగా ఉంటాయి. కొన్ని నార్మల్‌గా ఉంటాయి. ఆ ఫొటోలను చూసి ఆ జంటల తాలూకు వాస్తవ భావోద్వేగాలను పిల్లలు చెప్పాలి. అయితే తమ ఇళ్లలో తీవ్రమైన కీచులాటలు, పోట్లాటలను చూసే పిల్లలు ఫొటోల్లో కనిపించే భావోద్వేగాలను సరిగా గుర్తించలేకపోయారట! అంటే... వాళ్ల మెదడుల్లో భావోద్వేగాలను ప్రాసెస్ చేసే యంత్రాంగం దెబ్బతిన్నట్లు ఈ పరిశోధన తెలుపుతోందని అధ్యయనవేత్తలు అంచనావేశారు. ఈ అధ్యయన ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్స్ అనే సంచికలో ప్రచురితమయ్యాయి. -
యథా పేరెంట్స్... తథా కిడ్స్
కేరెంటింగ్ పిల్లల మనసు అద్దంలాంటిది. పెద్దవాళ్లు ఎలా ప్రవర్తిస్తారో, పిల్లలు కూడా అలాగే ప్రవర్తించడం పరిపాటి. అయితే చాలామంది తలిదండ్రులు దీనిని గ్రహించరు. పిల్లల ముందే నోటికొచ్చినట్లు అబద్ధాలు చెబుతారు. ఇరుగూ పొరుగూ గురించి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తారు. వారి తలిదండ్రులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. పనివారిని, తక్కువ స్థాయి వారిని చులకనగా చూస్తారు. రోడ్డు మీదనో, ఆటోల్లోనో, బస్సుల్లోనో నగలు, నగదు, సెల్ఫోన్లు వంటివి దొరికితే ఇంటికి పట్టుకొచ్చి గొప్పగా చూపించుకుంటారు. అవతలి వారిని తక్కువ చేసి మాట్లాడతారు. ఆ వస్తువులూ, ఈ వస్తువులూ కొని డబ్బు దుబారా చేస్తారు. టీవీల్లో చెత్త ప్రోగ్సామ్స్‌ను చూసి ఎంజాయ్ చేస్తారు. బాస్‌లను నోటికొచ్చినట్లు తిట్టుకుంటారు. వడ్డించుకున్న పదార్థాలను పారవేస్తారు. ప్లేట్లూ, గ్లాసులూ విసిరికొడతారు. తమ కోపాన్ని ఇతరుల మీద చూపిస్తారు. ఎవరి గురించీ ఒక్క మంచి మాట కూడా చెప్పడానికి, వినడానికీ ఇష్టపడరు. తాము ఇవన్నీ చేస్తూ, తమ పిల్లలు తమ మాట సరిగా వినట్లేదనీ, సరిగ్గా చదవట్లేదనీ అందరితో చెప్పుకుని వాపోతుంటారు. ‘నువ్వు ఏ విత్తు నాటితే ఆ చెట్టే మొలుస్తుంది’ అని బైబిల్లోనూ ఉంది, ఖొరాన్ అదే చెబుతుంది, గీతాకృష్ణుడూ అదే బోధించాడు. వేపవిత్తనం నాటి, దాని నుంచి మామిడి చెట్టు మొలిచి, పండ్లూ ఫలాలూ ఇవ్వట్లేదని బాధపడటం ఎంత అవివేకమో, మనం సరిగా ప్రవర్తించకుండా మన పిల్లలు చెడిపోతున్నారని బాధపడటం అంత కన్నా అహేతుకం.ముందు మనం సత్ప్రవర్తనతో మెలుగుదాం... అప్పుడు మన పిల్లలూ మన అడుగుజాడల్లో నడుస్తారు. -
కొసరి కొసరి నేర్పించండి
కేరెంటింగ్ నేటి బాలలే రేపటి పౌరులు. అయితే, నేటి బాలలను ఉత్త పౌరులుగా కాకుండా, ఉత్తమ పౌరులుగా తయారు చేయవలసిన బాధ్యత మన మీదనే ఉంది. అందుకు ఏం చేయాలంటే... పెద్దలు ఎలా ప్రవర్తిస్తే పిల్లలు అలా తయారవుతారు. అందుకే ముందు మనం హుందాగా, నీతి నిజాయితీలతో నడుచుకుంటూ ఉంటే వారు మన నుంచి ఆ మంచిని అలవర్చుకుంటారు.పెద్దలను గౌరవించడం, చిన్నవారితో ప్రేమగా నడుచుకోవడం, తోటివారితో స్నేహంగా మసలుకోవడం ముందు మన నుంచే మొదలు కావాలి.బాల్యం నుంచీ చిన్నారులకు నీతికథలు, రామాయణ, భారత, భాగవతాలు, దేశభక్తి కథలు, ఈసప్ టేల్స్ వంటివి చెప్పడం వల్ల వారికి నైతికత అలవడుతుంది. సృజనాత్మకంగా తయారవుతారు. ఇంటినీ, ఒంటినీ, పరిసరాలనూ ఎలాగైతే పరిశుభ్రంగా ఉంచుకుంటామో... వీధులను, రోడ్లను కూడా అదేవిధంగా శుభ్రంగా ఉంచడం అవసరమనే విషయాన్ని వారికి తెలియజెప్పండి. వీధి దీపాలు, వీధి పంపులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వంటి వాటిని దుర్వినియోగం చేయకుండా, వాటిని కాపాడటాన్ని బాధ్యతగా గ్రహించేలా చేయాలి. విద్యుత్ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, ఇంటిపన్ను, ఆస్తి పన్ను వంటి వాటిని సకాలంలో చెల్లించటం ఎంత అవసరమో చెబుతూ, మంచి పౌరునికి ఉండవలసిన లక్షణాలేమిటో వారంతట వారే తెలుసుకునేలా చేయండి.హింస, అశ్లీలత ఉండే సినిమాలు, టీవీ సీరియల్స్ వంటివి చూడకుండా జాగ్రత్త పడండి.ఆపదలో ఉన్నవారికి సాయం చేయటం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరంలో ఉన్న వారికి సాయపడటంలో ఉన్న ఆనందాన్ని వారు అనుభవించేలా చేయండి. -
ఫస్ట్ ర్యాంకు రావాలా?! ప్రణాళిక తప్పనిసరి
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... కిరణ్‌కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ ప్రసారం అయ్యే సమయంలో టీవీకి అతుక్కుపోయి చుట్టూ ఉన్న ప్రపంచం మర్చిపోతాడు. పదవ తరగతి హాఫ్ ఇయర్లీలో మంచి మార్కులు వచ్చినా, ప్రీ ఫైన ల్లో అన్నీ సబ్జక్టులూ ఫెయిలయ్యాడు. తల్లిదండ్రులు భయపడిపోయారు. పదవ తరగతి ఫెయిలైతే ఇక భవిష్యత్తు ఎలా? అని ఆలోచించి ఒక సైకాలజీ కౌన్సిలర్ వద్దకు తీసుకెళ్లారు. ‘‘నీకు క్రికెట్ ఆట మీద చక్కని అవగాహన ఉంది కదా! ఈసారి కప్ ఎవరికి వస్తుందో తెలుసా?’ అనడిగాడు కౌన్సిలర్. అక్షరాలా ఆ అబ్బాయి ఊహించిన టీమే వరల్డ్ కప్ సాధించింది. జ్ఞానాన్ని బదిలీ చేయవచ్చు... సైకాలజీలో ‘ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రైనింగ్’ అనే అధ్యాయం ఉంది. అంటే మనకు తెలిసిన ఒక సబ్జక్టులోని జ్ఞానాన్ని మరొక సబ్జక్టులోకి బదిలీ చేయవచ్చు. ఉదాహరణకు సైకిల్ నేర్చుకున్న అబ్బాయి మోటార్‌సైకిల్ సునాయాసంగా నేర్చుకోగలడు. తెలుగు బాగా చదివే అబ్బాయి కన్నడ భాష కూడా త్వరగా నేర్చుకోగలడు. అదే విషయాన్ని కౌన్సిలర్ ఆ అబ్బాయికి చెప్పి, క్రికెట్ మీద ఉన్న జ్ఞానాన్ని చదువు మీదకు మళ్లించేలా కొన్ని సజెషన్లు ఇచ్చారు. సహజంగా తెలివైనవాడు కావటం, వ్యూహ ప్రతివ్యూహాలు గుర్తించగలిగే ప్రజ్ఞ ఉండటంతో త్వరగానే నేర్చుకున్నాడు. కిరణ్‌కి పరీక్షల ప్రణాళికలను ఇలా తయారు చే సి ఇచ్చారు కౌన్సిలర్ - 1. ప్రణాళిక, పరీక్షల తేదీలు; 2. చదువుకునే సమయం; 3. సబ్జక్టులు చదివే క్రమం (కష్టమైనవి ముందు చదవాలి); 4. వివరణలు - విశ్లేషణలు (తెలియని విషయాలు టీచర్లను అడిగి తెలుసుకోవాలి); 5. కొండగుర్తులు, బండగుర్తులు లాంటివి బట్టీ పట్టవచ్చు. (ఉదా: యమాతారాజభానస, నజభజజజర); 6. పద్యాలు, పెద్దల నిర్వచనాలు (డెఫినిషన్స్) బట్టీ పట్టాలి; 7.ప్రశ్నలు - సమాధానాలు బట్టీ పట్టకూడదు; 8. ఒక్క ప్రశ్నను ఎన్ని కోణాల్లో అడగవచ్చో విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు (్చ+ఛ)2 ఎంత అని అడగవచ్చు. లేదా ్చ2+ఛ2+2్చఛ=? అని కూడా అడగవచ్చు. రెండేళ్ల క్రితం ఇంటర్మీడియట్ ఫిజిక్స్‌లో ప్రశ్నలు కొంచెం మార్చి ఇవ్వటంలో ప్రశ్నలను బట్టీ పట్టినవారు ఖంగుతిన్నారు. 9. ప్రతి ప్రశ్నకూ సమాధానం చదివి దానిలోని ‘కీపాయింట్స్’ని ప్రత్యేకంగా నోట్సులో రాసుకోవాలి. వీటినే బులెట్ పాయింట్స్ అంటారు. కుల పరమైనవి మత పరమైనవి ప్రాంతీయ పరమైనవి నిరక్షరాస్యత మహిళల స్థితిగతులు బాలల హక్కులు- బాలకార్మికులు చట్టం - సమాజం అవినీతి పరులు ఈ పాయింట్స్‌ని బాగా వివరించి సొంతంగా రాయాలి. ఉదాహరణకు అవినీతి అంటే అందులో లంచగొండులు, అవినీతిపరులు, మాదకద్రవ్యాలు అమ్మేవారు, స్మగ్లింగ్ చేసేవారు, నేరాలు చేసేవారు.. ఇలా మీరు అనేక విషయాలు రాయవచ్చు. రోజూ పేపర్ చదివితే ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. ఆ తాజా ఉదాహరణలు రాస్తే, పేపరు దిద్దే వారికి కూడా అభ్యర్థిపై అభిమానం కలుగుతుంది. 10. స్వయం పరీక్ష: చాలామంది స్టూడెంట్స్ పరీక్ష రాయబోయే ముందు కూడా గబగబా చదివేస్తూ ఉంటారు. ఆటోల్లో, బస్సులో, చెట్ల క్రింద నాన్‌స్టాప్‌గా చదువుతారు. ఇది నిరర్థక విజయం సాధించటం లాంటిదే. చదివిన ఆ విషయాలు అప్పటికి మాత్రమే గుర్తుంటాయి. అందుకే దీనిని విరుగుడు స్వయంపరీక్ష అంటారు. అంటే ఇంట్లో చదివిన తరువాత, బాగా మననం చేసుకుని, పేపరుమీద ముఖ్యాంశాలు రాసుకోవాలి. అంటే టీవీలో న్యూస్ చదివేవారు ముందుగా ముఖ్యాంశాలు చెప్తారు తరువాత వివరాల్లోకి వెళ్తారు. అలాగే మీరు కూడా ముఖ్యాంశాలను పేపరు మీద రాయాలి. 11.ఒత్తిడి నిర్వహణ: ఇది చాలా అవసరం. పరీక్షలంటే ఒత్తిడి కొంచెం ఉండాలి. అది మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి. అందుకు రోజూ ఉదయం పది నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామం లాంటి సాధన చేస్తే చాలు. ఇది మీ టీచర్లు లేదా పెద్దలను ఎవరిని అడిగినా చెప్పగలరు. పరీక్షల టెన్షన్ విడిచిపెట్టి ఇంట్లో వాళ్లతో సరదాగా కబుర్లు చెప్పాలి. నవ్వుతూ ఉండాలి. అలాగని చెప్పి టీవీలు, ఫోను కబుర్లు వద్దు. వీలైతే సుడోకు, రూబిక్స్క్యూబ్ లాంటివి చేయవచ్చు. దీనివల్ల రివిజన్ సామర్థ్యం పెరుగుతుంది. ఇవి చాలా మంచి ఫలితాలనిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. 12. పాజిటివ్ థింకింగ్: ఇది అత్యవసరం. అన్నీ బాగా జరుగుతాయి. అన్నీ మంచి శకునములే అంటూ సానుకూల వైఖరిని అలవాటు చేసుకోవాలి. అంటే ‘నేను పదవతరగతి ఫస్ట్ ర్యాంకులో పాసవుతాను’ అని కాకుండా లక్ష్యాన్ని పొడిగించి సజెషన్లు ఇచ్చుకోవాలి. అంటే నేను గొప్ప డాక్టర్ని అవుతాను, గొప్ప ఇంజనీరు, గొప్ప సైంటిస్టు, గొప్ప చార్టర్డ్ అకౌంటెంట్ అవుతాను... అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు ఆటోమేటిగ్గా పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అన్నీ అందులో వచ్చేస్తాయి. దీనికో కథ ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒక నిరుపేద జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలని అడవికి వెళ్లాడు. ఆ విషయం తెలుసుకున్న ఒక మునీశ్వరుడు ‘‘మూర్ఖుడా! ఆత్మహత్య అనేది బలహీనత. తాత్కాలిక సమస్యని వదిలించుకునే శాశ్వత పరిష్కారం. ఆత్మహత్య చేసుకోవటానికి చాలా ధైర్యం కావాలి. నువ్వు భగవంతుడిని ప్రార్థించు నీ కష్టాలు తొలగిపోతాయి’’ అని సలహా ఇచ్చాడు. ‘‘అయ్యా నాకున్నది ఒక కష్టం కాదు. మూడు కష్టాలున్నాయి. మొదటిది పేదరికం. రెండవది నా భార్య ఆరోగ్యం బాగా లేదు. మూడవది నాకు పిల్లలు లేరు. దేవుడిని ఏ కోరిక కోరాలి?’’ అన్నాడు. ‘‘ముందు, ఏకాగ్రతతో ప్రార్థించు. తరువాత ఆలోచనలు అవే వస్తాయి’’ అన్నాడు మునీశ్వరుడు. ‘‘సరే’’నని తపస్సు ప్రారంభించాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ‘‘నీకు ఒక్కటే వరం ఇస్తాను. ఏది కావాలో కోరుకో’’ అన్నాడు. ఏకాగ్రతతో తపస్సు చేయడంలో చక్కని ఆలోచన వచ్చింది. ‘‘దేవుడా! నా భార్య తన మనవడిని బంగారు ఊయలలో ఊపేలా ఆశీర్వదించండి’’ అనడిగాడు. సరేనన్నాడు దేవుడు. విద్యార్థులంతా ఈ కథ ద్వారా గమనించాల్సింది ఏంటంటే.. ఆ ఒక్క కోరికలోనే మూడు కోరికలు కలిసి ఉన్నాయి అనే విషయం. మీ లక్ష్యం కూడా అలాగే ఉండాలి. ఈ ప్రణాళికను పాటించి, పదవ తరగతిలో ఫస్ట్ క్లాస్‌లో రాణించిన కిరణ్ ఇప్పుడు వరంగల్‌లో ‘ఎన్ఐటి’ కళాశాలలో ఉన్నత చదువులు చదువుతున్నాడు. - డా.బి.వి.పట్టాభిరామ్, సైకాలజిస్ట్, bvpattabhiram@yahoo.com ఫోన్: 040-23233232, 23231123 -
పాజిటివ్ వైపు పరుగులు...
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... కావ్య క్లాసులో ఎప్పుడూ టాపర్. టీచర్లు కూడా కావ్యని ఎప్పుడూ మెచ్చుకుంటూంటారు. అటువంటి కావ్యకి పదవతరగతి పరీక్షల తేదీ ప్రకటించినప్పటి నుండి దిగులు పట్టుకుంది. తెలియని భయంతో ఏడవడం, ఒంటరిగా కూర్చుని శూన్యంలోకి చూడటం, క్లాసు అయ్యాక కూడా దిగులుగా క్లాసులోనే కూర్చుండిపోవడం చూసి టీచర్లు తల్లిదండ్రులకు చెప్పారు. ఇంటికి తీసుకెళ్లాక ఎంత బతిమాలినా కావ్య నోరు విప్పలేదు. చివరకు తల్లి రహస్యంగా ‘ఎవరైనా ఏదైనా అన్నారా?’ లాంటివి అడిగినా ‘ఛీ ఛీ అలాంటిదేమీ లేదు’ అని ఖండితంగా చెప్పేసింది. చేసేది లేక, ఒక పెద్దాయనకు చూపించారు. ఆయన ఒక తావీదు కట్టాడు. అయినా ఆమె భయం పోలేదు. భయం ఎందుకంటే... ‘పరీక్షలు దగ్గరపడుతున్నాయి. నేను పాసవుతానో లేదో?’‘పాస్ అయినా.. మార్కులు తక్కువ వస్తే?’ ‘సిలబస్‌లో లేని ప్రశ్నలు వస్తే ఏం చేయాలి?’ ‘ఒకవేళ నేను బాగా రాసిన పేపర్‌ను మరెవరికో మార్చి, వాళ్ల పేపరు మీద నా నంబరువేస్తే?’ ఇలాంటి భయాలతో మానసిక ఒత్తిడిని పెంచుకుంటుంటారు పిల్లలు. జీనియస్ సిండ్రోమ్... ఇలా ప్రతి చిన్నదానికి భయపడే తెలివైన స్టూడెంట్స్‌ని వేధించే ఈ రుగ్మతని ‘జీనియస్ సిండ్రోమ్’ అంటారు. తమ విజయాన్ని, తమ ర్యాంకుని మరొకరు కాజేస్తారేమోననే భయంతో ఉండే, ఈ స్టూడెంట్స్ నిరంతరం చదువు గురించే ఆలోచిస్తూ, అర్థం లేని ఆందోళన పెంచుకుంటారు. అటువంటి వారితో పాటు, ఇతరులకు కూడా పనికొచ్చే పరీక్షల చిట్కాలు... యుద్ధానికి వెళ్లడం లేదు... చాలా మంది పిల్లలు పరీక్షలు దగ్గర పడుతున్నకొద్దీ ఆందోళన పెంచుకుని, తమకి తామే నెగెటివ్ సజెషన్లు ఇచ్చుకుంటుంటారు. అవి అర్థం చేసుకున్న మనసు అనే సబ్ కాన్షస్ మైండ్ వాటిని అక్షరాలా అమలుపరుస్తుంది. కాబట్టి సరదాకి కూడా ‘నాకు ఫలానా సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తాయేమో’ అనకండి. ఎందుకంటే మీ సబ్కాన్షస్ మైండ్‌కి జోకులు అర్థం కావు. కాబట్టి ఎట్టి పరిస్థితిల్లోనూ భయంతో నెగెటివ్ సజెషన్స్ ఇచ్చుకోవద్దు. దానికి బదులు ‘నేను ఫస్ట్ క్లాసులో పాసవుతాను, నాకు 90 కన్నా ఎక్కువ మార్కులు వస్తాయి’ అని కనీసం రోజూ ఇరవై ఒకటి సార్లు అనుకోండి. ఇరవై ఒకటికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందుకే పుట్టిన బిడ్డకు 21 రోజుల తరువాత పేరు పెడతారు. యోగసాధనలో 21 పర్యాయాలు ఓంకారం ఉచ్చరిస్తారు. దానికి కారణం మన శరీరంలో 21 భాగాలు ఉంటాయి. అవేమిటంటే 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచవాయువులు, 5 పంచాగ్నులు, ఒకటి చిత్తం. అవన్నీ కలిపితే 21. అందుకే ఇప్పటి నుండి రోజూ 21 సార్లు పైవిధంగా అనుకుంటే గతంలో అనుకున్న నెగిటివ్ సజేషన్లకు చెల్లు అయిపోతుంది. ఇదేదో మూఢనమ్మకంగా కొట్టిపడేయకండి. ఇప్పుడు సైకాలజిస్టులు ఇదే విషయాన్ని అఊఊఐఖకఅఖీఐైూ (అఫర్మేషన్స్) అనే పేరుతో సాధన చేయిస్తున్నారు. దీని వలన మనసు పాజిటివ్ ఆలోచనలవైపు పరుగెడుతుంది. మర్చిపోవడం కూడా మంచిదే... ‘మాలతికి మతిమరుపు ఎక్కువ’ అని ఆమె తల్లి చెప్పింది. ఆ అమ్మాయి కూడా ‘అవును ఈ మధ్య ఏది చదివినా మర్చిపోతున్నాను. వారం రోజుల క్రితం చదివిన పాఠం ఇప్పుడు చదివితే అంతా కొత్తగా ఉంటోంది. నా మైండ్ పవర్ పూర్తిగా పోయింది. జ్ఞాపకశక్తికి ఏమైనా మందులున్నాయా?’ అని అడిగింది. ‘మందులేవీ లేవు. సరైన ఆహారం సక్రమంగా తీసుకుంటే చాలు. అది సరే నీకు ఏ విషయమూ గుర్తుండటం లేదా?’ అని అడిగితే- ‘అవును అస్సలు గుర్తుండటం లేదు’ అంది కాన్ఫిడెంట్‌గా! ‘సరే! నువ్వీ మధ్య ఏ సినిమా చూశావ్?’ అని అడిగితే - ‘సినిమాలా? అవి చూసి ఆరునెల్లయ్యింది. పదవతరగతిలోకి వచ్చాక మా పేరెంట్స్ సినిమాలు వద్దు అన్నారు’ అంది బుంగమూతితో. ‘పోనీలే, నువ్వు చూసిన ఆఖరు సినిమా ఏమిటి?’ అని అడిగితే- ‘గబ్బర్ సింగ్’ అంది ఠపీమని.ఆ సినిమాలో హీరో, హీరోయిన్, ఇతర పాత్రధారుల పేర్లు.. ఆ సినిమా ముందు నుండి చివరిదాకా కథ అంతా చెప్పింది.. మధ్య మధ్యలో కొన్ని డైలాగులతో సహా! అన్నీ విన్నాకా ‘ఆరునెలల క్రితం చూసిన సినిమా అక్షరాలా కళ్లకు కట్టినట్లు చెప్పావు. మరి క్రిందటి వారం చదివిన పాఠం గుర్తుండటం లేదు. అదెలా సాధ్యం?’ అని అడిగితే- ‘అదే నా సమస్య’ అంటూ నవ్వింది. తన జ్ఞాపకశక్తి గురించి తనకే ఆశ్చర్యం వేసింది. 6 ’ఖ’ టెక్నిక్... చదివింది మరచిపోతే.. వారికి ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది మొదటి ఖ చదివినప్పుడు పాఠంలోని అంతరార్థం అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పాఠాన్ని గతంలో విన్నారు. నోట్స్ కూడా రాసుకున్నారు. రెండవ ఖ వలన టెక్ట్స్ బుక్‌లోని బొమ్మలు, అర్థం కాని పదాలను అర్థాలు తెలుస్తాయి. మూడవ ఖతో పాఠం సారాంశం బోధపడుతుంది. 4వ ఖతో మీకు మీరు అప్పగించుకున్నట్లు అవుతుంది. 5వ ఖతో పాఠం గుర్తుంటుంది. 6వ ఖ అతి ముఖ్యమైనది. గుర్తున్నది పేపర్ మీద రాయాలి. పాఠం అంతా రాయనక్కర్లేదు. ముఖ్యాంశాలు చాలు. లేదా బుల్లెట్ పాయింట్స్ రాసుకుంటే చాలు. పరీక్షల ముందు ఆ బుల్లెట్ పాయింట్స్ చదివితే మీరు కూడా బుల్లెట్ వేగంతో పై తరగతిలోకి వెళ్లటం ఖాయం. - డా.బి.వి.పట్టాభిరామ్, సైకాలజిస్ట్, bvpattabhiram@yahoo.com ఫోన్: 040-23233232, 23231123 -
కష్టం అనుకుంటే సమస్యే..!!
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... సుధీర్ కిందటేడాది పదవ తరగతి చదివేవాడు. పరీక్షలు రాయకపోవడం వల్ల పై క్లాస్‌కు వెళ్లలేకపోయాడు. సుధీర్ మరీ టాపర్ కాదు, అలాగని మరీ బొత్తిగా చదవనివాడూ కాదు. మార్కులు కూడా మధ్యస్థంగా వచ్చేవి. టెన్త్ పరీక్షలు నెల రోజులు ఉన్నాయనగా ఇంట్లో ఒత్తిడి మొదలైంది. స్కూల్లో రివిజన్ల మీద రివిజన్లు ఎలాగూ ఉన్నాయి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక కాసేపు విశ్రాంతి కోసం టీవీ చూసినా, స్నేహితులతో మాట్లాడినా పేరెంట్స్ తిట్టేవారు. పరీక్షలు రేపట్నించి మొదలు అనగా సుధీర్ కనిపించకుండా పోయాడు. ఎక్కడెక్కడో వెతికారు ఇంట్లో వాళ్లు. రెండు-మూడు నెలలకు కాని అతని జాడ తెలియలేదు. కనిపించకుండా పోయిన కొడుకు దొరికినందుకు సంతోషించినా పరీక్షలు రాయక ఓ ఏడాది నష్టపోయిన విధం అటు తల్లిదండ్రులను, ఇటు సుధీర్‌ను బాధిస్తూనే ఉన్నాయి. ప్రణతికి ఈ మధ్య పరధ్యానం ఎక్కువైంది. చదువుతూ చదువుతూ ఎటో చూస్తూ కూర్చుంటుంది. తల్లి గద్దిస్తే మళ్లీ చూపు పుస్తకంపై పెడుతుంది. అది కూడా కాసేపే! సరిగ్గా తిండి తినడం లేదు. అదేమని అడిగితే ఆకలి లేదంటుంది. పరీక్షల సమయంలో డిస్టర్బెన్స్‌గా ఉంటుందని ఇంట్లో టీవీ కనెక్షన్ తీసేశారు. కొన్నాళ్ల పాటు ఫోన్, కంప్యూటర్ ఉపయోగించడానికి వీల్లేదని తండ్రి గట్టిగా హెచ్చరించాడు. పరీక్షల సమయానికి ప్రణతికి విపరీతమైన జ్వరం.. కాసేపు కూడా కూర్చోని చదివే స్థితి లేదు. పరీక్షలంటే కబళించడానికి వస్తున్న మహమ్మారిలా పిల్లలు భయపడుతుంటారు. కాదు కాదు వారిని పెద్దలే భయపెడుతుంటారు. అందుకే పిల్లలు పరీక్షల నుంచి పారిపోవడానికి వెనకాడరు. ఆందోళనతో అనారోగ్యం పాల్పడుతుంటారు. ఏడాదికోసారి వచ్చే పండుగల్లాంటివే ఈ పరీక్షలనీ, ఇవి కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చూసుకోవాలని పెద్దలే పిల్లలకు వివరించాలి. హెచ్చరికలు వద్దు... నూటికి నూరు శాతం తల్లిదండ్రులు చేసే తప్పిదాలలో ప్రధానమైనవి ‘పరీక్షలు దగ్గర పడ్డాయి జాగ్రత్త’, ‘బాగా రాయకపోతే అంతే’, ‘ఎలాగైనా ర్యాంకు వచ్చి తీరాలి’, ‘చదువుకి అయిన ఖర్చులు, పాసవకపోతే ఎంత నష్టమో’ తెలిపే వివరాలు ఏకరవు పెడుతుంటారు. అలాగే తెలిసినవారి పిల్లలు గతంలో సాధించిన విజయాలు, వారి కన్నా మెరుగైన ఫలితాలు రావాలనే మాటలు పిల్లల్లో అనుకోని భయాలను తెచ్చిపెడతాయి. ఇవన్నీ పిల్లల మెదళ్లపై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయి దాంతో పరీక్షలంటేనే భయమేసి, దీంతో ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనుకోకుండా తప్పించుకోవాలి అని చూస్తారు. ఫలితంగా పరీక్షల సమయానికి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడం, అనారోగ్యంతో పరీక్షలు రాయలేకపోవడం జరుగుతుంటుంది. శూన్యంలో చూపులా! పరీక్షల గురించి ఆలోచిస్తూ ఒక్కోసారి పిల్లలు శూన్యంలోకి చూస్తూ ఏదో లోకంలో ఉండిపోతారు. అది ‘పరీక్షలు బాగా రాయలేమేమో, మంచి మార్కులు రావేమో, ఫెయిల్ అవుతామేమో..’ అనే నెగిటివ్ థింకింగ్ కావచ్చు. టెన్షన్ వల్ల తిండి మీద ధ్యాస ఉండదు. ఆహారం ప్రభావం చదువు మీద చూపుతుంది. తినకపోతే నీరసం వల్ల చదవాలనిపించదు. ఎక్కువ తిన్నా అదే పరిస్థితి. అందుకని ఉదయం అల్పాహారం, పాలు, పళ్లరసం వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. రోజంతా పుస్తకాలు ముందేసుకొని కూర్చోమని కాకుండా పక్కన కూర్చుని సరదాగా మాట్లాడాలి. పరీక్షల ఫలితాల గురించి బెంగ అవసరం లేదని చెప్పాలి. నటించినా మేలే! పరీక్షలని పిల్లలు ఎలాగూ సీరియస్‌గా ఉంటారు. వారిని ఇంకా సీరియస్‌లో ఉంచకుండా మీకు నవ్వు రాకపోయినా సరే నవ్వు మొఖంతో నటించండి. మీ నవ్వు మొఖం చూస్తే పిల్లలకు కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. రోజూ రాత్రి పూట కాసేపు కబుర్లు చెప్పి, తర్వాత పడుకోమని చెప్పండి. చదివేదేదో తెల్లవారుజామున లేపి చదివించండి. ఆ టైమ్‌లో పరీక్షలో ఏమొస్తాయో చెప్పమని ప్రశ్నలు వేయడం మంచిది కాదు. పిల్లలు ఏవైనా అడిగిన సందేహాలకే సమాధానాలు ఇవ్వండి. రోజంతా చదవాల్సిన అవసరం లేదు. రెండేసి గంటల చొప్పున మూడు, నాలుగుసార్లు విభజించుకొని చదివితే మెదడు కూడా చదివినది జ్ఞాపకం ఉంచడానికి సహకరిస్తుంది. 5సిలకు దూరం దూరం... పరీక్షల సమయంలో మనసుని దారి తప్పించే సెల్‌ఫోన్, కేబుల్ టీవీ, క్రికెట్, సినిమా, చాటింగ్.. లు ప్రధానమైనవి. వీటిని నిర్దాక్షిణ్యంగా ‘కట్’ చేస్తున్నామని చెప్పకుండా వాటి వల్ల కలిగే నష్టం, పరీక్షల తర్వాత తిరిగి ఇచ్చే సదుపాయాల గురించి తెలియజేయండి. పూర్తిగా తీసివేయడం కాకుండా, సాధ్యమైనంత వరకు గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉండటం మేలు అని సూచించండి. చదువుతున్న రూమ్‌లో గోడల మీద పోస్టర్లు, క్యాలెండర్లు ఏవీ లేకుండా ఉంటే మంచి ఫలితం ఉంటుంది. లేదంటే సినీనటులు, క్రికెటర్ల క్యాలెండర్లు, బొమ్మలు చూడగానే మైండ్ చదువు నుంచి డైవర్ట్ అవుతుంది. చదువులో అద్భుతాలు... చదవాలి. ప్రశ్నలు వేసుకోవాలి. మళ్లీ చదవాలి. మనసులో వల్లెవేసుకోవాలి. మనసులో నిక్షిప్తం చేసుకోవాలి. కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలి. గుర్తు తెచ్చుకోవాలి. చదివిన దాన్ని పేపరు మీద రాయాలి. ఇలా చేస్తే ఎవరైనా చదువులో అద్భుతాలు చేయవచ్చు. ఈ సూచన హెచ్చరికగా కాకుండా క్రమంగా అలవాటు పడేలా చేయాలి. ఈ కాలం విద్యార్థుల నోట వినిపించే సాధారణ మాట ‘చాలా కష్టపడి చదువుతున్నాను. అయినా ర్యాంకు రావడం లేదు’ అని. నిజం చెప్పాలంటే ‘కష్టం’ అనే మాట అనుకోగానే అదొక సమస్య అనే సజేషన్ సబ్కాన్షస్మైండ్కి చేరుతుంది. దాంతో సమాచార రవాణాలో కొంత అంతరాయం ఏర్పడుతుంది. అందుకే కష్టపడుతున్నాను అనకూడదు. ఇష్టపడి చదువుతున్నామనుకుంటే అంతా సుఖమే. అదే టీవీ చూడ్డం, క్రికెట్, ఫ్రెండ్స్, సినిమాలు, సరదాలు.. ఇవన్నీ ఇష్టపడి చేస్తున్న పనులు అవడం వల్ల సమాచార రవాణాలో అంతరాయం లేదు. అనుకున్న టైమ్‌కి అవి వెంటనే గుర్తుకు వస్తాయి. అందుకే కష్టపడి చదవద్దు-ఇష్టపడి చదవమని చెప్పాలి. టీచర్ పాత్ర ఇంట్లో వద్దు... పరీక్షల సమయంలో తల్లి పాత్ర అధికంగా ఉంటుంది. ‘చదువు, చదువు’ అంటూ టీచర్లా పదే పదే అంటూ ఉంటే పిల్లలకు విసుగు పుట్టవచ్చు. అందుకని టీచర్ పాత్ర పోషించనని ప్రతి తల్లి తనకు తానే ఒట్టుపెట్టుకోవాలి. (ఇది బాగా చదువుకుంటున్నవారి విషయంలో మాత్రమే). చివరగా... రాయబోయే పరీక్షలోని ప్రశ్నలన్నీ తాము చదివిన పుస్తకాల్లోనే ఉంటాయనే సత్యం ప్రతి ఒక్క విద్యార్థి గ్రహిస్తే చాలు. ఆందోళన లేకుండా ఆనందంగా పరీక్షలను పూర్తిచేస్తారు. - డా.బి.వి.పట్టాభిరామ్, సైకాలజిస్ట్, ప్రశాంతి కౌన్సెలింగ్ - హెచ్.ఆర్.డి సెంటర్, హైదరాబాద్ -
భయం మోసుకువచ్చే మార్కులెన్ని..?
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... పరీక్షల కాలం దగ్గరపడుతోంది. ఇంట్లో పెద్దలు చదివిస్తున్నారు. స్కూళ్లో టీచర్లు చదివిస్తున్నారు. అయినా పిల్లల్లో ఆందోళన రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎప్పుడు చదివింది అప్పుడే మర్చిపోయినట్టుగా ఉంది. ఎందుకిలా? పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు ఉండే ఈ సమస్యను అధిగమించేదెలా?! సుజి పదవ తరగతి చదువుతోంది. స్కూల్లో ఎప్పుడూ టాపర్‌గా ఉండి అందరి ప్రశంసలూ అందుకునేది. ఈ మధ్య తరచూ కడుపునొప్పి, తలనొప్పి అని విలవిల్లాడిపోతోంది. ‘పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అమ్మాయి పరిస్థితి ఇలా ఉంది’ అని ఇంట్లో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇదీ విషయం: పరీక్షల ముందు రోజుల్లో పిల్లల ప్రవర్తన ఉన్నట్టుండి మారిపోతుంటుంది. దానిని అర్థం చేసుకునేందుకు పెద్దలు తీరిక చేసుకోక తప్పదు. ఎప్పుడూ టాపర్‌గా ఉండే సుజి ప్రవర్తన పరిశీలిస్తే పిల్లల మధ్య పోటీయే కాదు, పాఠశాలల మధ్యా ర్యాంకుల పోటీ పెరిగింది. స్కూళ్లో పెట్టే టెస్టుల్లో అర మార్కు తగ్గినా క్లాస్‌లో అందరి ముందూ నిలబెట్టడం, చులకనగా మాట్లాడటం, నిందించడం మొదలయ్యాయి. ఇంట్లోనూ ఇంకా మంచి మార్కులు రావాలి అనే హెచ్చరికలు ఎక్కువయ్యాయి. దీంతో సుజీ భయపడిపోయింది. ఆ ఆందోళన ఆమెకు పుస్తకాలు అన్నా, స్కూల్ అన్నా భయం పుట్టేలా చేసింది. అది అనారోగ్యం రూపంలో కలవరపెడుతోంది. వర్థ్ధన్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఈ మధ్య ఇంట్లో చిన్న అసౌకర్యానికి కూడా విపరీతంగా చికాకు పడుతున్నాడు. గట్టి గట్టిగా అరుస్తున్నాడు. ఇదీ విషయం: టాప్ ర్యాంక్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు వర్థన్. చదువుతున్నాడు కానీ, ధ్యాసంతా మార్కుల మీదే ఉంటోంది. పరీక్షల టైమ్ దగ్గరపడుతోంది. చదివింది గుర్తుండటం లేదు. గుర్తున్నది సరిగా రాస్తానో లేదో అనే సందేహం. ఈ భయం వల్ల చదువుకి ప్రతీది అడ్డంకిగా ఉంది అనుకుంటున్నాడు. దాని వల్ల త్వరగా చిరాకు పడుతున్నాడు. అసహనంగా ఉంటున్నాడు. కుక్క-మేక... ఒకతను మేకను పట్టుకుని తీసుకెళుతూ ఉంటే, దారిలో చూసిన వారు ‘కుక్కను తీసుకెళుతున్నావేంటి?’ అని అడుగుతూ ఉన్నారట. మొదట కొందరికి ‘మేకనే తీసుకెళుతున్నాను’ అని ధైర్యంగా చెప్పిన ఆ వ్యక్తిలో పది మంది ఒకే విధంగా చెప్పేసరికి తను తీసుకెళుతున్నది కుక్కనే అనుకొని ఆ మేకను వదిలేశాట్ట. పరీక్షల భయం కూడా నేడు అలాగే ఉంది. పిల్లలు చిన్నప్పటి నుంచి పరీక్షలు రాస్తున్నారు. వాళ్లు బాగానే రాస్తారు. కానీ, స్కూల్లో టీచర్లు, ఇంట్లో పెద్దవాళ్లు ‘ఎగ్జామ్స్ వస్తున్నాయి. బాగా రాయాలి. అందుకు బాగా చదువు. పరీక్షలు అంటే భయం లేకపోతే ఎలా?’ ఇలాంటి మాటలు అందరినోటా వినీ వినీ నిజంగానే పరీక్షలను వదిలేసి భయాన్ని వెంట తెచ్చుకుంటున్నారు. దీన్నే ‘క్రియేటెడ్ ఫియర్’ అంటారు. కూరలో ఉప్పు అంత... టెన్షన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అయితే ఆ ఆందోళన కూరలో ఉప్పు ఎంత ఉండాలో అంత ఉంటేనే సరైన ఫలితం లభిస్తుంది. కానీ, నేడు అది మోతాదును మించుతోంది. పిల్లల్లో పరీక్షలు అంటే కొంత ఆందోళన ఎలాగూ ఉంటుంది. దానికి తోడు ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు ‘పరీక్షలు వస్తున్నాయి. బాగా చదవాలి, బాగా రాయాలి’ అని పెట్టే ఒత్తిడుల ఆందోళన మోతాదు పెరుగుతోంది. మోతాదు మించిన ఒత్తిడి జ్ఞాపకశక్తి మీద దుష్ర్పభావం చూపిస్తుంది. తగ్గిన జ్ఞాపకశక్తి చదివింది గుర్తుంచుకోలేకపోతోంది. పండగ వచ్చిందని... రోజూ కన్నా పండగ రోజున ఎక్కువ కష్టపడతాం. కానీ, సంతోషంగా ఉంటాం. అందుకే ఆ పండగను అంత బాగా ఆనందించగలం. పరీక్షలు కూడా పండగలాంటివే! ‘రోజూ చదువుతాం. పరీక్షల రోజుల్లో ఇంకాస్త ఎక్కువ చదువుతాం. కనుక పండగరోజున సంతోషంగా ఎలా ఉంటామో అలాగే ఉండాలి’ అనే విషయాన్ని పిల్లలకు చెప్పాలి. అలా ఒత్తిడి దృష్టిని మరల్చాలి. నేటి పిల్లలు ‘మా అమ్మ కోసం, మా నాన్న కోసం, లేదంటే స్కూల్ కోసం... అనే భావనతో చదువుతున్నారు. దీని వల్ల చదివే అంశం మీద ఆసక్తి ఉండటం లేదు. ‘ఎవరి కోసమో కాదు, నీ కోసమే నువ్వు చదువు. పక్కనవారితో కాదు నీతోనే నువ్వు పోటీపడు’ అనే మాటలు పిల్లల మీద బాగా పనిచేస్తాయి. ‘పాజిటివ్ సెల్ఫ్ థింకింగ్’ ఎప్పుడూ మంచి ప్రయోజనాలను ఇస్తుంది. అంటే మనతో మనం మాట్లాడుకోవాలి. ‘నేను చేయగలను, నా మీద నాకు నమ్మకం ఉంది. కష్టపడ్డాను కాబట్టి బాగా రాస్తాను’... ఇలా పిల్లలు ఎవరికి వారు తమకు తామే చెప్పుకోవడం వల్ల 100 శాతం ప్రయత్నిస్తారు. ఈ భావనను పెద్దలే పిల్లల్లో కలగజేయాలి. విశ్రాంతి పొందే ఉపాయాలు... బాగా నిద్రపోతే విశ్రాంతి లభిస్తుందని అర్థం కాదు. శరీరం, మైండ్ - రెండూ విశ్రాంతి పొందేలా మన చర్యలు ఉండాలి. ఒత్తిడి పెరిగినట్టుగా అనిపిస్తే అరికాళ్లు, అరిచేతులు చల్లని నీళ్లతో కడుక్కోమని చెప్పాలి. చదవడానికి ముందు, తర్వాత 5 సార్లు దీర్ఘశ్వాస తీసుకుంటూ, వదులుతూ ఉండాలి. ఇలా పది నిమిషాలు చేస్తే త్వరగా విశ్రాంతి లభిస్తుంది. అలాగే చదవడానికి ముందు తర్వాత కాళ్లూ చేతులు ఒంచుతూ శరీరాన్ని కొద్దిగా స్ట్రెచ్ చేయాలి. అప్పుడు మైండ్ చురుకు అవుతుంది. కంప్యూటర్లో సిపియుకి, మానిటర్కి మధ్య ఒక కేబుల్ కనెక్షన్ ఉంటుంది. ఇది ఏ ఎలుకో కట్ చేస్తే.. సిస్టమ్ పనిచేయదు. అలాగే భయం అనే ఎలుక వల్ల ఎంత బాగా చదివినా టైమ్‌కు గుర్తుకురాదు. భయానికి గల కారణాలు అన్వేషించి, వాటి నివారణ వైపు దృష్టి పెట్టాలి. అందరిలోనూ మైండ్ పవర్ ఒకటుంటుంది. ఆ ‘పవర్’ (శక్తి) ఏంటో పిల్లలకు తెలియదు. ఊహాశక్తి, సృజనాత్మక శక్తి, మనో నేత్రంతో వీక్షించే శక్తి, క్లిష్ట పరిస్థితిలోనూ కలిగే ఆలోచనాశక్తి... ఇవన్నీ ఉంటాయి. ఈ శక్తిని ఉపయోగించుకోమని చెప్పాలి.ఎవరికి వారు ‘మైండ్ మ్యాప్’ను ఒకటి తయారుచేసుకోవాలి. చదవదగినది, చదువుతున్నది, చదివినది.. ఇలా విభజించుకుంటూ ఆ మైండ్ మ్యాప్ ఉండాలి. {పశ్నలు-సమాధానాలు వరుసగా చదువుకుంటూ వెళ్లిపోతే గుర్తుండవు. అందులో ముఖ్యమైన పాయింట్స్‌ను లిస్ట్ చేసుకోవాలి. - డా. గీతా చల్లా, సైకాలజిస్ట్ www.sudishacounselingcentre.org